Share News

రైతును రాజుగా మార్చే పంచ సూత్రాలు

ABN , Publish Date - Feb 15 , 2026 | 05:12 AM

‘రైతును రాజుగా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రైతును రాజుగా మార్చే పంచ సూత్రాలు

  • లాభసాటి సాగుకు ఆధునిక సాంకేతికత జోడింపు

  • లక్ష కోట్లతో సీమలో గ్లోబల్‌ హార్టీకల్చర్‌ హబ్‌

  • ప్రకృతి వ్యవసాయంలో దేశానికే ఏపీ రోల్‌ మోడల్‌

  • ధరల స్థిరీకరణ నిధితో రైతుల్ని ఆదుకుంటాం

  • కోకో హబ్‌గా పశ్చిమ గోదావరి జిల్లా

  • వ్యవసాయ బడ్జెట్‌ ప్రసంగంలో అచ్చెన్నాయుడు

అమరావతి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ‘రైతును రాజుగా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో పంచసూత్రాలైన నీటి భద్రత, డిమాండ్‌ ఆధారిత పంటలు, అగ్రిటెక్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ప్రభుత్వం నుంచి మద్దతు అనే అంశాలకు అధిక ప్రాధాన్యం కల్పించి, రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శనివారం శాసనసభలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.53,752.12 కోట్లతో 2026-27 ప్రతిపాదిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. స్వర్ణాంధ్ర-2047 సాధన కోసం రూపొందించిన పది సూత్రాలలో వ్యవసాయ రంగానికి సంబంధించి ‘ఫార్మర్స్‌ అగ్రిటెక్‌’ ముఖ్యమైన అంశమన్నారు. ఆధునిక సాంకేతికతలతో వ్యవసాయాన్ని లాభసాటిగా, అధిక ఆదాయ వనరుగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారని తెలిపారు. ‘‘రాష్ట్ర జీఎ్‌సడీపీ రూ.17,62,357 కోట్లు ఉండగా, వ్యవసాయ రంగ వాటా 33.20 శాతంతో రూ.5,39,454 కోట్లు అందించింది. జాతీయ వ్యవసాయ వృద్ధి రేటు 0.80 శాతం ఉండగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఏపీ వ్యవసాయ వృద్ధి రేటు 7.83 శాతం నమోదైంది. దేశ వ్యవసాయ రంగ ఉత్పత్తిలో ఏపీ వాటా 10 శాతం ఉందని గర్వంగా చెప్తున్నాం. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యసాధనలో ఈ రంగంలో 15 శాతం వృద్ధిని సాధించేందుకు 11 వ్యవసాయ పంటలను గ్రోత్‌ ఇంజన్లుగా గుర్తించాం.


ప్రతి రైతుకూ యూనిక్‌ ఐడీ

‘‘మూడోసారి వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చిన సీఎంకు కృతజ్ఞతలు. యువతను వ్యవసాయం వైపు తిప్పేందుకు లాభదాయక వృత్తిగా చేస్తాం. డిమాండ్‌ ఆధారిత పంటల్ని ప్రోత్సహిస్తాం. తుఫాన్ల ప్రభావం తగ్గింపే ప్రభుత్వ లక్ష్యం. కృష్ణా, గోదావరి డెల్టాల్లో ఖరీఫ్‌ సాగును ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనికి రైతుల సహకారం ముఖ్యం. ప్రతి రైతుకూ యూనిక్‌ ఐడీ ఇస్తున్నాం. ఇప్పటికి 46.59 లక్షల మంది రైతు రిజిస్ర్టీలో నమోదయ్యారు’’ అని అచ్చెన్న అన్నారు.

