గొంతెండుతున్న గ్రామాలకు నీళ్లు!
ABN , Publish Date - Jul 23 , 2026 | 05:22 AM
రాష్ట్రంలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామాలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థ బలోపేతం
రూ.1,811 కోట్లతో 2,943 పనులకు అనుమతులు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు
అమరావతి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామాలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 2,943 పనులకు రూ.1,811.81 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బుధవారం జీవో 94 జారీ చేసింది. ఈ పనులను తొలుత రూరల్ వాటర్ సప్లై ఎస్‌డీఎ్‌స(ప్లెయిన్) గ్రాంట్ ద్వారా చేపట్టి, అనంతరం జల్‌జీవన్ మిషన్ 2.0 లేదా ఇతర కేంద్ర నిధులతో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. జల్‌జీవన్ మిషన్‌ను కేంద్రం 2028 డిసెంబరు వరకు పొడిగించిన నేపథ్యంలో ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా తాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం వేగవంతం చేయనుంది. గ్రామాల్లో నివసించే ప్రతి ఒక్కరికీ రోజుకు 55 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యానికి అనుగుణంగా తగిన మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. తీవ్ర నీటి ఎద్దడి గ్రామాలను గుర్తించి ఇంజనీర్-ఇన్-చీ్‌ఫ ప్రతిపాదించిన 2,943 పనులను జిల్లాల వారీ ప్యాకేజీలుగా విభజించి త్వరితగతిన టెండర్లు పూర్తిచేసి అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
రూ.9,355 కోట్లతో 10 మెగా మల్టీ విలేజ్ స్కీంలు..
గ్రామీణ ప్రాంతాలకు శాశ్వత తాగునీటి భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ.9,355 కోట్ల వ్యయంతో 10 మెగా మల్టీ విలేజ్ స్కీమ్స్(ఎంవీఎస్) చేపట్టేందుకు పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బుధవారం జీవో 93 జారీ చేసింది. ఏలేరు రిజర్వాయర్ కింద కాకినాడ నియోజకవర్గానికి రూ.1,641 కోట్లు, అనకాపల్లికి రూ.1,550 కోట్లు, తాండవ పరిధిలో నర్సీపట్నం నియోజకవర్గానికి రూ.500 కోట్లు, గండికోట రిజర్వాయర్ ద్వారా మదనపల్లికి రూ.1,000కోట్లు, గండికోట(ఫేజ్-2) కింద పుంగనూరు, చంద్రగిరిలో కొంతభాగం, పలమనేరు-కుప్పం నియోజకవర్గాలకు రూ.1,886కోట్లు, హిరమండలం రిజర్వాయర్(ఫేజ్-2) ద్వారా టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాలకు రూ.1,204కోట్లు, పీఏబీఆర్ ఆధారంగా ఉరవకొండకు రూ.480కోట్లు, రాయదుర్గానికి రూ.390 కోట్లు, అవుకు కింద బనగానపల్లికి రూ.510కోట్లు, ధవళేశ్వరం పరిధిలో కడియం ప్రాంతాలకు రూ.194కోట్లకు ఆమోదం తెలిపింది.