మత్స్యకారుల బోట్లకు రంగు మార్పు!
ABN , Publish Date - Jul 22 , 2026 | 05:09 AM
సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల బోట్ల రంగులు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ బోట్లకు రాష్ట్రాల వారీగా కలర్ కోడింగ్ ఇచ్చిన కేంద్రం, గత పదిహేనేళ్లుగా అమలు చేస్తోంది.
సముద్ర జలాల్లో కలిసిపోతున్న నీలం
దానికి బదులుగా అడుగున నారింజ రంగు
కోస్టుగార్డు సూచనలతో కేంద్రానికి రాష్ట్రం లేఖ
ట్రాన్స్‌పాండర్లను స్విచ్ ఆఫ్ చేస్తుండటంతో ప్రమాద సమయాల్లో దొరకని బోట్ల ఆచూకీ
డ్రోన్లతో సహాయక చర్యలు చేపట్టే యోచన
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల బోట్ల రంగులు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ బోట్లకు రాష్ట్రాల వారీగా కలర్ కోడింగ్ ఇచ్చిన కేంద్రం, గత పదిహేనేళ్లుగా అమలు చేస్తోంది. అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లినప్పుడు దూరం నుంచే బోటు రంగును బట్టి అది ఏ ప్రాంతానికి చెందినదో గుర్తించడానికి ఈ విధానం ఉపయోగకరంగా ఉంటోంది. రాష్ట్రంలోని బోట్లకు పైభాగంలో పసుపు రంగు, కింద నీలం రంగు వేయాలని కేంద్రం సూచించింది. అయితే కొంతమంది ఈ నిబంధన పాటించకుండా నచ్చిన రంగులు వేసుకొని సముద్రంలో తిరుగుతున్నారు. ఈ నెల 4న గంగవరం పోర్టు సమీపాన అలల ఉధృతికి మత్స్యకారుల బోటు తిరగబడి, కొంతసేపటి తరువాత క్రమంగా నీటిలో మునిగిపోయి ఆరుగురు గల్లంతైన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయాల్లో బోటు తిరగబడినప్పుడు కింద వేసిన నీలం రంగు భాగం పైకి తేలుతోంది. సముద్ర జలాలు కూడా అదే రంగులో ఉండటంతో వాటిలో కలిసిపోతోంది. రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా సిబ్బందికి బోటు జాడ స్పష్టంగా కనిపించడం లేదు. దీనిపై విశాఖలోని కోస్టుగార్డు అధికారులు పలు సందర్భాల్లో మత్స్యశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. నీలం రంగుకు బదులుగా నారింజ రంగు వేయించాలని సూచించారు.
మరో వేయి బోట్లకు ట్రాన్స్‌పాండర్లు
మత్స్యకారుల బోట్లకు ట్రాన్స్‌పాండర్లు అమర్చుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలాకాలంగా చెబుతున్నాయి. ఈ పరికరం అమర్చుకుంటే ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు చెప్పడంతో పాటు బోటు సముద్రంలో ఎక్కడ ఉన్నదనే విషయం తీరంలో ఉన్న అధికారులు సులభంగా గుర్తించవచ్చు. అధునాతన ట్రాన్స్‌పాండర్లలో అటు మత్స్యకారులు, ఇటు అధికారులు ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశమూ ఉంటుంది. బోటు పొరపాటున సరిహద్దులు దాటి పొరుగు జలాల్లోకి వెళితే సైరన్ మోగించి హెచ్చరిక కూడా జారీచేస్తుంది. అందులో ఉన్న ప్రత్యేకమైన బటన్‌ను నొక్కితే ‘ప్రమాదంలో ఉన్నాం.. రక్షించండి’ అనే సంకేతం కోస్టుగార్డు అధికారులకు వెళుతుంది. వారు వెంటనే బోటు ఎక్కడుందో గుర్తించి, సహాయక చర్యలు చేపడతారు. రాష్ట్రంలో 5వేల బోట్లకు వీటిని ఉచితంగా అమర్చారు. మరో వేయి ట్రాన్స్‌పాండర్లు అమర్చడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే దీనిద్వారా బోటు ఎక్కడెక్కడ తిరిగిందనే మొత్తం సమాచారం అధికారులకు తెలుస్తుండటంతో చాలామంది ట్రాన్స్‌పాండర్లను స్విచ్‌ఆఫ్ చేస్తున్నారు. దీంతో వారి బోటుకు ఏదైనా ప్రమాదం జరిగితే సముద్రంలో ఎక్కడ ఉందో గుర్తించడం కష్టమవుతోంది. తాజాగా గంగవరం వద్ద ఆరుగురిని బలిగొన్న బోటుకు ట్రాన్స్‌పాండర్ ఉన్నా, దానిని స్విచ్‌ఆఫ్ చేయడంతో బోటు జాడను ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు.
కేంద్రానికి లేఖ రాస్తున్నాం
మత్స్యకారుల బోట్లకు ఇష్టమొచ్చినట్టు రంగులు మార్చడానికి అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వానికి పరిస్థితిని వివరించి, అడుగున నీలం రంగుకు బదులు నారింజ రంగు వేసుకోవడానికి అనుమతి కోరుతూ లేఖ రాస్తున్నాం. జాతీయ సముద్ర జలాల్లో అంటే తీరానికి 12 నాటికల్ మైళ్ల దూరంలో ఏదైనా ప్రమాదం జరిగితే సహాయక చర్యలకు డ్రోన్లను కూడా ఉపయోగించాలని యోచిస్తున్నాం. మత్స్యకారుల భద్రతకు అన్ని చర్యలు చేపడతాం.
- శంకర్ నాయక్, కమిషనర్, మత్స్య శాఖ