పశ్చిమలో కోకో హబ్‌

రాయలసీమను గ్లోబల్‌ హార్టీకల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రూ.లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టును ప్రైవేట్‌ పెట్టుబడులు, కేంద్రం సహకారంతో అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని అచ్చెన్న వెల్లడించారు. ఇందులో ప్రభుత్వ వాటా రూ.30 వేల కోట్లు కాగా, ఉద్యాన అబివృద్ధికి రూ.15 వేల కోట్లు వెచ్చించనున్నట్ట తెలిపారు. రాయలసీమతో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 22 ప్రధాన పంటలపై ప్రత్యేక దృష్టి పెట్టి, నాణ్యమైన మొక్కల సరఫరా నుంచి ఎగుమతుల వరకు సమగ్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. పశ్చిమగోదావరి జిల్లాను కోకో హబ్‌గా చేసి, కోకో సిటీ ఏర్పాటుతో చాక్లెట్‌ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పండ్ల తోటల రైతులకు స్థిరమైన ఆదాయ భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా సంప్రదాయ సాగు నుంచి అధిక ఆదాయమిచ్చే ఉద్యాన పంట వైపు రైతుల్ని ప్రోత్సహిస్తున్నామని అన్నారు.


ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.20 వేలు చొప్పున అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ కింద అందిస్తున్నాం. 2025-26లో రెండు విడతల్లో 46.86 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.6,309.44 కోట్లు చెల్లించాం. 2026-27లో రూ.6,600 కోట్లు ప్రతిపాదించాం. ధాన్య సేకరణకు పాత బకాయిలు రూ.1,674.47 కోట్లు చెల్లించి రైతుల్ని ఆదుకున్నాం. ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకంలో 22.5 లక్షల పంపుసెట్లకు రోజూ 9 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం. గత డిసెంబరు వరకు రూ.13,241 కోట్లు ప్రభుత్వం రాయితీ భరించింది. ఇప్పటి వరకు 69 వేల కొత్త విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చాం. ఈ ఏడాది విద్యుత్‌ రాయితీ కింద రూ.13,722 కోట్లు ప్రతిపాదించాం. వ్యవసాయ రంగానికి ఉపాధి హామీ అనుసంధానం కింద గతేడాది రూ.2,783 కోట్లతో 831 లక్షల పని దినాలు కల్పించాం. ఎన్టీఆర్‌ జలసిరి కింద ఈ ఏడాది ఉచిత బోర్లు వేసి, మోటార్లు ఉచితంగా ఇస్తాం. రైతులకు నీటి భద్రత కోసం అవసరమైన కాలువల పూడికతీత, ప్రాజెక్టుల నిర్వహణకు ఈ ఏడాది రూ.14,277 కోట్లు ప్రతిపాదించాం. రైతుల వ్యవసాయ యాంత్రీకరణకు రూ.139.65 కోట్లు, రాయితీ విత్తనాలు పంపిణీకి రూ.240 కోట్లు కేటాయించాం. గతేడాది 37.53 లక్షల టన్నుల ఎరువులు సరఫరా చేయగా, ఈసారి రూ.40 కోట్లతో బఫర్‌స్టాక్‌ పెడతాం. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ సేంద్రీయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయంలో ఏపీ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచింది. నేషనల్‌ మిషన్‌ ఆన్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ కింద 8.357 గ్రామాల్లో కమ్యూనిటీ బేస్డ్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ అమలు చేస్తున్నాం. ఉత్తమ ప్రకృతి సేద్య విధానాలు అవలంభిస్తున్న 12,319 మంది చాంపియన్‌ రైతులను క్షేత్రస్థాయి శిక్షకులుగా తయారు చేశాం. 2.83 లక్షల మంది రైతులు 3.55 లక్షల ఎకరాల్లో రసాయన రహిత ఎస్‌2ఎస్‌ వ్యవసాయాన్ని అనుసరించారు. ఈ ఏడాది ప్రకృతి సేద్యానికి రూ.208 కోట్లు కేటాయించాం. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కేంద్రమైన వ్యవసాయ శాఖకు రూ.12,152.32 కోట్లు ప్రతిపాదించాం’’ అని అన్నారు.

Updated Date - Feb 15 , 2026 | 05:12 AM