Share News

గ్రామీణ అంగన్వాడీలకూ ‘వందనం’!

ABN , Publish Date - Jul 18 , 2026 | 04:33 AM

గ్రామీణ అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా ‘తల్లికి వందనం’ పథకాన్ని వర్తింపజేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

గ్రామీణ అంగన్వాడీలకూ ‘వందనం’!

  • పథకం పరిధిలోకి 47,555 మంది కార్యకర్తలు

  • వారికీ లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ ఉత్తర్వులు

  • ఆదాయం రూల్‌ కారణంగా ఇప్పటి వరకూ ‘తల్లికి వందనం’ లబ్ధికి దూరం

  • కూటమి సర్కార్‌ నిర్ణయంపై హర్షాతిరేకాలు

అమరావతి, జూలై 17(ఆంధ్రజ్యోతి): గ్రామీణ అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా ‘తల్లికి వందనం’ పథకాన్ని వర్తింపజేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీని వలన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే 47,555 మంది అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఈ స్కీమ్‌ పరిధిలోకి రానున్నారు. దీని ప్రకారం అర్హతలు బట్టి 47,555 మంది అంగన్వాడీ కార్యకర్తలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. రాష్ట్రవ్యాప్తంగా 55,792 మంది అంగన్వాడీ కార్యకర్తలు విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 42,860 మంది, గిరిజన ప్రాంతాల్లో 4695 మంది, పట్టణ ప్రాంతాల్లో 8237 మంది పనిచేస్తున్నారు. నెలవారీ ఆదాయం నిబంధనల దృష్ట్యా ఇప్పటి వరకూ ‘తల్లికి వందనం’ పట్టణ ప్రాంత అంగన్వాడీలు, ఆయాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఆయాల పిల్లలకు మాత్రమే అమలు చేశారు. ప్రస్తుతం గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు గౌరవ వేతనం రూ.11,500, ఆయాలకు రూ.7 వేలుగా ఉంది. తల్లికి వందనంతో సహా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించాలంటే.. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు కుటుంబ ఆదాయం రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలకు మించకూడదు. దీంతో ఇప్పటి వరకూ అర్హత కలిగిన పట్టణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఆయాల పిల్లలకు మాత్రమే ‘తల్లికి వందనం’ వర్తించింది. గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కార్యకర్తలకు వారి కుటుంబ ఆదాయం రూ.10 వేల పైనే ఉండడంతో, వారి బిడ్డలకు పథకం రావడం లేదు. ఈ నేపథ్యంలో వేతనం విషయంలో కొంత సడలింపు ఇస్తూ.. గ్రామీణ అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా ‘తల్లికి వందనం’ వర్తింపజేస్తున్నట్లు విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.


అంగన్వాడీల తరఫున ధన్యవాదాలు: మంత్రి సంధ్యారాణి

గ్రామీణ ప్రాంత అంగన్వాడీ కార్యకర్తల బిడ్డలకు ‘తల్లికి వందనం’ వర్తింపజేయడంపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సంతోషం వ్యక్తం చేశారు. వేలాది మందికి లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు, విద్యా మంత్రి లోకేశ్‌లకు రాష్ట్రంలోని అంగన్వాడీ కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు ఎంతోకాలంగా ఈ శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారని, పలుమార్లు తనకు విజ్ఞప్తులు కూడా అందజేశారని తెలిపారు.

Updated Date - Jul 18 , 2026 | 04:36 AM