పెంచలేదు.. తగ్గించాం!
ABN , Publish Date - Jun 25 , 2026 | 03:32 AM
ఐదేళ్ల జగన్ ప్రభుత్వ హయాంలో తొమ్మిదిసార్లు విద్యుత్ చార్జీలు పెంచితే.. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా పెంచలేదని విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
వచ్చే మూడేళ్లలోనూ కరెంటు చార్జీలు పెంచం
ట్రూ డౌన్ విప్లవం ఘనత కూటమిదే
సామాన్యులపై భారం మోపకుండా రూ.20 వేల కోట్లు ప్రభుత్వమే భరిస్తోంది
రెండేళ్లలో యూనిట్‌పై 13 పైసల భారం తగ్గించాం
కరెంటు కొనుగోలు వ్యయం 52 పైసలు తగ్గించాం
నేతన్నలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్
పవర్‌లూం కార్మికులకు 500 యూనిట్లు ఉచితం
రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీలో నంబర్ వన్‌గా నిలిపాం
మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడి
రెండేళ్ల విద్యుత్ శాఖపై ప్రగతి నివేదిక విడుదల
అమరావతి, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల జగన్ ప్రభుత్వ హయాంలో తొమ్మిదిసార్లు విద్యుత్ చార్జీలు పెంచితే.. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా పెంచలేదని విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాబోయే మూడేళ్లలో కూడా చార్జీలు పెంచబోమన్నారు. అదనపు ఖర్చుల పేరిట వినియోగదారులపై భారం వేసే ట్రూ-అప్ విధానానికి స్వస్తి పలికి, దేశంలోనే తొలిసారిగా యూనిట్‌కు 13 పైసల మేర ’ట్రూ-డౌన్’ (ధరల తగ్గింపు) అమలు చేసి సామాన్యుడికి ఊరటనిచ్చామని తెలిపారు. అదే సమయంలో 2026-27 సంవత్సరానికి సంబంధించిన రూ.15,790 కోట్ల ఆదాయ లోటును ప్రభుత్వం భరిస్తోందని.. అలాగే 2019-20 నుంచి 2023-24వరకు పంపిణీ సంస్థలకు సంబంధించిన రూ.4,497 కోట్ల ట్రూ-అప్ బాధ్యతలను కూడా ప్రభుత్వం స్వీకరించిందని చెప్పారు. తద్వారా ప్రజలపై అదనపు భారం పడకుండా చూడగలిగామని తెలిపారు. అసమర్థుడు సీఎం అయితే రాష్ట్రం ఎలా నష్టపోతుందో చెప్పడానికి 2019-24 నడుమ విద్యుత్ శాఖ విషయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే నిదర్శనమన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారం చేపట్టిన సమర్థుడైన నాయకుడు చంద్రబాబు తన విజన్‌తో ఏపీని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారిస్తే.. అసమర్థుడైన సీఎం ఆ తర్వాత అధికారంలోకి వచ్చి శాఖను నష్టాలపాల్జేశారని ధ్వజమెత్తారు. బుధవారం అమరావతి సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రెండేళ్ల కూటమి పాలనలో విద్యుత్ శాఖపై ప్రోగ్రెస్ రిపోర్టును మంత్రి గొట్టిపాటి, ఇంధన శాఖ ప్రత్యేక సీఎస్ కె.విజయానంద్ విడుదల చేశారు. అనంతరం రెండేళ్లలో విద్యుత్ శాఖ పురోగతిపై మాట్లాడారు. మంత్రి ఏమన్నారంటే..
రెండేళ్లలో ఏం చేశామంటే..
కూటమి ప్రభుత్వం వచ్చేనాటికి విద్యుత్ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, విద్యుత్ సంస్థలపై పెరుగుతున్న ఆర్థిక భారం, సరఫరా నాణ్యతను మెరుగుపరచాల్సిన అవసరం వంటి అంశాలు ప్రధాన సవాళ్లుగా నిలిచాయి. వాటన్నింటినీ అధిగమిస్తూ రంగాన్ని గాడినపెడుతున్నాం. సుమారు 22 లక్షల వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఉచిత విద్యుత్ కొనసాగుతోంది. 1.13 కోట్ల గృహ వినియోగదారులకు టారిఫ్ పెంపు భారం నుంచి ఉపశమనం కలిగించాం.
కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ రంగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. గత రెండేళ్లలో 5541 మెగావాట్ల సామర్థ్యం అదనంగా చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ కెపాసిటీ 14,551 మెగావాట్లు.
