Share News

పండగొచ్చింది!

ABN , Publish Date - Mar 18 , 2026 | 05:37 AM

ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జాబ్‌ క్యాలెండర్‌ విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 10 వేలకు పైగా పోస్టులతో గురువారం ఉగాది పండుగ సందర్భంగా ఈ ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రకటించనుంది.

పండగొచ్చింది!

  • నేడు, రేపు వరుస ‘కానుకలు’

  • నేటి నుంచే ‘దివ్యాంగ శక్తి’.. దివ్యాంగులకు ఉచిత బస్సు

  • నేడు పోలవరం నిర్వాసితులకు రూ.250 కోట్లు

  • 10 వేల పోస్టులతో రేపు జాబ్‌ క్యాలెండర్‌

  • మౌజన్‌లు, ఇమామ్‌ల వేతనం 20 గంటల్లోనే జమ

అటు ఉగాది... ఆ వెంటనే రంజాన్‌! రెండు పండగలకు రాష్ట్ర ప్రభుత్వం పలు ‘కానుకలు’ అందిస్తోంది. ‘దివ్యాంగ శక్తి’ పథకం బుధవారం నుంచే అమలులోకి రానుంది. ఇకపై దివ్యాంగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇక... ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ‘జాబ్‌ క్యాలెండర్‌’ విడుదలకు రంగం సిద్ధమైంది. 10వేలకుపైగా పోస్టులతో గురువారం దీనిని విడుదల చేయనున్నారు. ఇందులో కానిస్టేబుల్‌ నుంచి గ్రూప్‌-1 ఉద్యోగాల వరకు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు కోసం భూములు అందించిన నిర్వాసితులకు బుధవారం రూ.250 కోట్ల పరిహారం చెల్లించనున్నారు. కూటమి సర్కారు వచ్చాక దీపావళి, సంక్రాంతి పండగల ముందు రెండు విడతల్లో నిర్వాసితులకు రూ.1980 కోట్లను అందించారు. ఇప్పుడు... ఇది ఉగాది కానుక. అలాగే... ఇమామ్‌లు, మౌజన్‌లకు సోమవారం ముఖ్యమంత్రి విడుదల చేసిన వేతన మొత్తం రూ.45 కోట్లు... 20 గంటల్లోనే వారి ఖాతాల్లో జమ అయ్యాయి. దీనిపై సీఎంకు మంత్రి ఫరూక్‌ కృతజ్ఞతలు తెలిపారు.

అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జాబ్‌ క్యాలెండర్‌ విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 10 వేలకు పైగా పోస్టులతో గురువారం ఉగాది పండుగ సందర్భంగా ఈ ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రకటించనుంది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్‌ ‘ఎక్స్‌’ ద్వారా విడుదల చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపిన 10 వేల పోస్టులతో పాటు మరికొన్ని ఉద్యోగాలతో అధికారులు జాబ్‌ క్యాలెండర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం.. ఇందులో డీఎస్సీ, జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు 3 వేలు ఉంటాయి.


అందులో డీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉపాధ్యాయ ఉద్యోగాలు 2,600కు పైగా ఉంటాయి. యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది పోస్టులు 1,500 ఉంటాయి. గ్రూప్‌-1లో వందకు పైగా, గ్రూప్‌-2లో 470కు పైగా పోస్టులను భర్తీ చేస్తారు. ఇవి రెండూ కలిపి సుమారు 600 ఉంటాయి. వెయ్యి కానిస్టేబుల్‌ ఉద్యోగాలు, 400 ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులనూ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు భర్తీ చేస్తుంది. డీఎస్సీ నోటిఫికేషన్‌ పాఠశాల విద్యాశాఖ ఇస్తుంది. మిగిలిన వివిధ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. నిర్దేశిత గడువులో వీటిని భర్తీ చేసేలా అధికారులు క్యాలెండర్‌ రూపొందిస్తున్నారు.


చకచకా భర్తీకి చర్యలు

జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించడంతో పాటు ఆయా శాఖలు వేగంగా పోస్టులను భర్తీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. న్యాయ వివాదాలు తలెత్తకుండా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. న్యాయ వివాదాలు తలెత్తితే నోటిఫికేషన్ల పూర్తికి సుదీర్ఘ సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఆ పరిస్థితి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.

2600 టీచర్‌ పోస్టులు

ఈ జాబ్‌ క్యాలెండర్‌లో 2,600కు పైగా టీచర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. క్యాలెండర్‌ ప్రకటించిన వెంటనే పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ పోస్టులతో పాటు రాబోయే మూడేళ్ల కాలానికి ప్రకటించబోయే డీఎస్సీలపైనా ప్రణాళిక రూపొందిస్తోంది. ఇప్పటికే ఏటా డీఎస్సీ ఇస్తామని మంత్రి లోకేశ్‌ ప్రకటించారు. అందుకు అనుగుణంగా రాబోయే మూడు డీఎస్సీల్లోనూ సుమారు 7,500కు పైగా పోస్టులు భర్తీ చేసేలా అధికారులు ప్రణాళిక తయారు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 1,500 నుంచి 2 వేల వరకు టీచర్లు రిటైర్‌ అవుతుంటారు. ఆ పోస్టులను తర్వాతి రెండేళ్లలో డీఎస్సీల ద్వారా భర్తీ చేస్తారు. గతేడాది 16 వేల టీచర్‌ పోస్టులను కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీతో భర్తీ చేసిన విషయం తెలిసిందే. మొత్తంగా ఐదేళ్లలో దాదాపు 25 వేల టీచర్‌ ఉద్యోగాలు కూటమి ప్రభుత్వంలో భర్తీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Updated Date - Mar 18 , 2026 | 06:01 AM