Share News

ఇక స్వచ్ఛ గోదారి

ABN , Publish Date - Jun 17 , 2026 | 04:09 AM

రాష్ట్ర జీవనాడి గోదావరిలో కాలుష్య నియంత్రణకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి రంగంలోకి దిగనుందని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ చెప్పారు.

ఇక స్వచ్ఛ గోదారి

  • మిషన్‌ గోదావరి క్లీన్‌ ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు

  • నదీ కాలుష్యంపై అధ్యయనానికి కేంద్ర బృందం

  • నమామి గంగే తరహాలో గోదావరి ప్రక్షాళన

  • పుష్కరాల నాటికి నదిని శుద్ధి చేస్తాం

  • మధ్యప్రదేశ్‌ నుంచి ఏపీకి 50 అడవి దున్నలు

  • తీరంలో గ్రేట్‌ గ్రీన్‌వాల్‌కు కేంద్ర సహకారం

  • డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ వెల్లడి

  • ఢిల్లీలో కేంద్ర మంత్రులు భూపేంద్రయాదవ్‌, సీఆర్‌ పాటిల్‌, శివరాజ్‌సింగ్‌చౌహాన్‌తో భేటీ

  • 1న వీబీ జీ రాం జీకి ఏపీ నుంచే శ్రీకారం: చౌహాన్‌

  • ఏపీ ప్రగతిశీల రాష్ట్రం అంటూ ప్రశంస

న్యూఢిల్లీ, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర జీవనాడి గోదావరిలో కాలుష్య నియంత్రణకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి రంగంలోకి దిగనుందని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ చెప్పారు. పుష్కరాల నేపథ్యంలో గోదావరిలో కాలుష్య నియంత్రణకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుల్ని పంపి చర్యలు చేపట్టేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అంగీకారం తెలిపిందన్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీలో కేంద్ర అటవీ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో ఆయన నివాసంలో పవన్‌కల్యాణ్‌ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పవిత్ర గోదావరి నదిని మునిసిపల్‌, పారిశ్రామిక కాలుష్యం నుంచి పూర్తిగా రక్షించి స్వచ్ఛమైన నదీ వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు అవసరం అయిన సలహాలు, సూచనలు చేయాలని కేంద్ర మంత్రిని కోరామని పవన్‌ తెలిపారు. గోదావరి కాలుష్యంపై అధ్యయనానికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిసభ్యులను పంపుతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలోని నూతన అరణ్యభవన్‌లో మానవ, వన్యప్రాణి సంఘర్షణ నివారణ కేంద్రం హనుమాన్‌ మానిటరింగ్‌ సెంటర్‌, గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌ పర్యవేక్షణ కేంద్రం, ఫారెస్ట్‌ ఫైర్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, స్టేట్‌ టైగర్‌ మానిటరింగ్‌ వంటి అత్యాధునిక విభాగాలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. వీటితో పాటు చిత్తూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోకి పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న ఏనుగులను పర్యవేక్షించేందుకు మానిటరింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు.


దీని వల్ల ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించే అవకాశం లభిస్తుందని అన్నారు. ఒడిశా నుంచి శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు ఇప్పించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు చెప్పారు. నాగార్జున సాగర్‌, శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో బేస్‌ క్యాంపులు పెంచుకునేందుకు కేంద్రమంత్రిని అనుమతి కోరామన్నారు. ప్రస్తుతం ఇక్కడ 90 బేస్‌ క్యాంపులు ఉండగా వాటిని 150కి పెంచుకోవాల్సి ఉందని, అందుకోసం 300 మంది అదనపు గార్డులు అవసరమని తెలిపారు. గార్డులుగా స్థానిక చెంచు యువతే ఉంటారని చెప్పారు. ఏపీలో అంతరించిపోయిన అడవి దున్నల (ఇండియన్‌ గౌర్‌) పునరుద్ధరణ చర్యలకు సహకారం కోరామన్నారు. మధ్యప్రదేశ్‌ నుంచి 50 అడవి దున్నలను ఇప్పించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌యాదవ్‌తో కేంద్రమంత్రి మాట్లాడారని సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వాటిని ఏపీకి పంపేందుకు వారు పెద్ద మనసుతో ఒప్పుకొన్నారని పవన్‌ తెలిపారు. తాను స్వయంగా మధ్యప్రదేశ్‌కు వెళ్లి మరోసారి విజ్ఞప్తి చేస్తానని చెప్పారు. ఏపీలో మగ పులుల సంఖ్య పెరిగి ఆడ పులుల సంఖ్య తగ్గిందని, అందువల్ల ఆరు ఆడ పులులను ఏపీకి తీసుకువచ్చేందుకు సహకారం కోరామన్నారు. మహరాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ 4 ఆడ పులులు ఇచ్చేందుకు అంగికరించారని, మధ్యప్రదేశ్‌ నుంచి మరో రెండు తీసుకోనున్నామని చెప్పారు. గ్రీన్‌ ఇండియా మిషన్‌ కింద ఏపీకి సహకారం అందించడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 1,050 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతాన్ని ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించుకునేందుకు గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టుకు నిధులివ్వాలన్న విజ్ఞప్తికి కేంద్ర మంత్రి అంగీకరించినట్లు చెప్పారు.


