పామాయిల్ రైతులు ఎఫ్‌ఆర్‌పీ రాడ్లను వాడాలి
ABN , Publish Date - Jun 28 , 2026 | 05:49 AM
పామాయిల్ గెలలు కోయడానికి ప్రస్తుతం వినియోగిస్తున్న అల్యూమినియం, ఇనుప రాడ్ల స్ధానంలో ఎఫ్‌ఆర్‌పీ రాడ్లను వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ భద్రతా విభాగపు సంచాలకులు..
విద్యుత్ ప్రమాదాల నివారణకు అప్రమత్తత అవసరం
విద్యుత్ భద్రతా విభాగం డైరెక్టర్ విజయలక్ష్మి
విజయవాడ సిటీ, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): పామాయిల్ గెలలు కోయడానికి ప్రస్తుతం వినియోగిస్తున్న అల్యూమినియం, ఇనుప రాడ్ల స్ధానంలో ఎఫ్‌ఆర్‌పీ రాడ్లను వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ భద్రతా విభాగపు సంచాలకులు, చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ జి.విజయలక్ష్మి సూచించారు. విద్యుదాఘాతాలను నివారించేందుకు రైతులు, రైతు కూలీలు రబ్బరు బూట్లు, రబ్బరు గ్లౌజులు ధరించాలన్నారు. ఈ విషయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా విద్యుత్ ప్రమాదం బారినపడే అవకాశం ఉందని హెచ్చరించారు. జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాలలో భాగంగా పతంజలి ఫుడ్స్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లె గ్రామంలోని ఒక పామాయిల్ తోటలో రైతులు, రైతు కూలీలకు విద్యుత్ భద్రతపై శనివారం అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయలక్ష్మి మాట్లాడుతూ ఏటా విద్యుత్ ప్రమాదాల కారణంగా అనేక మంది చనిపోతున్నారని, ఆస్తి నష్టం కూడా జరుగుతోందన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాంటే ప్రతి ఒక్కరికి విద్యుత్ భద్రతపై అవగాహన ఉండాలని స్పష్టంచేశారు. ప్రతి రైతు తమ పొలంలో మోటార్లు, మోటారు స్టార్టర్లు, పంపు నియంత్రణ బోర్డులకు తప్పనిసరిగా సరైన ఎర్తింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తడి చేతులతో చెప్పులు లేకుండా మోటార్లను ఎట్టి పరిస్ధితుల్లో ఆఫ్ చేయవద్దని కోరారు. పొలాల్లో విద్యుత్ తీగలు తెగి నేలపై పడి ఉన్నా ...తక్కువ ఎత్తులో వే లాడుతున్నా వాటికి దూరంగా ఉండడంతో స్ధానిక విద్యుత్ అధికారులకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ బి.సౌజన్య, పతంజలి ఫుడ్స్ అసోసియేట్ జనరల్ మేనేజర్ కె.శ్రీనివాస్, ప్లాంటేషన్ హెడ్ జి.వీరేంద్రనాథ్, ఏఈ మురళీకృష్ణ పాల్గొన్నారు.