Share News

జగన్‌ మామ మోసం

ABN , Publish Date - Aug 08 , 2026 | 05:12 AM

చిన్నారులకు తాను మేనమామనంటూ గొప్పలు చెప్పుకొన్న జగన్‌.. ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ‘నూతన బాలిక సంరక్షణ పథకాన్ని’ నీరుగార్చారు.

జగన్‌ మామ మోసం

  • నూతన బాలిక సంరక్షణ పథకానికి తూట్లు.. ఐదేళ్లూ రూపాయీ ప్రీమియం కట్టలేదు

  • ఎల్‌ఐసీకి రూ.200 కోట్ల బకాయి.. 1.50 లక్షల మంది బాండ్ల మెచ్యూరిటీ

  • బాండ్లు చెల్లవంటున్న ఎల్‌ఐసీ.. జగన్‌ సర్కారు నిర్వాకంతో ఆడబిడ్డలకు నిరాశ

  • గత టీడీపీ ప్రభుత్వం 75 కోట్లు చెల్లింపు.. బెనిఫిట్స్‌ ఇప్పించాలని తల్లిదండ్రుల వినతి

అమరావతి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): చిన్నారులకు తాను మేనమామనంటూ గొప్పలు చెప్పుకొన్న జగన్‌.. ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ‘నూతన బాలిక సంరక్షణ పథకాన్ని’ నీరుగార్చారు. తన ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా ఈ పథకానికి ప్రీమియం కట్టలేదు. ఎల్‌ఐసీకి దాదాపు రూ.200 కోట్లు బకాయి పెట్టారు. ఫలితంగా బాండ్లు మెచ్యూరిటీ అయినవారు ఇప్పుడు డబ్బులు అందక ఇబ్బంది పడుతున్నారు. ప్రీమియం చెల్లించకపోవడంతో బాండ్లు మెచ్యూరిటీ అయినా డబ్బులు చెల్లించలేమని లబ్ధిదారులకు ఎల్‌ఐసీ అధికారులు చెబుతున్నారు. బాల్య వివాహాలను అరికట్టడం, విద్యను ప్రోత్సహించడం కోసం ఓ కుటుంబంలో ఒక బాలిక ఉంటే లక్ష రూపాయలు, ఇద్దరు బాలికలు ఉంటే ఒక్కొక్కరికి రూ.30 వేలు చొప్పున రూ.60 వేలు అందజేసేలా ఉమ్మడి రాష్ట్రంలో 2005లో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం అమలుకు అప్పట్లో మహిళా శిశు సంక్షేమశాఖ, ఎల్‌ఐసీతో ఒప్పందం చేసుకుని బాండ్లు జారీ చేసింది. ఆడపిల్లల వయసు 20 ఏళ్లు నిండిన తర్వాత వారికి డబ్బు చెల్లిస్తారు. 2014 వరకు ఉమ్మడి ఏపీలో ఎల్‌ఐసీకి నాటి ప్రభుత్వాలు ప్రీమియం కడుతూ వచ్చాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో 4,39,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఒకేసారి రూ.75 కోట్లు ప్రీమియంగా ఎల్‌ఐసీకి చెల్లించింది. ఇంకా కొంత కట్టాల్సి ఉంది. 2014 వరకు ఈ పథకం కొనసాగింది.


ఆ తర్వాత ఈ పథకం కింద కొత్త లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకోలేదు. అప్పటి వరకు స్కీంలో ఉన్న వారికి బాండ్లు మెచ్యూరిటీ అయిన తర్వాత డబ్బులు చెల్లించాలి. అయితే 2019 నుంచి 2024 వరకు జగన్‌ సర్కారు ఈ పథకం కింద ఎల్‌ఐసీకి ఒక్క రూపాయి ప్రీమియం కట్టలేదు. ఈ కాలంలో దాదాపు లక్షా 50 వేల మంది బాండ్లు మెచ్యూరిటీ అయ్యాయి. అప్పటి బాలికలకు 20 ఏళ్లు నిండటంతో ఉన్నత విద్య, వివాహాలకు ఈ డబ్బు ఉపయోగపడుతుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే జగన్‌ సర్కారు నిర్వాకంతో ఈ పథకం కింద డబ్బులు రావడం లేదు. ప్రీమియం కట్టనందున బాండ్లు చెల్లవని ఎల్‌ఐసీ అధికారులు చెబుతున్నారు. ఈ పథకానికి ప్రీమియం కింద ఎల్‌ఐసీకి సుమారు రూ500 కోట్లు చెల్లించాలని అంచనా. దీనిపై ఎల్‌ఐసీతో మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వం ప్రీమియం చెల్లించి తమకు నగదు అందేలా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Updated Date - Aug 08 , 2026 | 05:13 AM