Share News

పాదచారులకు సౌకర్యంగా ఫుట్‌పాత్‌లు

ABN , Publish Date - Aug 08 , 2026 | 04:53 AM

రాష్ట్ర వ్యాప్తంగా పాదచారుల భద్రతను ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. సురక్షితమైన, సౌకర్యవంతమైన పుట్‌పాత్‌లు అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా..

పాదచారులకు సౌకర్యంగా ఫుట్‌పాత్‌లు

  • కొత్త విధానం, మార్గదర్శకాలకు ఆమోదం

అమరావతి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా పాదచారుల భద్రతను ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. సురక్షితమైన, సౌకర్యవంతమైన పుట్‌పాత్‌లు అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పాదచారుల భద్రత, సార్వత్రిక ప్రాప్యత(యాక్సెస్ బిలిటీ) విధానం-2026తో పాటు కార్యాచరణ మార్గదర్శకాలు-2026కు ఆమోదం తెలిపింది. ఈ మేరకు మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. 2025 అక్టోబరు 7న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రవాణా, రోడ్లు భవనాల శాఖలతో పాటు డీటీసీపీ, మున్సిపల్‌, జాతీయ రహదారుల అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. వారి సిఫారసుల ఆధారంగా రాష్ట్ర పాదచారుల భద్రత విధానాన్ని రూపొందించింది. ఈ విధానం ద్వారా పట్టణాల్లో ఆక్రమణలు లేని ఫుట్‌పాత్‌లు, వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, చిన్నారుల సహా ప్రతి ఒక్కరూ సులభంగా వినియోగించుకునే ఫుట్‌పాత్‌ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలాగే రహదారి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా పాదచారులకు మౌలిక వసతులు కల్పించేందుకు కార్యాచరణ మార్గదర్శకాలు అమలు చేయనున్నారు. దీంతో ఇకపై రోడ్ల రూపకల్పన ప్రజల భద్రత కేంద్రబిందువుగా సాగనుంది. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ప్రధాన నగరాలకు మాత్రమే పరిమితమైనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని పట్టణాలు, గ్రామాలు, శివారు ప్రాంతాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనుంది. కొత్త రోడ్లతో పాటు ఇప్పటికే ఉన్న రహదారుల అభివృద్ధికి ఇదే ప్రమాణాలు వర్తిస్తాయి. రోడ్లు కేవలం వాహనాల కోసమే కాకుండా పాదచారులకూ సమాన భద్రత కల్పించే ప్రజా ప్రదేశాలుగా మార్చడమే లక్ష్యంగా ఈ విధానం తీసుకొస్తున్నారు.


ఒకే రీతిగా ప్రమాణాలు..

కొత్త విధానం ప్రకారం.. కనీసం రెండు మీటర్ల వెడల్పుతో అడ్డంకుల్లేని ఫుట్‌పాత్‌లు, వీల్‌చైర్‌ సౌకర్యాలు, కర్బ్‌ ర్యాంపులు, బ్రెయిలీ సూచికలు, టాక్టైల్‌ మార్గాలు, వృద్ధులు, దృష్టిలోపం ఉన్నవారికి అనువైన ట్రాఫిక్‌ సిగ్నళ్లు ఏర్పాటు చేస్తారు. అవసరమైన చోట లిఫ్టులతో కూడిన ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, సబ్‌వేలు, సీసీటీవీ పర్యవేక్షణ, ఎల్‌ఈడీ లైటింగ్‌, పానిక్‌ బటన్లు ఏర్పాటు చేయనున్నారు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్‌ 198-ఎ ప్రకారం రోడ్ల రూపకల్పన లేదా నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల ఎవరైనా మరణించినా లేదా అంగవైకల్యం సంభవించినా సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లపై రూ. 1 లక్ష జరిమానా విధించే అవకాశముంది. జిల్లా రోడ్డు భద్రతా కమిటీలు కొత్త విధానం అమలును పర్యవేక్షిస్తాయి. జీఐఎస్‌ మ్యాపింగ్‌, జియోట్యాగింగ్‌, డ్రోన్‌ సర్వేలు, డిజిటల్‌ డ్యాష్‌బోర్డులు, సీసీటీవీ కమాండ్‌ సెంటర్లు ద్వారా ప్రతి పనిని పర్యవేక్షిస్తారు. ఫుట్‌పాత్‌ల పొడవు, ప్రమాదాల తగ్గుదల, రీసైకిల్‌ పదార్థాల వినియోగం వంటి సూచికల ఆధారంగా స్థానికసంస్థల పనితీరును అంచనా వేస్తారు.

ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యం..

రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు, స్వచ్ఛందసంస్థలు, దివ్యాంగ సంఘాలు, విద్యాసంస్థలు, సాధారణ పౌరులు ఇకపై రోడ్ల భద్రతా తనిఖీలు, సామాజిక ఆడిట్లు, ప్రమాదకర ప్రాంతాల గుర్తింపులో భాగస్వాములు కానున్నారు. ఫుట్‌పాత్‌ ఆక్రమణలు, రహదారి భద్రత సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేసే వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - Aug 08 , 2026 | 04:54 AM