ఆర్డీఎస్ఎస్ పనుల్లో వేగం పెరగాలి
ABN , Publish Date - Jun 13 , 2026 | 05:59 AM
రివ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్(ఆర్డీఎస్ఎస్) కింద జరుగుతున్న పనులు పూర్తయితే సరఫరా నష్టాలు గణనీయంగా తగ్గుతాయని, ఈ పనుల్లో వేగం పెంచాలని..
విద్యుత్తు కొనుగోళ్లలో 191 కోట్లు ఆదా: విజయానంద్
అమరావతి, జూన్ 12(ఆంధ్రజ్యోతి): రివ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్(ఆర్డీఎస్ఎస్) కింద జరుగుతున్న పనులు పూర్తయితే సరఫరా నష్టాలు గణనీయంగా తగ్గుతాయని, ఈ పనుల్లో వేగం పెంచాలని సీఎం ప్రత్యేక కార్యదర్శి విజయానంద్ కోరారు. శుక్రవారం విద్యుత్ సౌధలో ఆ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో విజయానంద్ మాట్లాడుతూ ఫీడర్ విభజన, అధిక లోడు ఉన్న ఫీడర్ల విభజన, పాత.. శిథిలావస్థకు చేరుకున్న కండక్టర్ల మార్పిడి, విద్యుత్తు మౌలిక సదుపాయాల బలోపేతం వంటి పనులపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంపై దృష్టి సారించాలని చెప్పారు. జూన్‌లో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 11,688 మెగావాట్లు, జూలైలో 11,981 మెగావాట్లు ఉండే అవకాశం ఉందని, ఈమేరకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సమర్థవంతమైన విద్యుదుత్పత్తి నిర్వహణతోపాటు మార్కెట్‌లో వ్యూహాత్మకంగా విద్యుత్తు కొనుగోళ్లు చేపట్టడం ద్వారా 2026 జనవరి నుంచి జూన్ 12 వరకు రూ.191.05 కోట్ల మేర ఆదా చేయగలిగామన్నారు.