Share News

జెన్కో ఆల్‌టైమ్‌ రికార్డు

ABN , Publish Date - Mar 13 , 2026 | 04:07 AM

రాష్ట్ర చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ (ఏపీ జెన్కో) రికార్డు స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి సాధించింది.

జెన్కో ఆల్‌టైమ్‌ రికార్డు

  • 11న 6,160 మెగావాట్ల థర్మల్‌ విద్యుదుత్పత్తి

  • రాష్ట్రంలోని ప్లాంట్ల సామర్థ్యం 6,610 మెగావాట్లు

  • అందులో 93.19 శాతం నమోదు చేసిన ప్లాంట్లు

  • రాష్ట్ర చరిత్రలోనే ఒక్క రోజులో ఇదే అత్యధికం

  • వైసీపీ హయాంలో గరిష్ఠ ఉత్పత్తి 4 వేల మెగావాట్లే

  • నాణ్యమైన బొగ్గు, మెరుగైన ప్లాంట్ల నిర్వహణతోనే రికార్డు

  • చంద్రబాబు దార్శనికత ఫలితమే..: మంత్రి గొట్టిపాటి

అమరావతి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ (ఏపీ జెన్కో) రికార్డు స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి సాధించింది. ఈ నెల 11న (బుధవారం) ఒక్కరోజులో 6,160 మెగావాట్ల థర్మల్‌ విద్యుదుత్పత్తి చేయడం ద్వారా.. సంస్థ తన జీవిత కాల (లైఫ్‌ టైమ్‌) రికార్డు నమోదు చేసింది. జెన్కో థర్మల్‌ ప్రాజెక్టుల స్థాపిత సామర్థ్యం 6,610 మెగావాట్లు కాగా, 6,160 మెగావాట్ల ఉత్పత్తి సాధించింది. తద్వారా సామర్థ్యంలో ఏకంగా 93.19 శాతం ఉత్పత్తి నమోదు చేయడం గమనార్హం. జెన్కో స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇదే అత్యధిక రికార్డు. ఈ ఏడాది జనవరిలోనూ రికార్డు స్థాయిలో 6,101 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తి నమోదు చేసింది. అదేవిధంగా గురువారం 6,124 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తును ఉత్పత్తి చేయగా, హైడల్‌ ప్రాజెక్టుల ద్వారా వెయ్యి మెగావాట్లు విద్యుదుత్పత్తి చేశారు. మొత్తంగా 12న 7,124 మెగావాట్ల విద్యుత్తును గ్రిడ్‌కు అందించారు.


ఆర్థికాభివృద్ధికి సానుకూల సంకేతం: మంత్రి

రికార్డు స్థాయి విద్యుదుత్పత్తితో పాటు రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్‌ను విజయవంతంగా తీర్చడం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సానుకూల సంకేతమని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ పేర్కొన్నారు. జెన్కో రికార్డు స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి సాధించడంపై ఆయన అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ రికార్డు సాధనకు సీఎం చంద్రబాబు దార్శనికతతో ఇచ్చిన సలహాలు, సూచనలతోపాటు జెన్కో సిబ్బంది కృషి కూడా ప్రధాన కారణమన్నారు. గురువారం జెన్కో అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. వేసవిలో విద్యుత్తు వినియోగం పెరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని గృహ, పారిశ్రామిక, వ్యాపార అవసరాలకు నిరంతర విద్యుత్తు సరఫరాకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జెన్కోను నాశనం చేశారని, ప్రైవేటు సంస్థల నుంచి అధిక ధరలకు విద్యుత్తు కొనుగోలు చేసి, రాష్ట్ర ప్రజలపై రూ.32 వేల కోట్ల భారాన్ని మోపారని విమర్శించారు. 9 సార్లు విద్యుత్తు చార్జీలను పెంచారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధం గా 13 పైసలు తగ్గించి, ట్రూ డౌన్‌ను అమలు చేసిందన్నారు. సమావేశంలో సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌, జెన్కో ఎండీ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


గాడిన పడ్డ థర్మల్‌, హైడల్‌ ప్లాంట్లు

ఏపీ జెన్కో, ఏపీ విద్యుత్తు అభివృద్ధి సంస్థ (ఏపీపీడీసీఎల్‌)కు విజయవాడలోనార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (2,560 మెగావాట్లు), కడపలో ఎంవీఆర్‌ రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు (1,650 మెగావాట్లు), నెల్లూరులోని కృష్ణపట్నంలో దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (2,400 మెగావాట్లు) ఉన్నాయి. వైసీపీ హయాంలో వీటి ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తే కష్టమయ్యేది. అప్పట్లో నాసిరకం బొగ్గు వినియోగంతో విద్యుదుత్పత్తిపై గణనీయమైన ప్రభావం పడేది. కృష్ణపట్నం ప్లాంటును ప్రైవేటుపరం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత థర్మల్‌, హైడల్‌ ప్లాంట్లను గాడిలో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యుత్తు ఉత్పత్తిని మెరుగుపర్చేందుకు నాణ్యమైన బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారు. థర్మల్‌ ప్లాం ట్లలో 70 శాతం విదేశీ బొగ్గు (6 వేల జీసీవీ- గ్రాస్‌ కెలోరిఫిక్‌ వాల్యూ), 30 శాతం స్థానిక బొగ్గును వినియోగిస్తున్నారు. ఫలితంగా విద్యుత్తు ఉత్పత్తి గణనీయంగా మెరుగుపడింది.

Updated Date - Mar 13 , 2026 | 04:08 AM