Share News

అల్లాడిస్తున్నారు!

ABN , Publish Date - Jul 07 , 2026 | 05:28 AM

సాధారణంగా బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఆర్థిక మంత్రి, ఆ శాఖ కార్యదర్శులు, సీఎం కార్యాలయం కనుసన్నల్లో నడుస్తుంది. కానీ, రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది...

అల్లాడిస్తున్నారు!

  • బిల్లుల చెల్లింపులో ముడుపుల బేరం

  • ఆర్థిక శాఖలో ఇంటి దొంగల నిర్వాకం

  • ఒకరు డిప్యుటేషన్‌పై ఏపీసీఎఫ్ఎస్ఎస్‌కు

  • మరొకరు అదే విభాగంలో కన్సల్టెంట్‌

  • బిల్లు చెల్లిస్తా.. ఎన్ని లక్షలిస్తారంటూ కాంట్రాక్టర్లకు ముఖాముఖి ఆఫర్‌

  • కంటెంప్ట్‌ పేరుతో ఐఏఎస్‪లకు కల్లబొల్లి కబుర్లు

  • మార్చి చివరి 3 రోజుల్లోనే 350 కోట్ల బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా క్లియరెన్స్‌

  • మహిళా ఉద్యోగులతో అనుచిత ప్రవర్తన

  • ఏడాది నుంచి ఫిర్యాదులు.. చర్యలు శూన్యం

సాధారణంగా బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఆర్థిక మంత్రి, ఆ శాఖ కార్యదర్శులు, సీఎం కార్యాలయం కనుసన్నల్లో నడుస్తుంది. కానీ, రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. వీరెవరికీ తెలియకుండా వీరి ఆమోదం కూడా లేకుండానే రూ.వందల కోట్ల బిల్లులకు చెల్లింపులు జరిగిపోయాయి. రాష్ట్ర చెల్లింపు వ్యవస్థ ‘సీఎఫ్ఎంఎస్’లోని (కాంప్రహెన్సివ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌) ఇద్దరు ఉన్నతాధికారుల నిర్వాకం ఇది. ఎవరికీ చెప్పకుండా, పై అధికారులను భయాందోళనలకు గురిచేసి, ఎలా వీలైతే అలా వందల కోట్ల బిల్లులు ప్రభుత్వ ఆమోదం లేకుండా చెల్లించేశారు. ప్రతిఫలంగా ముట్టిన కమీషన్లు జేబులో వేసుకుని, విజయవాడ, హైదరాబాద్‌ నడిబొడ్డులో స్థిరాస్తులు కొనుగోలు చేశారని తెలుస్తోంది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ఆర్థిక శాఖ పరిధిలో ఉండే చెల్లింపుల వ్యవస్థ ‘సీఎఫ్ఎంఎస్‌’ మాతృసంస్థ ఏపీసీఎఫ్ఎస్ఎస్‌ను (ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ సిస్టమ్స్‌ అండ్‌ సర్వీసెస్‌) ఇద్దరు అధికారులు తమ దోపిడీతో అల్లాడిస్తున్నారు. ఒక ఉన్నతాధికారి ఢిల్లీ నుంచి డిప్యుటేషన్‌పై రాగా, ఆయన కింద పనిచేసే మరో అధికారి ప్రైవేటు వ్యక్తి. ఆ ఇద్దరు అధికారులు ఒక్కటై కోర్టునాశ్రయించిన పెండింగ్‌ బిల్లుల కాంట్రాక్టర్లను ఏటీఎంగా వాడుకుంటున్నారు. బిల్లు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఒప్పిస్తాం...మాకెన్ని లక్షలిస్తారంటూ ముఖాముఖి అడుగుతున్నారు. ఫోన్‌లో కూడా బేరాలాడుతున్నారు. వాస్తవానికి బిల్లుల చెల్లింపుల్లో ప్రభుత్వ పాత్ర నామమాత్రంగా మారగా, వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రెండేళ్లలోనే కొన్ని కోట్లు ఆ ఇద్దరూ కూడబెట్టి, విజయవాడ, హైదరాబాద్‌ల్లో స్థిరాస్థులు కొనుగోలు చేసినట్లు సమాచారం. బిల్లులు చెల్లించకపోతే కోర్టు ధిక్కారానికి వెళ్తామంటున్నారని, పరిస్థితి సీరియ్‌సగా ఉందని ఇటు ఐఏఎ్‌సలకు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. అటు కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకుంటున్నారు.


