ప్రాణాలకు తెగించి ఫైర్‌మెన్ సేవలు
ABN , Publish Date - Apr 15 , 2026 | 05:47 AM
ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే.. ఆ ప్రాంతం నుంచి అందరూ పరుగులు పెడతారని, కానీ.. ఫైర్‌మెన్లు మాత్రం ప్రాణాలకు తెగించి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కాపాడతారని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కొనియాడారు.
విపత్తుల సమయంలో అగ్నిమాపక దళమే ఫస్ట్
అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన డీజీపీ
అమరావతి, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే.. ఆ ప్రాంతం నుంచి అందరూ పరుగులు పెడతారని, కానీ.. ఫైర్‌మెన్లు మాత్రం ప్రాణాలకు తెగించి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కాపాడతారని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కొనియాడారు. విజయవాడలోని రాష్ట్ర అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయంలో మంగళవారం అగ్నిమాపక వారోత్సవాలను ఫైర్ డీజీ వెంకటరమణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తులు, మానవ తప్పిద(అగ్ని, పారిశ్రామిక) ప్రమాదాలు సంభవించినప్పుడు అందరికన్నా ముందు ఘటనాస్థలికి చేరుకుని మంటలోకి ధైర్యంగా దూకే ఫైర్ మెన్లు క్రమశిక్షణతో కూడిన ధైర్యానికి ప్రతీకలని ప్రశంసించారు. పట్టణీకరణ, పారిశ్రామిక విస్తరణతో ప్రమాదాల సంఖ్య, తీవ్రత పెరుగుతోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని అగ్నిమాపక శాఖ సేవలు అందిస్తోందని తెలిపారు. వాణిజ్య సముదాయాలు, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు అగ్నిమాపక నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. డీజీ వెంకటరమణ మాట్లాడుతూ.. ‘సేఫ్ స్కూల్.. సేఫ్ హాస్పిటల్.. ఫైర్ సేఫ్టీ’ నినాదంతో ఈ నెల 20 వరకు రాష్ట్ర వ్యాప్తగా అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు, మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సిబ్బందికి నివాళులర్పించారు.