Share News

పరిశోధనల ప్రోత్సాహానికి ‘ఏపీ ఫస్ట్‌’

ABN , Publish Date - Jun 30 , 2026 | 06:17 AM

రాష్ట్రంలో పరిశోధన, ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞాన వాణిజ్యీకరణను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ఫ్యూచర్‌ ఇన్నోవేషన్‌, రీసెర్చ్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఏపీ ఫస్ట్‌) అనే కార్యక్రమాన్ని ప్రతిపాదించింది.

పరిశోధనల ప్రోత్సాహానికి ‘ఏపీ ఫస్ట్‌’

  • కొత్త సంస్థతో సహకార ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థ నిర్మాణం

  • ఆవిష్కరణలు, పరిశోధనల్లో ఏపీని గ్లోబల్‌ హబ్‌గా మార్చడమే లక్ష్యం

  • ఏపీ ఫస్ట్‌ను కంపెనీగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు

అమరావతి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పరిశోధన, ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞాన వాణిజ్యీకరణను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ఫ్యూచర్‌ ఇన్నోవేషన్‌, రీసెర్చ్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఏపీ ఫస్ట్‌) అనే కార్యక్రమాన్ని ప్రతిపాదించింది. ఇందుకోసం కంపెనీల చట్టంలోని సెక్షన్‌ 8 కింద ‘ఏపీ ఫస్ట్‌’ని ఒక కంపెనీగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమం కింద ప్రాధాన్య రంగాలపై దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌, స్పేస్‌ టెక్నాలజీస్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ సైబర్‌ సెక్యూరిటీ, సెమీ కండక్టర్స్‌, క్వాంటమ్‌ టెక్నాలజీస్‌, హెల్త్‌కేర్‌ అండ్‌ బయోటెక్నాలజీ, రెన్యువబుల్‌ ఎనర్జీ, రూరల్‌, అగ్రికల్చర్‌ టెక్నాలజీస్‌, అడ్వాన్స్‌ మెటీరియల్స్‌ను ఉపయోగించుకుని ఓ సహకార ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను సృష్టించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అన్ని రంగాల్లోని ఆవిష్కరణలు, పరిశోధనలన్నింటినీ ఒక చోటికి చేర్చడం ద్వారా ఏపీని గ్లోబల్‌ హబ్‌గా మార్చాలని నిర్ణయించింది. దీనికోసం పరిశోధన సంస్థలు, పారిశ్రామిక భాగస్వాములు, స్టార్ట్‌పలు, ప్రభుత్వ విభాగాలను ఏకతాటిపైకి తేవాలని భావిస్తోంది.


అనుసంధాన్‌ నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌, నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌, డీప్‌ ఓషన్‌ మిషన్‌, నేషనల్‌ గ్రీన్‌ హెచ్‌2 మిషన్‌ వంటి భారత ప్రభుత్వ సంస్థల సహకారంతో పాటు రీసెర్చ్‌, డెవల్‌పమెంట్‌, ఇన్నోవేషన్‌ ఫండ్స్‌, అజీమ్‌-ప్రేమ్‌జీ ఫౌండేషన్‌, టాటా ట్రస్ట్‌ తదితర ప్రైవేట్‌ సంస్థల మద్దతుతో ఏపీ ఫస్ట్‌ను ముందుకు నడిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ ఫస్ట్‌ కోసం ఐఐటీ తిరుపతి, ఐఐఎ్‌సఈఆర్‌ తిరుపతి వంటి సంస్థలతో పాటు రాష్ట్రంలోని వర్సిటీల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఏపీ ఫస్ట్‌ రూ. 5 కోట్ల సీడ్‌-క్యాపిటల్‌తో ఏర్పాటు చేయనుంది. ప్రతిపాదిత రూ.లక్ష కోట్ల పరిశోధ న, అభివృద్ధి, ఆవిష్కరణ నిధితో సహా కేంద్ర సర్కారు కార్యక్రమాలతో సమన్వయం సాధించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - Jun 30 , 2026 | 06:18 AM