గోదావరి ప్రాశస్త్యాన్ని కాపాడాలి

నమామి గంగే ప్రాజెక్టు తరహాలో క్లీన్‌ గోదావరి నది ప్రాజెక్టుని చేపట్టి గోదావరి నది ప్రాశస్త్యాన్ని కాపాడేలా కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కోరారు. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలను స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు థీమ్‌తో చేపడుతున్నామని ఆయనకు వివరించారు. దీనికి కేంద్రం సహకారం చాలా అవసరమని అన్నారు. ఢిల్లీలో మంగళవారం మధ్యాహ్నం కేంద్ర జల్‌శక్తి మంత్రి పాటిల్‌తో ఆయన నివాసంలో పవన్‌ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘గోదావరి పుష్కరాలకు కోట్లాది మంది వస్తారు. వారికి ఆ నది గొప్పతనం తెలిపేలా, నదిని అత్యంత శుభ్రంగా ఉంచాలన్నది కూటమి ప్రభుత్వ ఆలోచన. దీనికి కేంద్రం తగిన విధంగా సహకారం అందించాలి. పుష్కరాలకు ముందే గోదావరి కాలుష్యాన్ని నివారించే చర్యలు తీసుకుంటాం. పుష్కరాల నిమిత్తం మోడల్‌ పంచాయతీల అభివృద్ధి, భక్తుల రద్దీ నియంత్రణ, సౌకర్యాల కల్పన అంశాలలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర మంత్రి ప్రశంసించారు. మహాకుంభ్‌లో చేసిన ఏర్పాట్లు, భక్తుల రద్దీ నియంత్రణ తరహా మోడల్‌ను వచ్చే పుష్కరాల్లో అమలు చేేస విధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సహకరించాలని కోరాం. జల్‌ జీవన్‌ మిషన్‌కు కేంద్రం నుంచి మరింత సహకారం అందించాలని విజ్ఞప్తి చేశాం’’ అని పవన్‌ తెలిపారు.


ఏపీకి అన్ని విధాలా సహకారం: శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

వీబీ జీ రాం జీ పథకం జాతీయ ప్రారంభోత్సవం వచ్చే నెల1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ నుంచి జరుగుతుందని కేంద్ర గ్రామీణాభివృద్థి, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి మంత్రులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తమ రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీలోని కృషిభవన్‌లో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో సమావేశమయ్యారు. ఏపీలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి కల్పన, జీవనోపాధి పెంపుదల, పంచాయతీ అభివృద్ధి, వివిధ కేంద్ర పథకాల అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి ప్రయాణాన్ని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అభినందిస్తూ, దేశంలోని అత్యంత ప్రగతిశీల రాష్ట్రాలలో ఒకటిగా పేరుగాంచిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చేసిన విజయవంతమైన నమూనాలు, ఆవిష్కరణలను దేశంలోని ఇతర రాష్ట్రాలతో పంచుకుంటామని, దీనివల్ల గ్రామీణాభివృద్ధిలో ఉత్తమ పద్ధతులు దేశవ్యాప్తంగా అమలవుతాయని చెప్పారు. రాష్ట్ర విజయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, గ్రామీణాభివృద్థి మంత్రిత్వ శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వీబీ జీ రాం జీ పథకంలో ఏపీలో కాఫీ తోటల పెంపకాన్ని చేర్చినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ నెల 28, 29వ తేదీల్లో ఢిల్లీలో జరిగే జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సులో పాల్గొనాలని పవన్‌ను శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కోరారు. ఈ సందర్భంగా పవన్‌ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి పనులు, పథకాల పురోగతిని వివరించారు. వీబీ జీ రాంజీ పథకం కింద ఏపీకి రూ. 7,700 కోట్లకు పైగా నిధులను అందించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడుతూ, గోదావరి పుష్కరాల నిర్వహణ నిమిత్తం ఎంపిక చేసిన 260 మోడల్‌ పంచాయతీలను వీబీ జీ రాం జీ కార్యక్రమం కింద అభివృద్ధి చేేసందుకు ప్రత్యేక సహకారం అందించడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ముందుకు వచ్చిందని తెలిపారు.

Updated Date - Jun 17 , 2026 | 04:11 AM