5321 కోట్లు నష్టం
ABN , Publish Date - May 11 , 2026 | 03:52 AM
కేంద్ర ప్రభుత్వం కేంద్ర పథకాలకు నిధులు భారీగా కేటాయిస్తోంది. అదే సమయంలో వాటిని వాడుకునేందుకు రకరకాల నిబంధనలు విధిస్తోంది. 2024-25 నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల వినియోగానికి సంబంధించి...
కేంద్ర పథకాల నిధులు వాడుకోలేకపోయిన రాష్ట్రం
స్పర్శ్ విధానం అమల్లో ఆర్థిక శాఖ వైఫల్యం
ఇందులోని లోటుపాట్లు అధిగమించని వైనం
2024-25లో 55 శాతం నిధులే వినియోగం
2025-26లో అయితే 34 శాతం మాత్రమే
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
కేంద్ర ప్రభుత్వం కేంద్ర పథకాలకు నిధులు భారీగా కేటాయిస్తోంది. అదే సమయంలో వాటిని వాడుకునేందుకు రకరకాల నిబంధనలు విధిస్తోంది. 2024-25 నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల వినియోగానికి సంబంధించి దేశవ్యాప్తంగా స్పర్శ్ అనే విధానం తీసుకొచ్చింది. దీనివల్ల గత ఆర్థిక సంవత్సరంలో ఏపీ రూ.5,321 కోట్లు నష్టపోయింది. స్పర్శ్ కంటే ముందున్న విధానంలో ఏదైనా పథకానికి కేంద్రం వాటా నేరుగా ఏపీ ప్రభుత్వ ఖజానాకు చేరేది. బిల్లులు క్లియర్ చేసి చెల్లింపులు చేసేవారు. కానీ ఇప్పుడు స్పర్శ్ విధానంలో కేంద్రం వాటా నేరుగా రాష్ట్రాల ఖజానాకు చేరడం లేదు. బిల్లులు రాష్ట్రంలో క్లియర్ అయ్యాక కేంద్రానికి పంపితే, అక్కడ కూడా క్లియర్ అయితేనే డబ్బు కాంట్రాక్టర్ల ఖాతాలో పడుతోంది. ఇంతవరకు ఓకే కానీ.. కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన నిధుల మంజూరు, రాష్ట్రం ఇచ్చే బీఆర్‌వో, టెక్నికల్ బిడ్లు, ఫైనాన్షియల్ బిడ్లు, కోర్టు కేసులు, ఇతర వివాదాలు దాటుకుని ఏ పథకమైనా అమల్లోకి వచ్చే సరికి డిసెంబరు, జనవరి వస్తోంది.
ఆయా పథకాలు చేపట్టి, బిల్లులు సమర్పించడం, క్లియరెన్స్ పొందడం, బిల్లుల చెల్లింపు మార్చి 31లోగా జరిగిపోవాలి. లేదంటే కేంద్రం నిధులు రావు. 2025-26లో చాలా పథకాలు, నిధులను కేంద్రం జనవరి తర్వాత మంజూరు చేసింది. మార్చి 31లోగా బిల్లులు పెట్టడం కష్టం. దీంతో ఏపీ చాలావరకు నష్టపోతోంది. కొన్ని పథకాలను సగం వినియోగించుకుంటుండగా, మరికొన్నింటిని వాడుకోలేకపోతోంది. రెండేళ్ల నుంచి ఈ పథకంలో అమల్లో ఉంది. అయితే ఇందులో ఉన్న లోటు పాట్లు, సవాళ్లు రాష్ట్ర ఆర్థిక శాఖకు తెలుసు. అయినప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో వాటిని అధిగమించకలేకపోయింది. సీఎం చంద్రబాబు ప్రతి సమావేశంలోనూ ఢిల్లీ వెళ్లి నిధుల వినియోగానికి మార్గం సుగమం చేయాలని ఆదేశిస్తూనే ఉన్నారు. కేంద్రం కేటాయింపుల్లో ఒక్క పైసా కూడా వదలకూడదని చెప్తూనే ఉన్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి, అధికారులు ఢిల్లీ పర్యటనలు చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు.
గ్రాంట్లు ఆపేసి.. సాస్కీ రూపంలో అప్పు
రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ మార్గాల్లో తెచ్చిన అప్పులన్నింటినీ అభివృద్ధి కోసం కాకుండా రెవెన్యూ ఖర్చులకు దారి మళ్లిస్తున్నాయి. దీంతో అభివృద్ధిలో వెనుకబడిపోతున్నాయి. నాబార్డు, ఈఏపీ నుంచి తెచ్చే అప్పులను మాత్రమే మౌలికసదుపాయాల ప్రాజెక్టుల కోసం ఉపయోగిస్తున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి క్షీణత కారణంగా ఇప్పుడు ఈఏపీ అప్పులను కేంద్రం ప్రోత్సహించడం లేదు. అందుకే సాస్కీ రూపంలో రాష్ట్రాలకు వడ్డీ లేకుండా 50ఏళ్ల కాలపరిమితితో అప్పులిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనకు ఇవి ఉపయోగపడుతున్నాయి. కానీ తిరిగి కట్టక్కర్లేని కేంద్ర పథకాల నిధులకు కోత పెట్టి, వడ్డీ లేని అప్పులంటూ రాష్ట్రాలకు సాస్కీ రూపంలో ఇస్తోంది. వడ్డీ లేకపోయినా ఎప్పుడో ఒకప్పుడు ఈ అప్పులు కట్టాల్సిందే. అదే కేంద్ర పథకాలకు నిధులు వస్తే వాటిని రాష్ట్రాలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. సాస్కీ కింద ఏ పనులు చేయాలన్న నియమనిబంధనలు ఏమీ లేవు. దీంతో గతంలో రోడ్లు వేసిన వారి బిల్లులు, ఇతర క్యాపిటల్ పనులు చేసి రాజకీయ పలుకుబడి ఉన్న వారి బిల్లులను సాస్కీ కింద చూపించి కేంద్రం నుంచి అప్పు తెచ్చి చెల్లింపులు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
రెండేళ్లలో ఇదీ పరిస్థితి..
2025-26లో 79 కేంద్ర ప్రాయోజిత పథకాలకు గాను కేంద్రం రూ.15,126 కోట్లు కేటాయించగా, రూ.11,324 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రాష్ట్రం వినియోగించుకుంది రూ.3,851 కోట్లు మాత్రమే. మొత్తం కేటాయింపుల్లో ఇది 25 శాతం కాగా, మంజూరైన నిధుల్లో 34 శాతమే. మరికొంత మొత్తం నిధులకు క్లియరెన్స్ రాలేదు. 2024-25లో రూ.14,109 కోట్లు రాష్ట్రానికి మంజూరు కాగా అందులో రూ.7,849 కోట్లు వినియోగించుకుంది. అంటే 55 శాతం నిధులు వాడుకోగలిగింది. కానీ గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నిధులు వాడుకోవడంలో ఆర్థిక శాఖ చాలా విఫలమైంది. స్పర్శ్ అమల్లోకి వచ్చాక గత రెండేళ్లలోనూ రాష్ట్రాలన్నీ కేంద్ర పథకాల నిధులు భారీగా కోల్పోయాయి. అయినప్పటికీ కేంద్రం తన విధానం మార్చుకోవడం లేదు.