ఈ ఏడాది మార్చి వరకు అవరోధాలు లేకుండా జరిగిన ఈ దందాకు ఏప్రిల్‌లో చిన్న బ్రేక్‌ పడింది. గత మార్చి చివరి మూడు రోజుల్లో ఆ ఇద్దరు అధికారులుఏకంగా రూ.350 కోట్లకు పైగా బిల్లులను ప్రభుత్వ ఆమోదం లేకుండా సొంతంగా క్లియర్‌ చేశారు. దీంతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అప్రమత్తమై ఢిల్లీ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన సదరు ఉన్నతాధికారిని ఏపీసీఎఫ్ఎస్ఎస్‌ నుంచి తొలగించారు. కానీ ఇంకా ఆ అధికారి ఆర్థిక శాఖలోనే కొనసాగుతున్నారు. ప్రైవేటు వ్యక్తిపై మాత్రం చర్య తీసుకోలేదు. పైగా సంవత్సరానికి ఒకసారి పదోన్నతి ఇస్తూ, లక్షల్లో జీతాలిస్తున్నారు. ఏపీసీఎఫ్ఎస్ఎస్‌లో కీలక హోదాలో ఉన్న ఆ ప్రైవేటు వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌ఆన్‌లైన్‌ లీగల్‌ కేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను అన్ని ప్రభుత్వ శాఖల్లో అమలు చేయాలి. కానీ ఏం చేశారంటే, శాఖలవారీగా పెద్ద పెండింగ్‌ బిల్లులు ఎక్కడున్నాయి...బిల్లులు చెల్లిస్తామన్న ఆశ చూపి ఏ కాంట్రాక్టరును కోర్టుకి పంపాలి.. ఏ ఐఏఎస్‌ మీద కంటెం్‌ప్టకి పంపాలి లాంటి పనులు చేశారు. కోర్టు కేసుల డేటాను విశ్లేషించి ప్రభుత్వ ప్రయోజనాల కోణంలో తగు నిర్ణయాలు తీసుకోవడం ఆయన విధి. కానీ, కేవలం తనకు, తనపై అధికారికి ఆర్థిక ప్రయోజనాల కోణంలోనే నిర్ణయాలు తీసుకున్నారు. లీగల్‌ వివాదాల్లో ప్రభుత్వ ఖర్చులను తగ్గించడానికి, రాబడిని పెంచడానికి ఆయన విధానాలు రూపొందించాలి. ఇలాంటి పనులు మచ్చుకైనా లేవు. తన సొంత రాబడి కోసం ప్రభుత్వ ప్రయోజనాలు, ఐఏఎ్‌సల సమయాన్ని ఫణంగా పెట్టారు. రిట్‌ పిటిషన్లు, కంటెంప్ట్‌ ప్రొసీడింగ్స్‌, కౌంటర్‌ అఫిడవిట్ల దాఖలుపై ప్రభుత్వ అధికారులకు సాంకేతిక శిక్షణ ఇవ్వడం ఆయన డ్యూటీల్లో ఒకటి. ఆర్థిక, ఐటీ కొనుగోళ్లకు సంబంధించిన కీలక ఒప్పంద పత్రాలను పరిశీలించి, ముసాయిదాలు సిద్ధం చేయడమూ ఆయన విధి. కానీ, ఐటీ సేవల కంపెనీలను బెదిరించడం, వర్క్‌ ఆర్డర్లు లేకుండా సేవలందించాలంటూ డిమాండ్‌ చేయడం, మాటవినకపోతే దుర్భాషలాడడం చేశారు. అదే సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులతో అనుచితంగా ప్రవర్తించారు.


ఐఏఎస్‌లూ బలాదూరే..

