పదోన్నతులపై నిర్లక్ష్యం
ABN , Publish Date - May 02 , 2026 | 04:09 AM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు మానసిక స్థైర్యం కలిగిస్తాయి. చేస్తున్న ఉద్యోగంలో వారికి పదోన్నతి కలిగితే ఆ ఆనందమే వేరు. ఈ విషయంలో వారికి ఎలాంటి అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ......
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ సీఎం చంద్రబాబు పనులు పరుగులు పెట్టిస్తున్నారు. కానీ.. శాఖల ఉన్నతాధికారులు మాత్రం నత్తకు నడకలు నేర్పేలా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు సంబంధించిన పనుల విషయం ఎలా ఉన్నా.. శాఖల్లోని ఉద్యోగులకు సంబంధించిన కీలక పదోన్నతుల వ్యవహారంలోనూ వారు నిమ్మకు నీరెత్తినట్టు మౌనంగా ఉంటున్నారు. ఫలితంగా ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారం.. ఎటూ తేలడం లేదు. తాజాగా రాష్ట్రపతి ఉత్తర్వుల రూపంలో మరో అడ్డంకి ఎదురైంది.
సీఎస్, జీఏడీ వెంటపడినా బేఖాతర్
ఆర్థిక, అసెంబ్లీ హెచ్‌వోడీల్లో పెండింగ్
మిగతా అన్ని శాఖల్లోనూ ఇదే దుస్థితి
ఉన్నతాధికారుల ధోరణిపై అసంతృప్తి
ప్రమోషన్ల విధివిధానాలు బుట్టదాఖలు
తాజాగా రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి
ఫలితంగా ఐదారు మాసాలు ఆగాల్సిందే
ప్రభుత్వంపై ఉద్యోగుల రుసరుస
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు మానసిక స్థైర్యం కలిగిస్తాయి. చేస్తున్న ఉద్యోగంలో వారికి పదోన్నతి కలిగితే ఆ ఆనందమే వేరు. ఈ విషయంలో వారికి ఎలాంటి అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ-డీపీసీ విధానం అమల్లోకి తెచ్చింది. పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు మరింత పారదర్శకం చేసింది. ఈ -డీపీసీ వల్ల ఏప్రిల్, ఆగస్టులో పదోన్నతులు రావాల్సిన వారికి ముందుగానే నవంబరు, డిసెంబరులో వచ్చాయి. కానీ, అన్ని స్థాయిలలో, అన్ని శాఖల్లో ఇది జరగడం లేదు. సచివాలయంలోని ఆర్థిక శాఖ, దాని పరిధిలోని హెచ్‌వోడీలు, అసెంబ్లీలో రెండేళ్ల నుంచి పదోన్నతులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వంలో పదోన్నతులు పెండింగ్‌లేని శాఖ ఒక్కటి కూడా లేదని ఉద్యోగులు వాపోతున్నారు.
వెంటపడుతున్న జీఏడీ
డీపీసీలు ఎలా నిర్వహించాలి, ఎప్పుడు పూర్తి చేయాలి అనే విషయంపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. అయినప్పటికీ పదోన్నతుల్లో నెలకొన్న అంతులేని నిర్లక్ష్యం కొనసాగింది. ఈ వ్యవహారంపై 2025, జూలై 31న అప్పటి సీఎస్ విజయానంద్ డీపీసీల నిర్వహణ, పదోన్నతుల ఉత్తర్వులపై మార్గదర్శకాలను మరోసారి గుర్తుచేస్తూ వివరణాత్మక జీవో ఇచ్చారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, డీపీసీల నిర్వహణను సకాలంలో పూర్తి చేయడానికి ముందస్తు చర్యలు ఎలా తీసుకోవాలో వివరించారు.. పదోన్నతులకు సంబంధించిన ప్యానెల్ సెప్టెంబరు 1 నుంచి ప్రారంభమై తదుపరి ఏడాది ఆగస్టు 31తో ముగుస్తుంది.
మార్పు రాలేదు!
