ఇంజనీరింగ్ కనీస ఫీజు 47వేలు
ABN , Publish Date - Jul 26 , 2026 | 05:22 AM
రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల కనీస ఫీజు రూ.47వేలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఫీజుల విధానంపై శనివారం ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
ఫీజుల కమిటీ నిర్ణయం తర్వాత మార్పు
అమరావతి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల కనీస ఫీజు రూ.47వేలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఫీజుల విధానంపై శనివారం ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకూ రూ.40 వేలు కనీస ఫీజు కాగా, దానిని రూ.47వేలకు పెంచింది. అంతకంటే ఎక్కువ ఫీజులున్న కాలేజీల ఫీజులను తాత్కాలిక ఫీజులుగా గుర్తిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కౌన్సెలింగ్‌లో చూపించే ఫీజులన్నీ తాత్కాలికమేనని స్పష్టంచేసింది. ఆ మేరకు కాలేజీలు ఫీజులు వసూలు చేసుకోవచ్చని సూచించింది. అయితే తాత్కాలిక ఫీజులకు మించి విద్యార్థుల నుంచి అదనంగా ఎలాంటి ఫీజులూ వసూలు చేయకూడదు. ఇవి ఈ విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తాయి. అనంతరం ఉన్నత విద్య ఫీజుల కమిటీ తుది ఫీజులు ఖరారు చేస్తుంది. ప్రస్తుతం కంటే ఫీజు పెరిగితే విద్యార్థుల నుంచి కాలేజీలు వసూలు చేయొచ్చు. తగ్గితే దానిని విద్యార్థులకు తిరిగి చెల్లించాలి. లేదంటే తర్వాత కట్టే ఫీజులో సర్దుబాటు చేయాలి. తుది ఫీజుల ఖరారుకు అనుగుణంగా సర్దుబాటు చేస్తామని విద్యార్థులకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలి. అలాగే ఉన్నత విద్య కమిటీ తుది ఫీజులకు అనుగుణంగానే ఫీజులు వసూలు చేస్తామని అఫిలియేషన్ ఇచ్చే యూనివర్సిటీకి అండర్‌టేకింగ్ ఇవ్వాలి. ఈ షరతుతో ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ కౌన్సెలింగ్ చేపడుతోంది. శనివారం రాత్రి నుంచి ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది.