CM Chandrababu: తిరుపతిలో ‘ఏపీ-ఫస్ట్’!
ABN , Publish Date - Jan 17 , 2026 | 03:20 AM
ఏరోస్పేస్, డిఫెన్స్ ఐటీ-డిజిటల్ ట్రాన్ఫ్‌ఫర్మేషన్ రంగాల్లో యువతకు మరింత భవిష్యత్తు లభించేలా రాష్ట్రంలో అతిపెద్ద పరిశోధనా కేంద్రం...
అతిపెద్ద పరిశోధనా కేంద్రం
యువత భవితకు భరోసా
పలు కీలక రంగాల్లో శిక్షణ
ఏరో స్పేస్, డిఫెన్స్, ఐటీ సలహాదారులతో సీఎం సమావేశం
ఏపీ-ఫస్ట్ ఏర్పాటుకు ఆమోదం.. డ్రోన్ వ్యవస్థపై మరింత అధ్యయనం.. అన్ని విభాగాల్లోనూ ‘డ్రోన్’ సేవలు
‘‘కొత్త ఆవిష్కరణలకు, వివిధ స్టార్టప్ కంపెనీలకు రాష్ట్రం వేదికగా నిలవాల్సిన
అవసరం ఉంది. ఇలా వచ్చే కంపెనీలకు, పరిశ్రమలకు నైపుణ్యం ఉన్న యువతను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. భవిష్యత్తులో డిమాండ్ ఉన్న రంగాలకు పెద్దపీట వేస్తూ స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తాం. వీటికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఓ అతిపెద్ద రిసెర్చ్ సెంటర్ అవసరం. తిరుపతిలో ఏర్పాటు చేయబోతున్న ‘ఏపీ ఫస్ట్’ పరిశోధన సంస్థ ఆ అవసరాలను తీర్చేలా పూర్తిస్థాయిలో పనిచేయాలి.’’
- సీఎం చంద్రబాబు
అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ఏరోస్పేస్, డిఫెన్స్ ఐటీ-డిజిటల్ ట్రాన్ఫ్‌ఫర్మేషన్ రంగాల్లో యువతకు మరింత భవిష్యత్తు లభించేలా రాష్ట్రంలో అతిపెద్ద పరిశోధనా కేంద్రం ‘ఏపీ-ఫ్‌స్ట’ను తిరుపతిలో ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. శుక్రవారం అమరావతిలోని క్యాంపుకార్యాలయంలో ఏరోస్పేస్, డిఫెన్స్. ఐటీ రంగాల సలహాదారులతో ఆయన భేటీ అయ్యారు. యువత భవితను తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. యువతలో నైపుణ్యాభివృద్ధి పెంచుతూ.. వారిలో కౌశల్యాలను వెలికితీసేలా పరిశోధనా రంగంలో అన్నివిధాలా సహకరించేలా ‘ఏపీ ఫస్ట్’ పేరిట రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ‘‘రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. వివిధ రంగాల్లో కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, ఏఐ సెంటర్, సెమీకండక్టర్ డివైజెస్, హెల్త్ కేర్, బయో టెక్నాలజీ వంటి రంగాలు భవిష్యత్తులో కీలకం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటికి అనుగుణంగా పాలసీలు రూపొందిస్తోంది. ఆయా రంగాల్లో కంపెనీలు పెట్టేందుకు సహకరిస్తుంది. దేశంలో తొలిసారిగా గ్రీన్ ఎనర్జీ రంగంలో గ్రీన్ ఆమ్మోనియా ప్లాంట్‌ను కాకినాడలో ఏర్పాటు చేయబోతున్నాం. తిరుపతిలోని ఐఐటీ-ఐఐఎ్‌సఈఆర్ రెండు ప్రముఖ జాతీయ విద్యాసంస్థల కాంబినేషన్లలో ఏపీ ఫస్ట్ ఏర్పాటు కాబోతుంది. దీనిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దాలి. ‘ఏపీ ఫస్ట్’ పరిశోధనా వ్యవస్థను సమర్ధంగా నిర్వహించేందుకు కేంద్రంతోనూ సంప్రదింపులు జరపాలి.’’ అని సీఎం చంద్రబాబు సూచించారు.
టాటా ఇన్నోవేషన్ హబ్‌తో..
యువతకు మెరుగైన అవకాశాల కల్పన కోసం ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోందని సీఎం తెలిపారు. దీనిలో భాగంగానే ఏపీ ఫస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వర్సిటీలు, వివిధ రంగాల్లో ప్రముఖ ఉన్న కంపెనీలతో ఏపీ ఫస్ట్ సమన్వయం చేసుకోవాలని సూచించారు. రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్‌తో అనుసంధానం చేసుకోవాలని పేర్కొన్నారు. ‘‘ఇప్పటికే వివిధ ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీల్లో విద్యార్ధులు నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. వాటిని అందిపుచ్చుకోవాలి. వివిధ రంగాల్లో నైపుణ్యం తీర్చిదిద్దేందుకు పరిశ్రమలు, కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరపాలి. సాంకేతికలు, అభివృద్ధి చెందుతున్న రంగాలపై అవగాహన పెంచుకోవాలి. వాటిని కరిక్యులంలో చేర్చేలా విద్యావ్యవస్థలను తీర్చిదిద్దాలి. కరిక్యులం రూపకల్పన బాధ్యతను ఏపీ ఫస్ట్‌కు అప్పగించాలి’’ అని సీఎం సూచించారు.
డ్రోన్లతోనూ సేవలు
డ్రోన్లతోనూ సేవలు అందించవచ్చని నిరూపిద్దామని, దీనికోసం డ్రోన్ కార్పొరేషన్‌ను బలోపేతం చేయాలని చంద్రబాబు సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సందర్భాల్లో ప్రజలకు ఆహారంతో పాటు సహాయ పునరావాస కార్యక్రమాలను అందించడంలో డ్రోన్ల సహకారం, సేవలను తీసుకోవాలన్నారు. వ్యవసాయం, మెడికల్ ఎమర్జెన్సీలాంటి సేవల్లో డ్రోన్ల వినియోగం పెరగాలన్నారు. ‘‘ఇవన్నీ భవిష్యత్ సాంకేతిక వ్యవస్థకు నిదర్శనం. రాష్ట్రంలో ఇప్పటి నుంచే వాటిని వినియోగించేలా చర్యలు ప్రారంభించాలి. వివిధ దేశాల్లో డ్రోన్ల వ్యవస్థను ఉపయోగిస్తున్న తీరుపై అధ్యయనం చేయాలి. సాంకేతికతపై ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందాలి. అందరూ టెక్నాలజీ వినియోగించుకునేలా వ్యవస్థల్ని సన్నద్ధం చేయాలి. డ్రోన్ నిపుణులతో సలహా బృందాన్ని ఏర్పాటు చేయాలి. రానున్న ఇంటర్నేషన్ డ్రోన్ డే నాటికి ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించే సేవలపై అవగాహన కల్పించాలి. కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ తరహాలో డ్రోన్ ట్రాఫిక్ కంట్రోల్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయడంపై ఆలోచనలు చేయాలి.’’ అని సీఎం సూచించారు. ఈ సమావేశంలో ఏరోస్పేస్ డిఫెన్స్ సలహాదారు సతీశ్‌రెడ్డి, ఐటీ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సలహాదారు అమిత్ దుగర్, తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కేఎస్ సత్యనారాయణ, ప్రొఫెసర్ సెంథిల్ కుమార్, డీఎంటీఐ డైరెక్టర్ కల్నల్ పీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.