AP Government: దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు, మెగా షిప్‌బిల్డింగ్ క్లస్టర్
ABN , Publish Date - Jan 03 , 2026 | 05:03 AM
తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ స్థాపించేందుకు, గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మించేందుకు ఏపీ మారిటైమ్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
మారిటైమ్ బోర్డుకు సమ్మతి తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
దగదర్తి ఎయిర్‌పోర్టుకు 418.14 ఎకరాల భూసేకరణ
ఎయిర్‌పోర్టు అథారిటీకి ఆమోదం
అమరావతి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ స్థాపించేందుకు, గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మించేందుకు ఏపీ మారిటైమ్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. షిప్ బిల్డింగ్ డెవల్‌పమెంట్ స్కీమ్ (ఎస్‌బీడీఎస్) కింద విశాఖ పోర్టు ట్రస్టు సహకారంతో 2 వేల ఎకరాల్లో వీటిని ఏర్పాటు చేయడానికి సమ్మతించింది. ఈ మేరకు శుక్రవారం మౌలిక సదుపాయల కల్పనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మొవ్వ తిరుమల కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ పోర్టుతో పాటు.. షిప్ బిల్డింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని మారిటైమ్ బోర్డు సీఈవోను కృష్ణబాబు ఆదేశించారు. కేంద్ర నౌకాశ్రయ, నీటి రవాణా మంత్రిత్వశాఖ దేశంలో గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, షిప్‌బిల్డింగ్ క్లస్టర్లను నిర్మించేందుకు ప్రతిపాదనలను కోరింది. 2047 మారిటైమ్ అమృత్‌కాల్ విజన్ కింద రాష్ట్రాలకు భారీ లక్ష్యాలను నిర్దేశించింది. ప్రపంచశ్రేణిలో ఐదు షిప్‌బిల్డింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏటా 4.5 మిలియన్ గ్రాస్ టన్నెజ్ మెగా షిప్పింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ క్లస్టర్‌కు కేంద్ర ప్రభుత్వ నౌకాయాన అభివృద్ధి మంత్రిత్వశాఖ సంపూర్ణ సహకారం అందిస్తుంది. మెగా షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌కు విశాఖపట్నం పోర్టు ట్రస్టు సాంకేతిక, నిర్మాణ సహకారాన్ని అందిస్తుంది.
కేంద్ర నౌకాయాన అభివృద్ధి సంస్థ ప్రతిపాదనలు, రాష్ట్రానికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సమ్మతించాలంటూ ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో ప్రభుత్వాన్నిఅభ్యర్థించిన నేపథ్యంలో దుగరాజపట్నంలో మెగా షిప్‌బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటుకు మౌలిక సదుపాయాల కల్పనా శాఖ ఆమోదం తెలిపింది. దీంతో.. ఏపీ మారిటైమ్ బోర్డు టెక్నో ఎకనామిక్ ఫీజుబిలిటీ రిపోర్టు (టీఈఎ్‌ఫఆర్)ను మెస్సర్స్ రైట్స్ ద్వారా చేయించేందుకు సిద్ధమైంది. అలాగే దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం దామవరం వద్ద 418.14 ఎకరాల భూమిని ఎకరా రూ. 13 లక్షల చొప్పున సేకరించేందుకు ఏపీ ఎయిర్‌పోర్టు అథారిటీకి రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనా శాఖ ఆమోదం తెలిపింది.