Share News

అక్కడంతా బాగున్నారా?

ABN , Publish Date - Jun 18 , 2026 | 03:14 AM

విద్య, ఉద్యోగం, వ్యాపారం... మరేదైనా అవసరాలకోసం విదేశాలకు వలస వెళ్లిన వారి క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆరా తీయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది.

అక్కడంతా బాగున్నారా?

  • విదేశాలకు వలస వెళ్లిన వారిపై ఆరా

  • సచివాలయ మహిళా పోలీసులకు కొత్త బాధ్యతలు

  • మైగ్రేషన్‌ మానిటర్‌ అధికారులుగా నియామకం

  • ప్రతి మూడు నెలలకోసారి ప్రవాసుల యోగక్షేమాలపై ఆరా తీయాలని ఆదేశం

అమరావతి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): విద్య, ఉద్యోగం, వ్యాపారం... మరేదైనా అవసరాలకోసం విదేశాలకు వలస వెళ్లిన వారి క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆరా తీయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ప్రవాసుల వివరాలను గ్రామ, వార్డు స్థాయిలో నమోదు చేసేందుకు కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. ఇందుకోసం స్వర్ణగ్రామం, స్వర్ణవార్డు కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శి/మహిళా పోలీసులను మైగ్రేషన్‌ మానిటరింగ్‌ ఆఫీసర్లుగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏ సచివాలయంలో అయినా మహిళా పోలీసు పోస్టు ఖాళీగా ఉంటే.. ఇన్‌చార్జ్‌లను నియమించాలని ఈ ఉత్తర్వుల్లో సూచించింది. ఉద్యోగం, విద్య, వ్యాపారం తదితర అవసరాల కోసం గల్ఫ్‌, ఇతర దేశాలకు వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ‘‘నకిలీ వీసాలు, మోసపూరిత ఏజెంట్లు, అక్రమ నియామకాలు, మానవ అక్రమ రవాణా, జీతాలు చెల్లించకపోవడం, విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే ఘటనలు పెరుగుతున్నాయి’’ అని తెలిపింది. కొత్త విధానం ప్రకారం మహిళా పోలీసులు తమ పరిధిలో విదేశాలకు వెళ్లిన, వెళ్లబోయే వ్యక్తుల వివరాలు నమోదు చేయాలి. ఇప్పటికే విదేశాల్లో ఉన్న వారి సమాచారాన్ని కూడా సేకరించాలి. సురక్షిత, చట్టబద్ద విదేశీ వలసలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. విదేశాల్లో ఉన్న వలసదారులకు ప్రతి మూడు నెలలకోసారి వాట్సాప్‌ కాల్‌ చేసి వారి పరిస్థితిని తెలుసుకుని రికార్డు చేయాల్సి ఉంటుంది.


అనధికార ఏజెంట్లు, మధ్యవర్తుల కార్యకలాపాలపై నిఘా ఉంచడంతో పాటు విదేశాల్లో మరణాలు, నిర్బంధాలు, జీతాల సమస్యలు, అదృశ్యమైన ఘటనలు, బహిష్కరణ వంటి అత్యవసర పరిస్థితుల్లో కుటుంబాలకు సాయం అందించాల్సి ఉంటుంది. ఫిర్యాదుల పరిష్కారం, కౌన్సిలింగ్‌ సేవలు, అనుమానస్పద వలసలు, మానవ అక్రమ రవాణా అంశాల పర్యవేక్షణ కూడా వారి బాధ్యతల్లో భాగమేనని ప్రభుత్వం పేర్కొంది. జిల్లా కలెక్టరేట్‌లలో ఏర్పాటు చేసిన మైగ్రేషన్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్లతో గ్రామ, వార్డు స్థాయి అధికారుల సమన్వయం ఉండేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - Jun 18 , 2026 | 03:15 AM