Share News

విద్యుత్‌ కొనుగోలు ధర.. మరో 30 పైసలు తగ్గాలి!

ABN , Publish Date - Apr 28 , 2026 | 05:35 AM

విద్యుత్‌ కొనుగోలు ధరను వీలైనంత తగ్గించగలిగితే.. జనంపై భారాన్ని చాలా వరకు తగ్గించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

విద్యుత్‌ కొనుగోలు ధర.. మరో 30 పైసలు తగ్గాలి!

  • ఈ ఏడాది చివరికల్లా 4.60కి తగ్గింపే లక్ష్యం: సీఎం

  • సంస్కరణల అమలుకు టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి

  • ఉత్పత్తి వ్యయం తగ్గింపుపై దృష్టి పెట్టాలి

  • పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి పెంచాలి

  • ఇంధన రంగంలో పరిశోధనకు ప్రత్యేక వర్సిటీ

  • ఎలక్ట్రిక్‌ వాహనాలపై విస్తృత అవగాహన

  • సూర్యఘర్‌, కుసుమ్‌ అమల్లో లక్ష్యాలను చేరాలి

  • ఉన్నతాధికారులకు చంద్రబాబు నిర్దేశం

అమరావతి, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ కొనుగోలు ధరను వీలైనంత తగ్గించగలిగితే.. జనంపై భారాన్ని చాలా వరకు తగ్గించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో కొనుగోలు ధర రూ.5.20 ఉండగా.. ఈ ఏడాది మార్చినాటికి రూ.4.90కు తగ్గించామని.. దానిని ఈ ఏడాది చివరికల్లా రూ.4.60కి తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో విద్యుత్‌ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. వేసవిలో విద్యుత్‌ సరఫరా, 2026-27 ఏడాదిలో విద్యుత్‌ కొనుగోలు ప్రణాళిక, పీఎం సూర్యఘర్‌, పీఎం కుసుమ్‌ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించారు. ప్రజాప్రయోజనాల కోసమే సంస్కరణలు తెస్తున్నామని.. ఆ సంస్కరణల అమలు కోసం టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. తక్కువ వ్యయంతో విద్యుత్‌ ఉత్పత్తి చేసే అంశంపై నిరంతరం అధ్యయనం, జరుగుతూనే ఉండాలన్నారు. ఈ వేసవిలో ప్రతి రోజూ 275 నుంచి 285 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ ఉంటుందని అంచనా వేసినట్లు అధికారులు చెప్పారు. ఈ నెలలో ఇప్పటి వరకు 6397 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం జరిగిందన్నారు. గతేడాదితో పోలిస్తే సుమారు 14 శాతం వాడకం పెరిగిందని తెలిపారు. దీనికి వేసవితోపాటు పారిశ్రామిక వినియోగం పెరగడం కూడా కారణమని వివరించారు.


వచ్చే ఆరు నెలల కాలానికి కొనుగోళ్ల ప్రణాళికలను సీఎంకు తెలియజేశారు. విద్యుత్‌ కొనుగోలు వ్యయం తగ్గాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా తీసుకోవలసిన చర్యలపై అధికారులు దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. ‘విద్యుత్‌ రంగంలో ఏయే దేశాల్లో ఎలాంటి కొత్త ఆవిష్కరణలు అమలవుతున్నాయో అధ్యయనం చేయాలి. విద్యుత్‌ రంగంలో పరిశోధన-విశ్లేషణకు పెద్దపీట వేయాలి. ఇందుకోసం ప్రత్యేక యూనివర్సిటీ పెట్టాలని ఆలోచిస్తున్నాం. ఇందుకు ట్రాన్స్‌కో, జెన్కో వంటి సంస్థలు సీఎస్సార్‌ నిధులు కేటాయించాలి. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్‌ కేటాయింపులు జరిపేలా చర్యలు తీసుకుంటాం. పంప్డ్‌ స్టోరేజీ విధానంలో విద్యుదుత్పత్తిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి. కాలుష్యం తగ్గేలా.. పర్యావరణహిత ఇంధన ఉత్పత్తిపై దృష్టి సారించాలి. 2028-29 నాటికి సగానికిపైగా విద్యుదుత్పత్తి పునరుత్పాదక రంగం నుంచే వచ్చేలా చూడాలి’ అని తెలిపారు.


ప్రతి నెలా 2 లక్షల సూర్యఘర్‌ కనెక్షన్లు

పీఎం సూర్యఘర్‌ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 52,396 సోలార్‌ రూఫ్‌ టాప్‌ కనెక్షన్లు ఇచ్చామని, దీనిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ఇకపై ప్రతి నెలా 2 లక్షల పీఎం సూర్యఘర్‌ కనెక్షన్లు ఇచ్చేలా చూడాలని స్పష్టం చేశారు. పీఎం కుసుమ్‌ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 2.94 లక్షల కనెక్షన్లు ఇచ్చామని, మొదటి విడత పీఎం కుసుమ్‌ పథకాన్ని డిసెంబరు నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని, ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం, కొనుగోళ్లపై పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. సమీక్షలో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, విద్యుత్‌, ట్రాన్స్‌కో, డిస్కంల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వేసవిలో కోతలు ఉండకూడదు: గొట్టిపాటి

వేసవిలో ఎలాంటి కోతల్లేకుండా నిరంతరం విద్యుత్‌ సరఫరా జరిగేలా చూడాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష జరిపారు. వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో బ్రేక్‌ డౌన్లకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని మంత్రి కోరారు. ఆర్డీఎస్ఎస్‌, పీఎం సూర్యఘర్‌, పీఎం కుసుమ్‌ అమలును మరింత వేగవంతం చేయాలని, పథకాల అమలుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. సీఎం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం 6 లక్షల సూర్యఘర్‌ కనెక్షన్లు ఆగస్టు నాటికి పూర్తి చేయాలన్నారు. విద్యుత్‌ కొనుగోళ్లు తగ్గిస్తూ.. డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి పెంచాలని సూచించారు. సమీక్షలో మూడు డిస్కంల సీఎండీలు పుల్లారెడ్డి, శివశంకర్‌, పృధ్వీతేజ, ట్రాన్స్‌కో జేఎండీ సాయి సూర్య ప్రవీణ్‌చంద్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2026 | 05:35 AM