Share News

ఉద్యోగుల కేటాయింపునకు 3 కమిటీలు

ABN , Publish Date - Jun 25 , 2026 | 03:19 AM

రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులను వివిధ జిల్లాలు, జోన్లు, కేడర్లలో సర్దుబాటు చేసే అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

ఉద్యోగుల కేటాయింపునకు 3 కమిటీలు

  • ఏ జిల్లాకావాలో ఆప్షన్‌ ఇచ్చుకునే చాన్స్‌

  • అభ్యంతరాలు ఉంటే అప్పీల్‌కు అవకాశం

  • మార్గదర్శకాలపై అన్ని ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు, సూచనలు కోరిన ప్రభుత్వం

అమరావతి, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులను వివిధ జిల్లాలు, జోన్లు, కేడర్లలో సర్దుబాటు చేసే అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉద్యోగ సంఘాల నేతలతో రాష్ట్ర సచివాలయంలో సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) అధికారులు భేటీ అయ్యారు. ఉద్యోగులను స్థానిక కేడర్లలో సర్దుబాటు చేసేందుకు రూపొందించిన మార్గదర్శకాలపై అభిప్రాయాలు కోరారు. అయితే, తమ అభిప్రాయాలు తెలిపేందుకు సమయం కావాలని, జిల్లా, శాఖాధిపతుల స్థాయిలో ఈ మార్గదర్శకాలపై సమావేశాలు నిర్వహించాలని, పదోన్నతులపై విధించిన తాత్కాలిక నిషేధం గడువును పొడిగించాలని ఉద్యోగసంఘాల నేతలు విన్నవించారు. ఇప్పటికే జిల్లాస్థాయిలో సమావేశాలు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశామని జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, ఆర్థిక శాఖ సెక్రటరీ వినయ్‌చంద్‌, జాయింట్‌ సెక్రటరీ గౌతమ్‌ అల్లాడ తెలిపారు. పదోన్నతులపై విధించిన తాత్కాలిక నిషేధం గడువు పెంచుతామన్నారు. కాగా, వివిధ ప్రభుత్వ శాఖల్లోని సివిల్‌ పోస్టులను జిల్లా కేడర్‌, ఉమ్మడి జిల్లా కేడర్‌, జోనల్‌ కేడర్‌, ఉమ్మడి జోనల్‌ కేడర్‌, మల్టీ జోనల్‌ కేడర్లుగా వర్గీకరించారు. ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రతి శాఖలోనూ మూడంచెల కమిటీలను ఏర్పాటు చేశారు.

సమయం కావాలి: ఉద్యోగ సంఘాలు

ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలపై అభిప్రాయాలు తెలిపేందుకు సమయం కావాలని కోరినట్లు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి. రామకృష్ణ తెలిపారు. ఉద్యోగులు, టీచర్ల కేటాయింపుపై వచ్చే సమస్యలను పరిశీలించేందుకు ఒక అధికార ప్రతినిధిని నియమించాలని కోరినట్టు ఏపీటీఎఫ్‌ అధ్యక్షుడు జి. హృదయరాజు చెప్పారు. కొన్ని రాష్ట్రస్థాయి పోస్టులను జోన్‌, మల్టీజోనల్‌ పోస్టులుగా మార్చడం వల్ల ఉద్యోగులకు సమాన అవకాశాలు దెబ్బతింటాయ ని, పదోన్నతుల అవకాశాలు తగ్గిపోతాయని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్‌ అన్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి పోస్టులను ప్రత్యేకంగా పరిగణించాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు.


ఇనీ మార్గదర్శకాలు

1) జిల్లాస్థాయి కమిటీలో పాత, కొత్త జిల్లాల్లోని కేడర్‌ పోస్టుల కేటాయింపు కోసం పాత జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా, కొత్త జిల్లాల కలెక్టర్లు కో చైర్మన్లుగా ఉంటారు.

2) జోనల్‌/ఉమ్మడి జోనల్‌ కేడర్‌ పోస్టుల కేటాయింపు కోసం ఆయా శాఖల అధిపతులు చైర్మన్లుగా ఉంటారు.

3) మల్టీజోనల్‌ కేడర్‌ పోస్టుల కేటాయింపు కోసం ఆయా శాఖల కార్యదర్శులు చైర్మన్లుగా ఉంటారు.

4) ఈ కమిటీలు మొదట సీనియారిటీ జాబితాలు తయారు చేసి శాఖల వారీగా వెబ్‌సైట్లు, నోటీసు బోర్డుల్లో ప్రదర్శిస్తారు.

5) సీనియారిటీ జాబితా కోసం తప్పుడు సమాచారం ఇచ్చిన ఉద్యోగులపై ఏపీ సీసీఏ నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు.

6) సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలుంటే ఉద్యోగులు మూడు రోజుల్లోగా తెలపాలి. వాటిని పరిశీలించి 7వ రోజున తుది జాబితా ప్రకటిస్తారు.

7) ఉద్యోగులు కొత్త జిల్లా, జోన్‌ లేదా మల్టీజోన్‌ కేడర్ల కోసం తమ ప్రాధాన్యాలను ఆప్షన్‌ ఫారాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఒకసారి ఆప్షన్‌ ఇస్తే మార్పు చేర్పులకు అవకాశం ఉండదు.

8) వివిధ జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపులో ముందుగా ప్రత్యేక కేటగిరీల వారికి ప్రాధాన్యం ఇస్తారు. 70 శాతం పైగా దివ్యాంగులకు, మానసిక వైకల్యంతో ఉన్న పిల్లలు గల ఉద్యోగులకు, అనారోగ్యంతో ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.

9) సీనియారిటీ, ఉద్యోగి ఇచ్చిన ఆప్షన్‌ ఆధారంగా కేటాయింపులు చేస్తారు.

10) ఒక జిల్లాకు/జోన్‌కు పోస్టుల కంటే ఎక్కువ ఆప్షన్లు వస్తే సీనియారిటీ ఆధారంగానే ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను ప్రతి జిల్లా/జోన్‌లో పాతపద్ధతిలోనే కేటాయిస్తారు.

Updated Date - Jun 25 , 2026 | 03:19 AM