ఏవియేషన్ హబ్‌గా ఏపీ!
ABN , Publish Date - Jul 03 , 2026 | 04:50 AM
ఆంధ్రప్రదేశ్‌ను ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి అన్నారు.
రాష్ట్ర మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి
ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌తో భేటీ
ఏరోస్పేస్ పెట్టుబడులపై చర్చ
న్యూఢిల్లీ, జూలై 2(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ను ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయాల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానశ్రయాన్ని ఏర్పాటు చేయాలనే వ్యూహాత్మక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. గురువారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన మంత్రి కే రామ్మోహన్‌నాయుడిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో ఏవియేషన్ రంగ అభివృద్థికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక, రూట్ మ్యాప్, పెండింగ్‌లో ఉన్న అనుమతులు, తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. రాష్ట్రంలోని నదులు, జలాశయాల్లో ప్రతిపాదిత 10 ప్రాంతాల్లో వాటర్ ఏరోడ్రోమ్‌ల అభివృద్థి ద్వారా సీప్లేన్ సేవలను ప్రారంభించే అంశంపై సమావేశంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా హెలిపోర్టుల అభివృద్థికి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని మంత్రి జనార్థన్‌రెడ్డి కోరారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ, ఐ అండ్ ఐ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, మారిటైమ్ బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్యతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బనగానపల్లె అభివృద్ధికి సహకరించండి..
నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద నిధులు విడుదల మంజూరు చేయాలని పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ వంశీ రామమోహన్‌ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి.. ఆ సంస్థ సీఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తెలుగు వ్యక్తి బుర్రా వంశీ రామమోహన్‌తో భేటీ అయ్యారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న బనగానపల్లె నియోజకవర్గ పరిధిలోని కొలిమిగుండ్ల మండలం నందిపాడు గ్రామంలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న హై వోల్టేజ్ ట్రాన్స్‌మిషన్ లైన్స్ ప్రాజెక్టుపై చర్చించారు. బనగానపల్లె ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు సీఎస్ఆర్ కింద నిధులు విడుదల చేయాలని మంత్రి కోరారు. మంత్రి ప్రతిపాదనలపై సీఎండీ రామమోహన్ సానుకూలంగా స్పందించారు.