ఎక్సైజ్ ఆదాయం పైపైకి..!
ABN , Publish Date - Apr 04 , 2026 | 03:48 AM
ధరలు తగ్గించినా, కొత్తగా క్వార్టర్ రూ.99 బ్రాండ్లు అందుబాటులోకి తీసుకొచ్చినా ఎక్సైజ్ శాఖ గణనీయమైన ఆదాయం సాధించింది. తాజాగా ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో..
రూ.29 వేల కోట్ల రాబడి
2025-26లో పెరిగిన అమ్మకాలు
నవోదయంతో సారా స్థానంలో లిక్కర్
ధరలు తగ్గినా ఖజానా కళకళ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ధరలు తగ్గించినా, కొత్తగా క్వార్టర్ రూ.99 బ్రాండ్లు అందుబాటులోకి తీసుకొచ్చినా ఎక్సైజ్ శాఖ గణనీయమైన ఆదాయం సాధించింది. తాజాగా ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.29,042 కోట్ల ఆదాయం దక్కించుకుంది. అంతకుముందు సంవత్సరం(2024-25)కంటే ఇది 0.68 శాతం ఎక్కువ. 2025-26 సంవత్సరంలో లిక్కర్ 414 లక్షల కేసులు విక్రయించారు. బీరు 232 లక్షల కేసులు అమ్ముడైంది. వీటి విలువ రూ.31,237 కోట్లు. అమ్మకాల పరంగా చూస్తే 2024-25తో పోలిస్తే 6.11 శాతం అమ్మకాలు పెరిగాయి. తద్వారా రూ.25,727 కోట్ల ఆదాయం సమకూరింది. లైసెన్స్ ఫీజులు, ఇతర ఆదాయం రూ.3316 కోట్లు వచ్చింది. మొత్తంగా ఎక్సైజ్ శాఖ రూ.29.42 వేల కోట్ల ఆదాయాన్ని గడించింది.
అమ్మకాల స్థాయిలో..
2025-26 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు పెరిగినా ఆదాయం ఆ స్థాయిలో పెరగలేదు. లిక్కర్ 14.59 శాతం, బీరు 70.29 శాతం అమ్మకాలు పెరిగాయి. కానీ, అమ్మకాల విలువ పరంగా చూస్తే పెంపు కేవలం 6.11 శాతంగానే ఉంది. దీనికి కార ణం ప్రభుత్వం ధరలు తగ్గించడం. గత 21 నెలల్లో 40కిపైగా బ్రాండ్ల ధరలను ప్రభుత్వం తగ్గించింది. వైసీపీ హయాంలో కమీషన్ల కోసం అడ్డగోలుగా పెంచిన ధరలను సాధారణ స్థాయికి తీసుకొచ్చింది. అలాగే కొన్ని బ్రాండ్ల మద్యాన్ని క్వార్టర్ రూ.99కే ప్రవేశపెట్టింది. క్వార్టర్ రూ.99 బ్రాండ్ల మార్కెట్ వాటా 18శాతంగా ఉంది. ఈ చర్యలతో అమ్మకాలు పెరిగినా ఆదాయం ఆ స్థాయిలో పెరగలేదు. అయితే, మద్యం దుకాణాల ‘నూతన పాలసీ’తో రూ.1900 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే, ఇతరత్రా రూపాల్లో వచ్చిన ఆదాయంతో మొత్తంగా 0.68 శాతం అదనపు రాబడిని సాధించారు.
నవోదయం 2.0!
2019కి ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం నాటుసారా నిర్మూలనకు ‘నవోదయం’ పేరుతో కార్యక్రమాన్ని అమలుచేసింది. అప్పట్లో చాలా వరకు నాటుసారాను నిర్మూలించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక మద్యం అమ్మకాలు అస్తవ్యస్తంగా మారడంతో నాటుసారా కూడా విచ్చలవిడిగా పెరిగిపోయింది. దీంతో ప్రస్తుత ప్రభుత్వం ‘నవోదయం 2.0’ను తిరిగి ప్రారంభించింది. నాటుసారా స్థావరాలను దాదాపుగా తొలగించారు. ఫలితంగా ఆ ప్రాంతాల్లో నాటుసారా తాగే ప్రజలు ప్రభుత్వం అమ్ముతున్న మద్యం కొంటున్నారు. ప్రభుత్వం కూడా ఆయా ప్రాంతాల్లో క్వార్టర్ రూ.99 బ్రాండ్ల మద్యాన్ని ఎక్కువగా అందుబాటులో ఉంచింది. దీంతో ఈ మద్యం అమ్మకాలు పెరిగాయి. మరోవైపు మొత్తం ధరలు తగ్గించడంతో పక్క రాష్ర్టాల నుంచి అంతకముందు ప్రవేశించిన ‘నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్’ పూర్తిగా ఆగిపోయింది. ఫలితంగా రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాల్లో అమ్మకాలు పెరిగాయి. రాష్ర్టానికి రావాల్సిన ఆదాయం మనకే దక్కుతోంది.