సదరు ప్రైవేట్‌ వ్యక్తి 2019 నవంబరు 19న రాజకీయ సిఫారసుతో ఏపీసీఎఫ్ఎస్ఎస్‌లో కన్సల్టింగ్‌ విభాగంలో ఏడాదికి రూ.9 లక్షల వేతనంతో చేరారు. ఏడేళ్ల తర్వాత చూస్తే, ఇప్పుడు ఆయన వార్షిక వేతనం రూ.30,95,300. హోదా డైరెక్టర్‌ స్థాయికి ఏమాత్రం తగ్గదు. ఆలిండియా సర్వీసు ఉద్యోగులెవరికీ కూడా దేశంలో ఇంత వేతనాలు లేవు. 2020 నుంచి 2026 వరకు ఏటా కనీసం రూ.లక్ష నుంచి గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు జీతం పెరుగుతూనే ఉంది. ఏడేళ్లలో ప్రభుత్వ అనుమతి లేకుండానే ఒక డిగ్రీ పూర్తి చేసి, మూడు పదోన్నతులు తీసుకుని ఏకంగా కీలక స్థాయికి చేరారు. ఇంత భారీగా జీతాల పెంపు, పదోన్నతులు అంబానీ కంపెనీల్లో కూడా ఉండకపోవచ్చు.

సెలవు మీదైనా పంపలేరా ?

ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు ఏపీసీఎఫ్ఎస్ఎస్‌లో ఉన్నతాధికారిగా పనిచేసిన వ్యక్తి.. 2024 ఎన్నికలకు కొద్ది నెలల ముందే ఢిల్లీ నుంచి డిప్యుటేషన్‌పై రాష్ట్ర ఆర్థిక శాఖకు వచ్చారు. ‘చర్య’ తీసుకునే సమయానికి డిప్యుటేషన్‌ సమయం ముగిసిపోయినా, కనీసం సెలవు మీద పంపొచ్చు. అలాగే, కీలకహోదాలో ఉన్న ప్రైవేటు వ్యక్తి రెగ్యులర్‌ ఉద్యోగి కాదు. రాజకీయ సిఫారసులతో వైసీపీ హయాంలో వచ్చారు. అయినా సరే ఆర్థిక మంత్రి, ఉన్నతాధికారులు ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవడంలేదు. ఒక ఐటీ కంపెనీ ఎండీ ఏపీసీఎఫ్ఎస్ఎస్‌లోని ఉన్నతాధికారికి కీలకహోదాలో ఉన్న ప్రైవేటు వ్యక్తిపైౖ ఈ మెయిల్‌ ద్వారా ఏడాది క్రితం ఫిర్యాదు చేశారు. 14 నెలల నుంచి తమ పరికరాలకు అద్దె బిల్లులు, వర్క్‌ ఆర్డర్లు, రూ.2.4 లక్షల ఈఏండీ రీఫండ్‌ నిలిచిపోయాయని, వీటి గురించి అడుగుతుంటే ఆ వ్యక్తి బెదిరిస్తున్నారనేది ఫిర్యాదు సారాంశం. టెండర్‌ ప్రక్రియను ఆ కీలక హోదాలో ఉన్న వ్యక్తి తప్పుదోవ పట్టించడంతో తమ కంపెనీకి ఆర్థిక నష్టం జరిగిందని రాశారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని కోరారు. అయితే, ఆ కంపెనీ ఎండీ ఫిర్యాదు ఇచ్చిన ఉన్నతాధికారి, ఏ వ్యక్తిపైనైతే ఫిర్యాదు చేశారో ఆ ప్రైవేటు అధికారి...ఇద్దరూ ఇంటి దొంగలే. ఆ విషయం ఎండీకి తెలియక, వీరిలో ఒకరిపై రెండోవారికి ఫిర్యాదు చేశారు. అలాగే, తమతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని అక్కడ పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు కూడా ఫిర్యాదు చేశారు. కానీ, ఇప్పటి వరకు ఆ కీలక హోదాలో ఉన్న ప్రైవేటు వ్యక్తిపైనా చర్యల్లేవు.

Updated Date - Jul 07 , 2026 | 05:28 AM