Share News

కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Apr 28 , 2026 | 04:25 AM

పెట్రోలు, డీజిల్‌ను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తూ.. కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

  • ఇంధన సమస్య పరిష్కారమయ్యే వరకు చమురు కంపెనీలు నిరంతరం పనిచేయాలి

  • జాప్యం లేకుండా బంకులకు సరఫరా చేయాలి

  • కలెక్టర్లు, ఎస్పీల పర్యవేక్షణలో సరఫరా సాగాలి

  • ప్రతి 3 గంటలకు నివేదిక ఇవ్వాలి: చంద్రబాబు

  • పెట్రోలు, డీజిల్‌ కొరతపై సీఎం టెలి కాన్ఫరెన్స్‌

అమరావతి, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): పెట్రోలు, డీజిల్‌ను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తూ.. కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇంధన సమస్య సమసిపోయే వరకు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు నిరంతరాయంగా పని చేయాలన్నారు. ఆయిల్‌ డిపోల నుంచి రిటైల్‌ ఔట్‌లెట్ల(పెట్రోలు బంకులు)కు జాప్యం లేకుండా ట్యాంకర్లు చేరుకునేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో నెలకొన్న పెట్రోలు, డీజిల్‌ కొరతపై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు ఆదివారం ఉదయం ముంబై నుంచి ఒకసారి, మధ్యాహ్నం రాష్ట్రానికి వచ్చిన తర్వాత రెండోసారి ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోవడంతో సోమవారం ఉదయం మరోసారి పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌, ఆ శాఖ ఉన్నతాధికారులు, చమురు కంపెనీల ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై వివరణ కోరారు. డిపోల నుంచి ఉదయమే ఆయిల్‌ ట్యాంకర్లు బయల్దేరాయని, సాయంత్రానికల్లా బంకులకు చేరుకుంటాయని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. సాయంత్రానికి రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్నారు. పెట్రోలు, డీజిల్‌ సరఫరా సాధారణ స్థితికి వచ్చేవరకు అధికారులు, ఆయిల్‌ కంపెనీలు సమన్వయంతో పనిచేయాలని సఎం ఆదేశించారు. జిల్లాల్లో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా కలెక్టర్లు, ఎస్పీల పర్యవేక్షణలో పెట్రోలు, డీజిల్‌ సరఫరా జరిగేలా చూడాలని.. కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఆయిల్‌ డిపోల వద్దకు వెళ్లి స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో ఇంధన సరఫరా పరిస్థితులపై ఆర్టీజీఎస్‌ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రతి 3 గంటలకు నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మీడియా, సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాలు, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా అధికారులు వేగంగా స్పందించాలని సూచించారు.


పెరిగిన సరఫరా.. తగ్గిన క్యూలైన్లు: మంత్రి

సోమవారం మధ్యాహ్నానికి ఇంధన సరఫరాలో మెరుగుదల కనిపించిందని మంత్రి మనోహర్‌ అన్నారు. సాధారణ స్థితి వచ్చే వరకు అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలన్నారు. హైదరాబాద్‌ నుంచి సివిల్‌ సప్లయిస్‌ కమిషనర్‌ కన్నబాబు, ఉన్నతాధికారులు, జేసీలతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రబీ కోతల యంత్రాలకు ఇంధన సమస్య రాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. డీజిల్‌, పెట్రోలు బల్క్‌ కొనుగోళ్లను పూర్తిగా అరికట్టాలని, పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు. వాహనదారులు అవసరం లేకున్నా ఎక్కువ ఇంధనాన్ని నింపుకోవడం వల్లే బంకుల్లో ఇంధన నిల్వలు తరిగిపోతున్నాయని, మళ్లీ లోడు వచ్చే వరకు వేచిచూడాల్సి వస్తోందని చెప్పారు.

Updated Date - Apr 28 , 2026 | 04:26 AM