Greenfield Expressway: మరో గ్రీన్‌ఫీల్డ్ హైవేతో ఏపీ అనుసంధానం
ABN , Publish Date - Jan 01 , 2026 | 05:21 AM
ఆంధ్రప్రదేశ్‌కు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ కారిడార్ అనుసంధానం కానుంది. దేశంలో రెండు జాతీయ రహదారులను రూ.20,668 కోట్లతో అభివృద్ధి చేసే ప్రాజెక్టులకు...
నాసిక్-సోలాపూర్-అక్కల్‌కోట్ మధ్య రూ.19,142 కోట్లతో 6 వరుసల హైవే
సోలాపూర్-చెన్నై రహదారితో దీనికి లింకు.. కర్నూలు, కడప, రేణిగుంట మీదుగా ప్రయాణం
న్యూఢిల్లీ/కర్నూలు, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ కారిడార్ అనుసంధానం కానుంది. దేశంలో రెండు జాతీయ రహదారులను రూ.20,668 కోట్లతో అభివృద్ధి చేసే ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ పచ్చజెండా ఊపింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో మహారాష్ట్రలోని నాసిక్-సోలాపూర్-అక్కల్‌కోట్ వరకు రూ.19,142 కోట్ల అంచనా వ్యయంతో బీవోటీ విధానంలో 374 కిలోమీటర్ల మేర ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ కారిడార్ నిర్మిస్తారు. రూ.1,526 కోట్లతో ఒడిసాలోని జాతీయ రహదారి ఎన్‌హెచ్-326 (మోహన-కోరాపుట్)ను 206 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. నాసిక్-సోలాపూర్-అక్కల్‌కోట్ గ్రీన్‌ఫీల్డ్ రహదారి.. చెన్నై-సూరత్ ఎకనామిక్ కారిడార్‌లో కీలకం. ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేను.. సోలాపూర్-చెన్నై మధ్య ప్రస్తుతం నిర్మిస్తున్న 4 వరుసల జాతీయ రహదారితో సోలాపూర్ వద్ద అనుసంధానిస్తారు. సోలాపూర్-చెన్నై రోడ్డు కర్ణాటకలోని కోస్గి, రాయచూరు, తెలంగాణలోని మహబూబ్‌నగర్, ఏపీలోని కర్నూలు, నంద్యాల, కడప, రేణిగుంట మీదుగా తమిళనాడులోని చెన్నై పోర్టుకు వెళ్తుంది. ప్రతిపాదిత నూతన గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ కారిడార్‌ను దీనికి లింక్ చేయడం వల్ల రాయలసీమ జిల్లాల నుంచి మహారాష్ట్రలోని ముంబై, పుణే, నాసిక్ వంటి నగరాలకు రవాణా సమయం భారీగా తగ్గనుంది. ఏపీలోని పారిశ్రామిక హబ్‌లు ఓర్వకల్, కొప్పర్తికి సరుకు రవాణా మెరుగుపడనుంది. ముఖ్యంగా సూరత్-చెన్నై మధ్య దూరం 201 కిలోమీటర్లు తగ్గుతుంది. ప్రయాణ సమయం కూడా 31 గంటల నుంచి 17 గంటలకు గణనీయంగా తగ్గనుంది. ఈ ప్రాజెక్టుతో 2.51 కోట్ల ప్రత్యక్ష పనిదినాలు, 3.13 కోట్ల పరోక్ష పనిదినాల ఉపాధి దొరుకుతుంది. ఈ ప్రాజెక్టు మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు జీవనాడిలాంటిదని, ఉపాధి అవకాశాలు ఎంతగానో పెరుగుతాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ఎన్‌హెచ్-326 విస్తరణతో మోహన-కోరాపుట్ నుంచి రాయ్‌పూర్-విశాఖపట్నం కారిడార్‌కు అనుసంధానం ఏర్పడుతుంది. ఛత్తీస్‌గఢ్, ఒడిసా నుంచి విశాఖపట్నం పోర్టుకు సరుకు రవాణా వేగంగా జరుగుతుంది.
పశ్చిమ తీరం నుంచి తూర్పు తీరానికి అనుసంధానం
దేశంలో పశ్చిమ తీరాన్ని తూర్పు తీరానికి అనుసంధానించడంలో భాగంగా నాసిక్-సోలాపూర్-అక్కల్‌కోట్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ కారిడార్ నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే చెన్నై పోర్టు నుంచి తిరువళ్లూరు, ఏపీలో రేణిగుంట, కడప, కర్నూలు మీదుగా మహారాష్ట్రలోని హసాపూర్(సోలాపూర్) వరకు సాగే 700 కిలోమీటర్ల నాలుగు వరుసల జాతీయ రహదారి కారిడార్ పనులు కర్నూలు వద్ద జోరుగా జరుగుతున్నాయి. ఈ రెండు కారిడార్‌లు అనుసంధానమైతే కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్‌లలో స్థాపించే వివిధ పరిశ్రమలు ఉత్పత్తి చేసే సరుకు రవాణాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పశ్చిమ భారతం నుంచి తిరుమల చేరుకోవడానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సోలాపూర్-చెన్నై హైవేలో భాగంగా కర్నూలు శివారులో తుంగభద్ర, హంద్రీ నదులపై భారీ వంతెనల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల అనుసంధానంతో కొప్పర్తి, ఓర్వకల్లు నోడ్‌లలో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. తద్వారా సీమలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతాయి. ప్రస్తుతం కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి, అనంతపురం జిల్లాల వాసులు హైదరాబాద్ మీదుగా సోలాపూర్ వెళ్లాల్సి వస్తోంది. సోలాపూర్-చెన్నై హైవే నిర్మాణం పూర్తయితే కర్నూలు, మహబూబ్‌నగర్, రాయచూరు మీదుగా సోలాపూర్ చేరుకోవచ్చు. కర్నూలు నుంచి సోలాపూర్‌కు దాదాపు 100 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.