Share News

మా ‘బాబు’ బంగారం!

ABN , Publish Date - Jul 20 , 2026 | 03:46 AM

సీఎం చంద్రబాబు బంగారం వంటి నాయకుడని, ఆయనను జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటామని ఉత్తరాంధ్ర పరిధిలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ముక్తకంఠంతో చెప్పారు....

మా ‘బాబు’ బంగారం!

  • సీపీఎస్‌ నుంచి ఓపీఎస్‌కు మార్పుపై ఉద్యోగ, ఉపాధ్యాయుల సంబరాలు

  • చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం

  • విశాఖలో కృతజ్ఞతాభినందన సభ

మద్దిలపాలెం(విశాఖ), జూలై 19(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు బంగారం వంటి నాయకుడని, ఆయనను జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటామని ఉత్తరాంధ్ర పరిధిలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ముక్తకంఠంతో చెప్పారు. ఓపీఎస్‌ కలను సాకారం చేసిన చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ‘థాంక్యూ సీఎం సార్‌’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. సీపీఎస్‌ నుంచి ఓపీఎ్‌సకు మార్చినందుకు ఆదివారం విశాఖపట్నంలోని స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో ‘కృతజ్ఞతాభినందన’ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సముద్రమంత ఆనందం.. కూటమితోనే మేమందరం’ అని రాసిన ప్లకార్డులను ఉపాధ్యాయ సంఘ నేతలు, ఉద్యోగులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఉద్యోగుల 23 ఏళ్ల కలను కూటమి ప్రభుత్వం సాకారం చేసిందన్నారు. సీపీఎస్‌ నుంచి ఓపీఎ్‌సకు మార్పుచేసి 11 వేల మంది ఉద్యోగుల జీవితాల్లో ఆనందం నింపిందన్నారు. ఇది ఇలానే కొనసాగాలంటే కూటమి ప్రభుత్వం సుదీర్ఘ కాలం కొనసాగాలని, దానిని దృష్టిలో పెట్టుకుని 2029లో రాష్ట్ర ప్రజలంతా మంచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ సభ్యుడు వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ, ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేసింది... చేస్తున్నదీ ఒక్క చంద్రబాబేనని అన్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారని, ఆయన సీఎం అయ్యాక పట్టించుకోలేదని అన్నారు. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ, గౌరవించుకోవాల్సిన ఉపాధ్యాయులకు మద్యం దుకాణాల వద్ద నిలబెట్టిన వ్యక్తి జగన్‌ అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, కంచర్ల శ్రీకాంత్‌, పేరాబత్తుల రాజశేఖరం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2026 | 03:46 AM