గ్రామీణాభివృద్ధిలో ఏపీకి జాతీయ గుర్తింపు
ABN , Publish Date - Jul 17 , 2026 | 04:48 AM
గ్రామీణాభివృద్ధిలో రాష్ర్టానికి మరోసారి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, గ్రామీణ మౌలిక వసతుల కల్పన, పేదకుటుంబాల ఆర్థిక భద్రత వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా తన ప్రత్యేకతను చాటుకుంది.
‘ఉపాధి’ నుంచి.. మహిళా సంఘాల సాధికారత వరకు.. కేంద్ర నివేదికల్లో ఏపీ విజయగాథ
మహిళా సంఘాలకు రూ.41,759కోట్ల రుణాలు
74.76 లక్షల మహిళలకు బీమా రక్షణ
గ్రామీణ పేదరిక నిర్మూలనలో ఏపీ మోడల్‌ను ప్రతిబింబించిన కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ విశ్లేషణ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గ్రామీణాభివృద్ధిలో రాష్ర్టానికి మరోసారి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, గ్రామీణ మౌలిక వసతుల కల్పన, పేదకుటుంబాల ఆర్థిక భద్రత వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా తన ప్రత్యేకతను చాటుకుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల విడుదల చేసిన ‘కీ ఇండికేటర్స్ అండ్ అనలిటికల్ ఓవర్‌వ్యూ ఆఫ్ స్కీమ్స్-2024-25’ నివేదికలో ఉపాధి హామీ పథకం, దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్(డే-ఎన్‌ఆర్‌ఎల్‌ఎం), ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన(పీఎంజీఎ్‌సవై), ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్(పీఎంఏవై-జీ) అమల్లో ఏపీ విశేష ప్రగతిని నమోదు చేసినట్లు వెల్లడైంది. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడం, మహిళా సంఘాల ద్వారా ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడం, బ్యాంకింగ్ సేవలను గ్రామస్థాయికి తీసుకెళ్లడం, కోట్లాది మహిళలకు బీమా రక్షణ కల్పించడం వంటి అంశాల్లో ఏపీ దేశంలోని అగ్రగామి రాష్ట్రాల సరసన నిలిచిందని నివేదిక పేర్కొంది.
ఉపాధి హామీ అమల్లో అత్యుత్తమ రాష్ట్రం
ఉపాధి హామీ పథకం అమలుపై కేంద్రం చేసిన విశ్లేషణలో రాష్ర్టానికి అత్యున్నత గుర్తింపు లభించింది. సగటు పనిదినాలు, 100 రోజుల ఉపాఽధి పూర్తిచేసిన కుటుంబాల సంఖ్య వంటి కీలక సూచీల ఆధారంగా దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరచిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ను చేర్చింది. కేరళ, మిజోరం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్‌లతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను కూడా స్ట్రాంగ్ ఫెర్మార్మర్‌గా కేంద్రం పేర్కొంది.
మహిళా సంఘాల విప్లవానికి చిరునామా
మహిళా స్వయం సహాయక సంఘాల ఉద్యమానికి ఏపీ చాలాకాలంగా మార్గదర్శక రాష్ట్రంగా నిలుస్తోంది. అదే విషయాన్ని కేంద్ర నివేదిక ధుృవీకరించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,65,863 స్వయం సహాయక సంఘాలు పనిచేస్తుండగా, వాటికి బ్యాంకుల ద్వారా రూ.41,759 కోట్ల రుణాలు పంపిణీ అయ్యాయి. దేశవ్యాప్తంగా మహిళా సంఘాలకు అత్యధిక రుణాలు అందించిన రాష్ట్రాల్లో ఏపీ రెండోస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా మహిళా సంఘాలకు 2024-25లో రూ.1.93 లక్షల కోట్లకు పైగా బ్యాంకురుణాలు విడుదలయ్యాయి. అందులో ఏపీ వాటా రూ.41,759 కోట్లకు పైగా ఉండటం రాష్ట్ర మహిళా సంఘాల బలోపేతానికి నిదర్శనమని కేంద్రం పేర్కొంది.
మహిళల భద్రతలో ముందంజ
గ్రామీణ మహిళల సామాజిక భద్రత విషయంలోనూ ఏపీ విశేష పురోగతి సాధించింది. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద 74,76,365 మంది మహిళలు ప్రమాద బీమా పరిధిలోకి వచ్చారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద 52,28,705 మంది మహిళలు బీమా రక్షణ పొందారు. మహిళా సంఘాల ద్వారా బీమా పథకాల అమల్లో దేశంలో అత్యధిక లబ్ధిదారులు కలిగిన రాష్ట్రాలో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. మహిళా సంఘాలను కేవలం పొదుపు సంఘాలుగా కాకుండా కుటుంబ ఆర్థిక వ్యవస్థకు బలమైన ఆధారంగా తీర్చిదిద్దడంలో ఏపీ విజయం సాధించిందని నివేదిక పేర్కొంది.
కొనసాగుతున్న గ్రామీణ రహదారుల అభివృద్ధి
ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రాష్ట్రానికి 2024-25లో 1710 కి.మీ గ్రామీణ రహదారుల లక్ష్యం నిర్దేశించగా, 387 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. మొత్తం లక్ష్యంలో 23 శాతం పనులు పూర్తి చేసినట్లు నివేదిక తెలిపింది. రహదారుల ద్వారా గ్రామాలను మార్కెట్లు, విద్యాసంస్థలు, ఆసుపత్రులతో అనుసంధానించడమే లక్ష్యమని కేంద్రం వివరించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ కింద ఆంధ్రప్రదేశ్‌లో 8333 ఇళ్లు పూర్తికాగా, 505 ఇళ్లకు కొత్తగా మంజూరు లభించింది. ఇళ్ల నిర్మాణంతో పాటు లబ్ధిదారులకు మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీటి కనెక్షన్లు, ఎల్‌పీజీ గ్యాస్ వంటి ప్రాథమిక సదుపాయాలను కూడా కల్పించడం రాష్ట్ర ప్రత్యేకతగా నివేదిక పేర్కొంది.
పేదరిక నిర్మూలనకు సమగ్ర విధానం
గ్రామీణాభివృద్ధి పథకాల అమల్లో ఆంధ్రప్రదేశ్ సమగ్ర ధృక్పథంతో ముందుకు సాగుతోందని కేంద్రం అభిప్రాయపడింది. ఒక వైపు ఉపాధి హామీ ద్వారా ఆదాయం, మరో వైపు మహిళా సంఘాల ద్వారా స్వయం ఉపాధి, బ్యాంకు రుణాలు, బీమా, గృహ నిర్మాణం, గ్రామీణ మౌలిక వసతుల కల్పన ద్వారా గ్రామీణ కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా రాష్ట్రం పనిచేస్తోందని విశ్లేషించింది.