పారదర్శకతపై ‘పరదా’!
ABN , Publish Date - Jan 31 , 2026 | 04:54 AM
చంద్రబాబు హయాంలో 2014-19లో సీఎ్‌ఫఎంఎ్‌సను శాప్ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేశారు. తమ బిల్లు ఎంతవరకు వచ్చిందనేది సంబంధిత వ్యక్తులు ఈ వ్యవస్థలో ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు.
రాష్ట్రంలో చెల్లింపుల కోసం ప్రభుత్వం ప్రస్తుతం వినియోగిస్తున్న సీఎ్‌ఫఎంఎస్ (సెంట్రలైజ్డ్ ఫైల్ మేనేజ్‌మెంట్ అండ్ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) వ్యవస్థ పూర్తి పారదర్శకం. ప్రతి రూపాయి కదలిక ఇక్కడ తెలిసిపోతుంది. పైసా తేడా వచ్చినా పట్టేస్తుంది. శాప్ ప్లాట్‌ఫామ్‌పై ఇంత ఆధునికంగా రూపొందించిన ఆధునిక వ్యవస్థను కాదని వైసీపీ హయాంలోనే విఫలమైన, పరదాల తరహా వ్యవస్థలోకి ఆర్థిక శాఖ తిరిగి మళ్లాలనుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుత సీఎ్‌ఫఎంఎస్ వ్యవస్థకు తూట్లు
వైసీపీ హయాంలోనే విఫలమైన వ్యవస్థలోకి మళ్లే ప్రయత్నాలు!
ప్రతి రూపాయి కదలికను ట్రాక్ చేసేలా శాప్ ప్లాట్‌ఫామ్‌పై సీఎ్‌ఫఎంఎస్ అభివృద్ధి
చంద్రబాబు హయాంలో చక్కని ఫలితాలు
వైసీపీ అధికారంలోకి రాగానే ‘జావా’లోకి...
చెల్లింపుల్లో తప్పులు రెండో కంటికి తెలియకుండా ఆ జాగ్రత్త
ఇప్పుడు మళ్లీ ఆ దిశగా నడుస్తున్న వైనం
అదనపు నిధుల కేటాయింపుల్లోనూ అదే తీరు
ఆర్థిక శాఖ అధికారుల వైఖరిపై విమర్శలు
(అమరావతి, ఆంధ్రజ్యోతి)
చంద్రబాబు హయాంలో 2014-19లో సీఎ్‌ఫఎంఎ్‌సను శాప్ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేశారు. తమ బిల్లు ఎంతవరకు వచ్చిందనేది సంబంధిత వ్యక్తులు ఈ వ్యవస్థలో ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు. చెల్లించే ప్రతి బిల్లు, ప్రతి రూపాయికి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆమోదం ఉండేలా రూపొందించారు. అంతకుముందున్న చెల్లింపుల వ్యవస్థలో పారదర్శకత లేదు. సీఎ్‌ఫఎంఎ్‌సను శాప్ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేయడం వల్ల ప్రతీ బిల్లును ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎప్పుడైనా చూడగలరు. చెల్లింపుల్లో ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పు తుడిచేయడం కుదరదు. ఆ తప్పు అలాగే కనబడుతుంది. దాన్ని సరిచేస్తూ మరోసారి కరెక్షన్ ఎంట్రీ వేస్తారు. ఈ కరెక్షన్ ఎంట్రీ తమకు అడ్డంకిగా ఉందన్న ఉద్దేశంతో వైసీపీ హయాంలో మొత్తం చెల్లింపుల వ్యవస్థను జావా ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేయాలని భావించారు. హెర్బ్ పేరుతో రెడీ చేశారు. కానీ, అది అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు. చెల్లింపుల్లో తప్పు జరిగితే దాన్ని ఎవరికీ తెలియకుండా డిలీట్ చేసే అవకాశం జావా ప్లాట్‌ఫామ్‌పై ఉంటుంది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వంలోనూ చెల్లింపుల కోసం జావా ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేయాలంటూ ఆర్థిక శాఖ అధికారులు ప్రతిపాదిస్తున్నారు.
దీనిపై ఆ శాఖలో ప్రాథమిక సమావేశం కూడా జరిగింది. త్వరలో ముఖ్యమంత్రి స్థాయిలో సమావేశం జరగాల్సి ఉంది. అలాగే, గతంలో సీఎ్‌ఫఎంఎస్ వ్యవస్థ రాకముందు పీడీ ఖాతాల బిల్లులను చెక్కుల రూపంలో ఇచ్చేవారు. ఇవి ఆర్థిక శాఖ కార్యదర్శులతో సంబంధం లేకుండా ట్రెజరీల స్థాయిలో జరిగిపోయేవి. అయితే, ఆ పీడీ ఖాతాల బిల్లులు ఒక్కోసారి దాదాపు రూ.50 కోట్లకు పైగా ఉండేవి. ఒక్కోసారి ఖజానాలో డబ్బు లేనప్పుడు ఈ చెక్కులు సమస్యగా మారేవి. ఈ సమస్యను అధిగమించడం కోసం రూ.కోటి దాటిన ప్రతి పీడీ ఖాతా చెక్కునూ ఆర్థిక శాఖ కార్యదర్శి పరిశీలనకు పంపాలన్న నిబంధన పెట్టారు. సీఎ్‌ఫఎంఎస్ వచ్చాక ప్రతి బిల్లు ఆర్థిక శాఖ కార్యదర్శి పరిశీలించే అవకాశం ఉంది. దీంతో ఆ కోటి రూపాయల చెక్కు నిబంధన అవసరం లేకుండా పోయింది. అయితే, ఇప్పుడు మళ్లీ వెనక్కి వెళ్లి రూ.కోటి దాటిన పీడీ ఖాతాల బిల్లులు ఆర్థిక శాఖ కార్యదర్శి పరిశీలనకు రావాలన్న నిబంధన తేవాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. శాప్ ప్లాట్‌ఫామ్‌పై పకడ్బందీగా ఉన్న సీఎ్‌ఫఎంఎ్‌సను జావాకు మార్చి పారదర్శకతను కోల్పోవడం ఎందుకు అన్న విమర్శలు వస్తున్నాయి. అలాగే, అదనపు నిధుల కేటాయింపు విషయంలోనూ ఆర్థిక శాఖ ఇటీవల ఇచ్చిన ఒక మెమోపై ఉద్యోగుల నుంచి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతోంది. సాధారణంగా ఏదైనా శాఖకు అదనంగా నిధులు కావాలంటే సదరు శాఖ ఆర్థిక శాఖకు ప్రతిపాదన పంపుతుంది. ఆ ప్రతిపాదన ఆ శాఖను చూసే ఆర్థిక శాఖ కార్యదర్శి, సెక్షన్ల పరిశీలన తర్వాత బడ్జెట్ కార్యదర్శికి, బడ్జెట్ సెక్షన్లకు చేరి సబబు అనుకుంటే అదనపు నిధులు మంజూరు చేస్తూ జీవో ఇస్తారు. కానీ, ఇప్పుడు నేరుగా బడ్జెట్ కార్యదర్శి, బడ్జెట్ సెక్షన్లకు మాత్రమే ఈ అదనపు నిధుల ప్రతిపాదన వెళ్లేలా నిబంధనలు మార్చారు. దీనివల్ల ఏ శాఖకు ఎంత అదనపు నిధులు ఇచ్చారనేది ఆర్థిక శాఖలోని ఉద్యోగులకు కూడా తెలియకుండా పోతుంది. దీని వల్ల పారదర్శకత దెబ్బ తింటుందని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.