ఐదు రోజుల పని దినాలు అమలు చేయండి
ABN , Publish Date - May 21 , 2026 | 04:25 AM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండేళ్లుగా ఎదురుచూస్తున్న ఐఆర్‌ను తక్షణమే ప్రకటించాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు.
తక్షణమే ఐఆర్ ప్రకటించండి: బొప్పరాజు
విజయవాడ (గాంధీనగర్), మే 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండేళ్లుగా ఎదురుచూస్తున్న ఐఆర్‌ను తక్షణమే ప్రకటించాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. ఉద్యోగుల సమస్యలపై బుధవారం సీఎం కార్యాలయ ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా బొప్పరాజు మాట్లాడుతూ.. పొదుపు చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని శాఖల ఉద్యోగులకు వారానికి ఐదు పని దినాలను అమలు చేయాలని కోరారు. విద్యుత్తు వాహనాల కొనుగోలులో ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలు కల్పించాలని కోరారు. పీఆర్సీ కమిషన్ నియామకం, ఐఆర్ ప్రకటనపై చర్చించేందుకు జూన్ 7న జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్టు బొప్పరాజు తెలిపారు. ఈలోగా ఆయా అంశాలపై స్పష్టత ఇవ్వాలని అధికారులను కోరారు. జేఏసీ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోసియేట్ చైర్మన్ టీవీ ఫణిపేర్రాజు తదితరులు పాల్గొన్నారు.