Share News

ప్రభుత్వంపై ఫీజుల భారం!

ABN , Publish Date - Jul 09 , 2026 | 04:36 AM

రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నత విద్య ఫీజుల భారం పెరుగుతోంది. 2025-26విద్యా సంవత్సరంలో రీయింబర్స్‌మెంట్‌ కింద సగటున ఒక్కో విద్యార్థిపై రూ.58,083 చెల్లించింది.

ప్రభుత్వంపై ఫీజుల భారం!

  • 2025-26లో రీయింబర్స్‌మెంట్‌ రూ.2,125 కోట్లు

  • ప్రతి ఇంజనీరింగ్‌ విద్యార్థిపై 58వేల వ్యయం

  • ఈ ఏడాది కనీస ఫీజు 47 వేలుగా నిర్ణయం

  • ప్రభుత్వ ఖాజానాపై 140 కోట్ల అదనపు భారం

  • ఇంజనీరింగ్‌ తర్వాత డిగ్రీ కౌన్సెలింగ్‌ ప్రారంభం

  • ఈ ఏడాది నుంచి అడ్మిషన్లకు కామన్‌ పోర్టల్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నత విద్య ఫీజుల భారం పెరుగుతోంది. 2025-26విద్యా సంవత్సరంలో రీయింబర్స్‌మెంట్‌ కింద సగటున ఒక్కో విద్యార్థిపై రూ.58,083 చెల్లించింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ భారం మరింత పెరగనుంది. గతేడాది వరకు కనీస ఫీజు రూ.40వేలు ఉండగా ఇప్పుడు దానిని రూ.47 వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఖజానాపై దాదాపు రూ.140 కోట్ల వరకూ అదనపు భారం పడనుంది. ఫీజుల ఖరారు పూర్తయిన తర్వాత ఈ భారం మరింత పెరిగే అవకాశం ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా ప్రభుత్వం వంద శాతం ఫీజు చెల్లిస్తోంది. 2025-26 విద్యా సంవత్సరంలో 3,65,876 మంది ఈ పథకం కింద ఇంజనీరింగ్‌ చదివారు. వారిలో ఫైనలియర్‌ విద్యార్థులు కోర్సులు పూర్తిచేసుకుని బయటకు వెళ్లగా మిగిలిన మూడేళ్ల విద్యార్థులు కొనసాగుతున్నారు. వీరి ఫీజులకు మొత్తం రూ.2,125 కోట్లు అయింది. గతేడాది 125 కాలేజీలకు కనీస ఫీజు రూ.40 వేలు ఉండగా, వాటిలో 32శాతం మంది విద్యార్థులు చదువుతున్నారు. రూ.90 వేల నుంచి రూ.1.05 లక్షల వరకు ఫీజులున్న కాలేజీలు 10 ఉన్నాయి. వాటిలో 7.4 శాతం మంది ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 222 ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 56శాతం కనీస ఫీజు పరిధిలోనే ఉన్నాయి.


ఈ ఏడాది నుంచే పెంపు

ఫీజుల ఖరారుకు సమయం లేకపోవడంతో ఈ ఏడాది 10శాతం మేర పెంచాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే కాలేజీ యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు కొత్త ఫీజులు ఖరారు చేయాలని నిర్ణయించింది. కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి వీటిని నిర్ధారించే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా కనీస ఫీజు రూ.40 వేల నుంచి రూ.47 వేలకు పెంచాలని నిర్ణయించింది. రూ.47 వేల కంటే ఎక్కువ ఫీజులున్న కాలేజీల్లో అదే మొత్తంతో కౌన్సెలింగ్‌ చేపడతారు. కౌన్సెలింగ్‌ ముగిసేలోగా కొత్త ఫీజులు ఖరారు చేస్తారు. అంటే కౌన్సెలింగ్‌ సమయంలో చూపించే ఫీజులను విద్యార్థులు తాత్కాలిక ఫీజులుగానే భావించాలి. సుమారు 145 కాలేజీల్లో కనీస ఫీజులు రూ.47 వేలకు పెంచితేనే ప్రభుత్వంపై రూ.140 కోట్ల అదనపు భారం పడుతుంది. అంతకంటే ఎక్కువ ఫీజులున్న కాలేజీల్లో సగటున 10 శాతం ఫీజులు పెరిగినా మరో రూ.160 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. అంటే మొత్తంగా రూ.300కోట్ల అదనపు భారం పడనుంది. కాగా, ఈ ఏడాది డిగ్రీ కోర్సులకు కూడా కొత్త ఫీజులు ఖరారు చేయనున్నారు. ఆ భారం కూడా ప్రభుత్వంపై పెరుగుతుంది. ఈ నెల 15 నుంచి ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ చేపట్టాలని ఉన్నత విద్యాశాఖ భావిస్తోంది. ఆ తర్వాత డిగ్రీ అడ్మిషన్లకు కౌన్సెలింగ్‌ ప్రారంభిస్తారు. ఈ ఏడాది నుంచి కొత్తగా అడ్మిషన్లకు కామన్‌ పోర్టల్‌ తీసుకొస్తున్నారు. విద్యార్థులు అందులో దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated Date - Jul 09 , 2026 | 04:37 AM