ఏపీకి పారిశ్రామిక దన్ను
ABN , Publish Date - Feb 03 , 2026 | 04:06 AM
కేంద్రప్రభుత్వం ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామికంగా, ఆర్థికంగా దన్ను లభించింది.
బడ్జెట్‌లో వరాలు.. రేర్ ఎర్ ్త కారిడార్ ఏర్పాటుకు నిర్ణయం
ఈస్ట్ కోస్ట్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి
పోలవరం ప్రాజెక్టుకు రూ.3,320 కోట్లు
అమరావతి అభివృద్ధికి రూ.1,128 కోట్లు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వం ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామికంగా, ఆర్థికంగా దన్ను లభించింది. ముఖ్యంగా మైనింగ్, ఉత్పత్తి, పరిశోధన, క్రమబద్ధీకరణను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో రేర్ ఎర్ ్తకారిడార్‌ను నెలకొల్పాలని నిర్ణయించింది. పూర్వోదయ పథకం కింద ఆంధ్రప్రదేశ్ సహా ఐదు పూర్వోదయ రాష్ట్రాల్లో సమగ్ర ఈస్ట్ కోస్ట్ పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా ఉన్న ఈ కారిడార్.. కోల్‌కతా నుంచి కన్యాకుమారి వరకు 2,500 కిలోమీటర్ల మేర విస్తరించింది. రాష్ట్రంలోని అరకు లోయలో ప్రపంచ స్థాయి ట్రెక్కింగ్, హైకింగ్ సౌకర్యాలు కల్పించనున్నారు. డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు 2047 వరకు టాక్స్ హాలిడే ప్రకటించటంతో ఏపీకి మరిన్ని డేటా సెంటర్లు వచ్చే అవకాశం ఉంది. రూ.1,000 కోట్లకు మించి విలువైన మునిసిపల్ బాండ్లు జారీచేసే నగరపాలక సంస్థలకు రూ.100 కోట్ల ప్రోత్సాహం అందివ్వాలని నిర్ణయించటంతో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి తదితర నగరపాలక సంస్థలకు నిధులు లభించనున్నాయి. అమరావతి ఇన్‌క్లూసివ్ అండ్ సస్టెయినబుల్ క్యాపిటల్ సిటీ అభివృద్ధికి (ఏడీబీ నిధులు) రూ.1,128.91 కోట్లు కేటాయించటంతో నగర నిర్మాణం వేగవంతం కానుంది. నగర ఆర్థిక మండలిలో భాగంగా ఐదేళ్లపాటు రూ.5వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో మరిన్ని నిధులు లభించే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్‌లో రూ.3,320.39 కోట్లు కేటాయించారు.