Share News

సంద్రంలో వివాదాల వేట!

ABN , Publish Date - Apr 05 , 2026 | 05:15 AM

సముద్రంలో చేపల వేట ఏపీ, తమిళనాడు మత్స్యకారుల మధ్య వివాదాలకు దారితీస్తోంది. ఈ వివాదాలు ఎప్పటి నుంచో ఉన్నా.. ఇటీవల మరింత ఎక్కువయ్యాయి.

సంద్రంలో వివాదాల వేట!

  • విచ్చలవిడిగా వేట సాగిస్తున్న తమిళ జాలర్లు

  • వారి మరబోట్లతో నష్టపోతున్న రాష్ట్ర మత్స్యకారులు

  • రేపు నాలుగు జిల్లాల మత్స్యకారుల సమావేశం

కొత్తపట్నం, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): సముద్రంలో చేపల వేట ఏపీ, తమిళనాడు మత్స్యకారుల మధ్య వివాదాలకు దారితీస్తోంది. ఈ వివాదాలు ఎప్పటి నుంచో ఉన్నా.. ఇటీవల మరింత ఎక్కువయ్యాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తమిళనాడు మరబోట్లు తీరంలో తిరుగుతూ స్థానిక మత్స్యకారుల వలలు, బోట్లను ధ్వంసం చేస్తున్నాయి. గురువారం తమిళనాడుకు చెందిన 6మరబోట్లు ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మడనూరు పట్టపుపాలెం వద్ద తీరంలోనే వేట చేస్తుండటంతో స్థానిక మత్స్యకారులు భయపడిపోయి తమ పడవలను ఒడ్డుకు చేర్చుకున్నారు. ఈ విషయం తెలిసి స్థానిక మత్స్యకారులు పెద్ద సంఖ్యలో తీరానికి చేరుకోవడంతో.. గమనించిన తమిళ మరబోట్లు సముద్రంలోకి వెళ్లిపోయాయి.


నిబంధనలకు విరుద్ధంగా మరబోట్ల వేట

రెండురాష్ట్రాల మత్స్యకారుల మధ్య వేట వివాదం ఏడాదిగా సాగుతోంది. మెరైన్‌ రెగ్యులేషన్‌ చట్టం ప్రకారం మరబోట్లు సముద్రంలో 22 కిలోమీటర్ల లోపల మాత్రమే వేట చేయాలి. కానీ తమిళనాడు, కడలూరు ప్రాంతాల మరబోట్లు తీరానికి ఐదారు కిలోమీటర్ల లోపులోనే వేట సాగిస్తున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల మత్స్యకారుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వేట చేస్తూ తమకు నష్టం కలిగిస్తున్నారంటూ కొన్నినెలల కిందట కావలి సమీపంలోని జువ్వలదిన్నెలో నాలుగు మరబోట్లను స్థానిక మత్స్యకారులు స్వాధీనం చేసుకున్నారు.


మరబోట్లు స్వాధీనం.. వివాదం తీవ్రం

గత వారం రోజుల నుంచి మన తీరానికి వచ్చి నిబంధనలకు విరుద్ధంగా వేట సాగిస్తున్న తమిళనాడు మరబోట్లను స్థానిక మత్స్యకారులు స్వాధీనం చేసుకుంటున్నారు. చెన్నైపాలెం మత్స్యకారులు ఒక మరబోటును వారంరోజుల కిందట స్వాధీనం చేసుకుని రామాయపట్నం పోర్టులో ఉంచారు. కృష్ణపట్నం మత్స్యకారులు మరో బోటును స్వాధీనం చేసుకున్నారు. కావలి దగ్గర జువ్వలదిన్నె ప్రాంతంలో మెరైన్‌ పోలీసులు కూడా మరో బోటును అదుపులోకి తీసుకున్నారు. ఈ బోటులో ఉన్న తమిళనాడు మత్స్యకారులపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తమిళనాడు మత్స్యకారులు కూడా మన వారి పడవలను తీసుకుపోయి.. తమ బోట్లను విడిపించుకుపోవాలని యత్నిస్తున్నట్లు తెలిసింది. పరిస్థితులు ఇలా ఉండగానే గురువారం తమిళనాడు మత్స్యకారులు ఆరు మరబోట్లతో మడనూరు పట్టపుపాలెం సమీప తీరంలో వేట సాగిస్తూ.. కవ్వింపు చర్యలతో స్థానిక మత్స్యకారులను భయకంపితులను చేశారు. కాగా, తమిళనాడు మత్స్యకారులతో తలెత్తుతున్న వివాదాలపై చర్చించేందుకు సోమవారం నాలుగు తీర ప్రాంత జిల్లాల మత్స్యకారులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. శింగరాయకొండ మండలం పాకల వద్ద ఉన్న పోతయ్యగారిపాలెంలో ఈ సమావేశం జరగనుంది. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల మత్స్యకార గ్రామాల కాపులు, మత్స్యకారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

Updated Date - Apr 05 , 2026 | 05:18 AM