Share News

మత్స్యకారులకు రిటైల్‌ రేటుకే డీజిల్‌ ఇవ్వండి

ABN , Publish Date - Jun 10 , 2026 | 05:18 AM

మత్స్యకారులు వేటకు వాడే బోట్లకు రిటైల్‌ ధరలకే డీజిల్‌ సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్‌ మత్స్య సహకార సంఘాల సమాఖ్య (ఆఫ్కాఫ్‌) చైర్మన్‌ యాటగిరి రాంప్రసాద్‌ ఆయిల్‌ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు.

మత్స్యకారులకు రిటైల్‌ రేటుకే డీజిల్‌ ఇవ్వండి

  • వాణిజ్య ధరతో బోట్లు నడపలేకపోతున్నారు

  • ఆయిల్‌ కంపెనీలకు ఆఫ్కాఫ్‌ చైర్మన్‌ రాంప్రసాద్‌ విజ్ఞప్తి

అమరావతి, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): మత్స్యకారులు వేటకు వాడే బోట్లకు రిటైల్‌ ధరలకే డీజిల్‌ సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్‌ మత్స్య సహకార సంఘాల సమాఖ్య (ఆఫ్కాఫ్‌) చైర్మన్‌ యాటగిరి రాంప్రసాద్‌ ఆయిల్‌ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు మంగళవారం విజయవాడలోని మత్స్యశాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అమెరికా-ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో డీజిల్‌ ధరలు అమాంతం పెరిగిపోయాయని, దీంతో ఆఫ్కాఫ్‌ ఆధ్వర్యంలోని పెట్రోల్‌ బంకుల్లో లీటర్‌ డీజిల్‌ రూ.145కు చేరిందని తెలిపారు. ఆఫ్కాఫ్‌ బంకుల్లో వాణిజ్య ధర కొనసాగుతోందని, రిటైల్‌ బంకుల్లో లీటర్‌ రూ.105కే లభ్యమౌతోందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వాడే బోట్లకు కూటమి ప్రభుత్వం లీటర్‌ డీజిల్‌పై రూ.9 సబ్సిడీ ఇస్తున్నందున, మత్స్య కారులకు వాణిజ్య ధర కాకుండా, రిటైల్‌ ధరకు డీజిల్‌ సరఫరా చేయాలని కోరారు. దీనివల్ల లీటర్‌ డీజిల్‌ మత్స్యకారులకు సబ్సిడీ పోను రూ.96కే లభిస్తుందని చెప్పారు. ఈ నెల 15 నుంచి సముద్రంలో చేపల వేట పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో మత్స్యకారులు బోట్లు సిద్ధం చేసుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో డీజిల్‌ ధర తగ్గింపునకు సహకరించాలని కోరారు. దీనిపై త్వరలో నిర్ణయం చెబుతామని ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశంలో ఆఫ్కాఫ్‌ వైస్‌ చైర్మన్‌ రంగారావు, ఎండీ సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2026 | 05:19 AM