సెలక్షన్ విభాగంలోని ఒకటి, రెండు స్థాయి గెజిటెడ్ పోస్టులకు సంబంధించిన పదోన్నతుల ఉత్తర్వులను 2026, జనవరి 31లోగా జారీ చేయాలని ఆదేశించారు. 3.. అంతకంటే ఎక్కువస్థాయి పోస్టుల డీపీసీ ప్రతిపాదనలను 2026, జనవరి 21లోగా శాఖాధిపతులు సచివాలయ విభాగాలకు పంపాలన్నారు. జనవరి 31లోగా వీరికి పదోన్నతులు కల్పించాలని ఆదేశించారు. అలాగే, నాన్ సెలక్షన్ పోస్టుల విభాగంలో ప్రస్తుతం ఉన్న ఖాళీలకు జనవరి 31లోగా నియామక ఉత్తర్వులు జారీ చేయాలని మెమోలో అప్పటి సీఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. 2026 జనవరి 22న మరోసారి.. పదోన్నతులు జనవరి 31 నాటికి పూర్తి చేయాలని ఆదేశిస్తూ జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ అన్ని శాఖాధిపతులకు, సెక్రటరీలకు యూవో నోట్ జారీ చేశారు. 2026, ఏప్రిల్ 10న ఒకసారి, 14న మరోసారి.. ఏప్రిల్ 15వ తేదీలోగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ప్రతిపాదనలన్నీ ప్రభుత్వానికి పంపాలని, వాటిని సచివాలయ వర్గాలు ఏప్రిల్ 20 నాటికి పూర్తి చేసి పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత పదోన్నతులు నిలిపివేస్తామని రావత్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 28న ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ స్థానిక కేడర్ల వ్యవస్థీకరణ, ప్రత్యక్ష నియామకాల క్రమబద్ధీకరణ ఉత్తర్వులు-2025 అమలు దృష్ట్యా ప్రభుత్వంలోని సెలక్షన్, నాన్ సెలక్షన్ పోస్టుల ప్రమోషన్లను త్వరలో నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 3వ స్థాయి గెజిటెడ్, అంతకంటే పైస్థాయి పోస్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను మే 4వ తేదీలోపు సాధారణ పరిపాలనా శాఖకు పంపాలని అన్ని శాఖాధిపతులను ప్రభుత్వం కోరింది. మొదటి, రెండో స్థాయి గెజిటెడ్ పోస్టులకు సంబంధించి వాటి కార్యదర్శులు, శాఖాధిపతులు డీపీసీ సమావేశాలను మే 4 నాటికి నిర్వహించి ఉత్తర్వులు జారీ చేయాలి. నాన్ సెలక్షన్ పోస్టులకు సంబంధించి మే 1 నాటికి అర్హులైన అభ్యర్థులను అందుబాటులో ఉన్న చోట మే 4 నాటికి భర్తీచేయాలని రావత్ ఆదేశించారు. జీఏడీతో సమావేశాలు జరిగిన ప్రతిసారీ మౌఖికంగా ఆదేశాలు జారీ చేస్తునే ఉన్నారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు.
ఉన్నతాధికారుల నిర్లక్ష్యం
సీఎం చంద్రబాబుకు.. బిజినెస్ సంస్కరణల్లో వచ్చిన అవార్డు ఉద్యోగుల సమష్టి కృషి వల్లే సాధ్యమైందని ఆయన చెప్పారు. అంతేకాదు, ఈ విజయం ఉద్యోగులకే అంకింతమన్నారు. సీఎం పరిధిలో ఉండే సీఎస్, జీఏడీ విభాగాలు పదోన్నతులు త్వరితగతిన పూర్తి చేయాలని శాఖాధిపతులు, సెక్రటరీల వెంట పడుతున్నప్పటికీ ఉన్నతాధికారు మాత్రం ఆ ఆదేశాలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు.. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు ఈ పదోన్నతులకు అడ్డం పడుతోంది. దీంతో మరో ఐదారు నెలలు ఉద్యోగులకు పదోన్నతులు నిలిచిపోతాయని తెలిసింది. సీఎం, ఆయన పరిధిలోని శాఖలు సవ్యంగా పనిచేస్తున్నప్పటికీ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల ఉద్యోగులకు అన్యాయం జరుగుతోంది. ఆ అసంతృప్తి ప్రభుత్వంపై కనిపిస్తోంది.
ఇదీ విధానం..
1) ఆగస్టు మొదటి వారంలో ఖాళీలు అంచనా వేయాలి. సీనియారిటీని సమీక్షించాలి.
2) రెండో వారంలో పదోన్నతుల కోసం పరిగణనలోకి తీసుకునే జోన్‌లో అధికారుల డేటాను సేకరించాలి.
3) చార్జ్ మెమోలు, సస్పెన్షన్ కేసులు, ఏసీబీ సహా క్రిమినల్ కేసులు, కోర్టు ఉత్తర్వులను సేకరించాలి.
4) మూడో వారంలో సమాచారం ఆధారంగా డీపీసీ నోట్ సిద్ధం చేయాలి.
5) సెప్టెంబరు 1 నుంచి అంచనాలను నిర్ధారించి తాత్కాలిక నోట్‌ను ఫైనల్ డీపీ సీ నోట్‌గా మార్చి ప్రభుత్వానికి ఇవ్వాలి.
6) 2026, జనవరి 11న కూడా ఆ ప్యానెల్ ఏడాదికి సంబంధించిన డీపీసీల నిర్వహణకు కాలపరిమితిని నిర్దేశిస్తూ అప్పటి సీఎస్ విజయానంద్ మరో మెమో జారీ చేశారు.