Share News

ఎక్సైజ్‌కు విభజన చిక్కులు

ABN , Publish Date - Jul 25 , 2026 | 05:32 AM

కొత్త జిల్లాలకు ఉద్యోగుల విభజన ఎక్సైజ్‌ శాఖకు కొత్త తలనొప్పి తెస్తోంది. సీనియారిటీ ఆధారంగా ఎక్సైజ్‌ ఉద్యోగులను జిల్లాలకు కేటాయిస్తుండటంతో...

ఎక్సైజ్‌కు విభజన చిక్కులు

  • కొత్త జిల్లాలకు ఉద్యోగుల విభజన

  • సీనియారిటీనే ప్రాతిపదిక అంటూ మార్గదర్శకాలు

  • సీనియర్లలో పురుషులే అధికం.. జూనియర్లలో మహిళలు

  • పట్టణాలకు పురుషులు... మారుమూల, ఏజెన్సీకి మహిళలు

  • ఇలా విభజిస్తే నేరాల కట్టడి కష్టమే!

అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): కొత్త జిల్లాలకు ఉద్యోగుల విభజన ఎక్సైజ్‌ శాఖకు కొత్త తలనొప్పి తెస్తోంది. సీనియారిటీ ఆధారంగా ఎక్సైజ్‌ ఉద్యోగులను జిల్లాలకు కేటాయిస్తుండటంతో... కొత్త జిల్లాలకు మొత్తం మహిళా కానిస్టేబుళ్లనే పంపాల్సి వస్తోంది. ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లకు గతంలోనూ ఉమ్మడి జిల్లానే ప్రాతిపదికగా ఉండేది. ఇప్పుడు అదే ఉమ్మడి జిల్లాలో అంతర్గతంగా ఏర్పడిన కొత్త జిల్లాల మధ్య వారిని విభజిస్తున్నారు. ఇందుకు సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకోవాలని సాధారణ పరిపాలన శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. మిగిలిన శాఖల్లో తరచూ ఉద్యోగుల భర్తీ చేపడుతుండటంతో పెద్దగా సమస్య తలెత్తలేదు. కానీ ఎక్సైజ్‌లో కానిస్టేబుళ్లు భర్తీ చివరిసారిగా 2012లో జరిగింది. అందులోనూ పురుషులే ఎక్కువగా ఉన్నారు. దీంతో ఇప్పుడు సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకోవడంతో పురుష కానిస్టేబుళ్లంతా నగరాలు, పట్టణాలు ఉండే జిల్లాలను ఎంపిక చేసుకుంటున్నారు. జూనియర్లుగా ఉన్న మహిళా కానిస్టేబుళ్లకు మారుమూల, ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉండే జిల్లాలు మిగులుతున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మహిళా కానిస్టేబుళ్ల కేటాయింపులను పరిశీలిస్తే... కొత్త జిల్లాల్లో శ్రీకాకుళంకు ఇద్దరు వస్తుంటే, పార్వతీపురం మన్యంకు 14 మంది వెళ్తున్నారు.


విజయనగరానికి ముగ్గురే ఉంటే, మన్యంకు 20 మంది వెళ్లాల్సి వస్తోంది. విశాఖపట్నంలో విశాఖపట్నంకు ఏడుగురు వెళ్తుంటే, అనకాపల్లికి ఏకంగా 27 మంది వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గుంటూరు జిల్లాలో గుంటూరుకు నలుగురు, పల్నాడుకు 14 మంది వెళ్తారు. కడపలో కడపకు ఒక్కరూ లేకుండా మొత్తం 13 మందీ అన్నమయ్య జిల్లాకు వెళ్లాలి. కర్నూలులోనూ కర్నూలుకు ఒక్కరూ లేకుం డా నంద్యాలకు 23 మంది వెళ్లాల్సిన పరిస్థితి. అనంతపురంలో అయితే అనంతపురానికి తొమ్మిది మంది వస్తే, శ్రీసత్యసాయికి 55 మందిని కేటాయించాల్సి వస్తోంది. ఇలా కేటాయించడం వల్ల మద్యం సంబంధిత నేరాలు సారా, ఎన్‌డీపీఎల్‌, గంజాయి ఉండే ప్రాంతా ల్లో ఎక్కువ మంది మహిళా కానిస్టేబుళ్లే మిగులుతారు. దీనివల్ల ఆ జిల్లాల్లో నేరాల నియంత్రణ కష్టంగా మారే ప్రమాదం ఉంది.


మొత్తం సీనియర్లే వచ్చినా కష్టమే

సీనియారిటీ ప్రాతిపదికగా తీసుకుంటే నగరాలు, పట్టణాలు ఎక్కువగా ఉండే జిల్లాలకు బాగా సీనియర్‌ కానిస్టేబుళ్లు వెళ్తున్నారు. సాధారణంగా స్టేషన్లలో బాగా సీనియర్లను ఎక్కువగా ఆఫీసు పనులకే వినియోగిస్తుంటారు. రైడ్లు, బార్లు, షాపులపై నిఘాకు జూనియర్లను ఉపయోగిస్తారు. ఇప్పుడు కొన్ని జిల్లాలకు చాలా వరకు సీనియర్‌ కానిస్టేబుళ్లనే కేటాయించినా.. అక్కడ ఎక్సైజ్‌ పరిపాలన కష్టం అవుతుంది. ఇప్పటివరకూ మహిళలు, పురుషుల్లో జూనియర్లు సమానంగా ఉండటం వల్ల పాలనలో ఇబ్బందులు తలెత్తలేదు. ఇప్పుడు కొన్ని జిల్లాల్లో ఎక్కువగా మహిళలు, కొన్ని జిల్లాల్లో సీనియర్లు మాత్రమే ఉంటే పాలనకు ఇబ్బందిగా మారుతుంది. అందువల్ల ఎక్సైజ్‌ శాఖ వరకు ఈ నిబంధనలు మార్చి స్థానికతను ఆధారంగా తీసుకోవాలని ఎక్సైజ్‌ ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరుతోంది. దీనిపై ఎక్సైజ్‌ శాఖ అధికారులు జీఏడీకి లేఖ రాస్తే సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉంది. లేనిపక్షంలో కేటాయింపులు అస్తవ్యస్తంగా మారి, పాలన కుంటుపడే ప్రమాదం ఉందని అంటున్నారు.

Updated Date - Jul 25 , 2026 | 05:33 AM