50 ఏళ్లు దాటిన గీత కార్మికులకు పింఛన్
ABN , Publish Date - Jul 08 , 2026 | 05:08 AM
గీత కార్మికులకు 50 ఏళ్లు దాటితే పింఛను ఇస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
గీత కులాల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి: కొల్లు రవీంద్ర
రాజమహేంద్రవరం, రంపచోడవరం, జూలై 7(ఆంధ్రజ్యోతి): గీత కార్మికులకు 50 ఏళ్లు దాటితే పింఛను ఇస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గీత సామాజిక వర్గాలైన శెట్టిబలిజ, గౌడ, యాత, శ్రీశయన వర్గా ల ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మద్యం దుకాణాల కేటాయింపులో 10ు రిజర్వేషన్ కల్పించడంతోపాటు లైసెన్సు ఫీజులో 50ు రాయితీ ఇస్తున్నామన్నారు. ప్రమాదవశాత్తూ మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు కార్మిక శాఖ నుంచి రూ.5 లక్షలు, ఎక్సైజ్ నుంచి రూ.5 లక్షలు కలిపి రూ.10 లక్షలు అందజేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో బీచ్ శాక్స్ విధానాన్ని ప్రవేశ పెట్టనున్నామన్నారు. రాష్ట్రంలో తాటి ఉత్పత్తుల అభివృద్ధికి ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ చేపడుతోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పోలవరం జిల్లా రంపచోడవరం మండలంలోని పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ‘నీరా ప్రోత్సాహం- తాటి ఉత్పత్తుల అభివృద్ధి’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నీరా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సహజ పానీయమని, ప్రజల్లో దీనిపై విస్తృత అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.