వ్యవసాయ రంగానికి రోజుకు 9 గంటలు పగటి పూట విద్యుత్ సరఫరా కొనసాగుతోంది. కొత్తగా మూడు డిస్కంల పరిధిలో 1.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చాం. విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని గణనీయంగా తగ్గించాం. 2023-24లో యూనిట్‌కు రూ.5.42గా ఉన్న సగటు విద్యుత్ కొనుగోలు వ్యయం.. 2025-26 నాటికి యూనిట్‌కు రూ.4.90కు తగ్గింది. కేవలం రెండేళ్లలో యూనిట్‌కు రూ.0.52 మేర తగ్గింది. ఈ ఒక్క సంస్కరణతో ఏడాదిలోనే ప్రభుత్వానికి సుమారు రూ.4,398 కోట్లు ఆదా అయింది. 2 లక్షల చిన్న, మధ్యతరగతి కమర్షియల్ వినియోగదారులకు యూనిట్ విద్యుత్ ధరను రూ.12.25 నుంచి రూ.9.95కి తగ్గించాం. వ్యాపార వర్గాలకు యూనిట్‌పై రూ.2.30 వరకు లబ్ధి చేకూర్చాం.
గత ప్రభుత్వ హయాంలో నిర్వహణ లోపాలతో వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యానికే పరిమితమైన జెన్కో థర్మల్, హైడల్ ప్రాజెక్టులను కూట మి ప్రభుత్వం పునరుద్ధరించింది.
నెట్ జీరో పాలసీలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భవనాలు, 2,898 హాస్టళ్లు, పాఠశాలలపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు వేగవంతం చేశాం. చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్‌లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నాం. హెయిర్ కటింగ్ సెలూన్లు, స్వర్ణకారులకూ రాయితీ విద్యుత్ అందిస్తున్నాం. 22 లక్షల ఎస్సీ, ఎస్టీ, ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నాం.
దేశంలో కోటి పీఎం సూర్యఘర్ కనెక్షన్లు ఇవ్వాలని ప్రధాని లక్ష్యంగా పెట్టుకోగా.. వాటిలో 20 లక్షల కనెక్షన్లు మన రాష్ట్రంలోనే ఇవ్వాలని టార్గెట్ పెట్టిన ఘనత చంద్రబాబుది. ఈ స్కీంను ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా అమలు చేస్తున్నాం. 6 లక్షల కనెక్షన్లను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వాటిలో 1.51 లక్షల కనెక్షన్లను ఇప్పటికే ఏర్పాటు చేశాం. త్వరలోనే బీసీలకూ అమలు చేస్తాం.
పీఎం కుసుమ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 11 కేవీ సబ్‌స్టేషన్ల దగ్గర సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా 2.93 లక్షల వ్యవసాయ పంపుసెట్లను సౌర విద్యుత్‌తో నడపాలన్నది లక్ష్యం.
ఆ ఐదేళ్లలో అంతా తిరోగమనమే..
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి రూ.32 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారు. బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. యూనిట్ ధర రూ.12 నుంచి 15కు కొన్నారు. తద్వారా ఐదేళ్లలో విద్యుత్ సంస్థలపై రూ.49,596 కోట్లు అప్పుల భారం మోపారు. జగన్ నిర్లక్ష్యం కారణంగా.. వీటీపీఎస్లో 800 మెగావాట్ల యూనిట్ 55 నెలలు ఆలస్యమైంది. దీంతో రూ.7000 కోట్ల భారం పడింది. కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ 44 నెలలు ఆలస్యమై.. రూ.5900 కోట్ల భారం పడింది. పోలవరం జల విద్యుత్కేంద్రం 2023 నాటికే అందుబాటులోకి రావలసి ఉండగా.. రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ ఆడిన కమీషన్ నాటకాలతో రూ.4737 కోట్ల ఆదాయం నష్టపోయాం. ఆ ఐదేళ్ల పాలనలో మొత్తమ్మీద రూ.1.29 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది.
టీడీపీ హయాంలో చేసుకున్న పీపీఏలను జగన్ రద్దు చేశారు. ఆయన చేసిన తప్పునకు హిందుజా ప్రాజెక్టుకు ఫిక్స్‌డ్ కాస్ట్ రూపంలో ఉపయోగించుకోని విద్యుత్‌కు రూ.1235 కోట్లు విద్యుత్ శాఖ చెల్లించాల్సి వచ్చింది. ఏపీ జెన్కోనూ జగన్ సర్వనాశనం చేశారు. ముడుపుల కోసం నాసిరకం బొగ్గు కొనుగోలు చేసి థర్మల్ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీశారు.
జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిపై కక్షతో సీఆర్‌డీఏ పరిధిలోని విద్యుత్ శాఖ పనులను నిలిపివేశారు. కూటమి వచ్చాక వాటిని తిరిగి ప్రారంభించేందుకు రూ.281 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది.
చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ డిస్కంలకు ‘ఏ’ రేటింగ్ వస్తుంది. జగన్ హయాంలో వాటి రేటింగ్ ‘సీ’, ‘డీ’కి పడిపోయింది. ఫలితంగా వడ్డీ రేట్లు పెరిగిపోయి, ఐదేళ్లలో ప్రభుత్వంపై రూ.2500 కోట్ల భారం పడింది.
ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇస్తానని జగన్ హామీ ఇచ్చి.. ఆక్వా, నాన్ ఆక్వా జోన్ పేర్లతో రైతులను విడదీసి కొందరికే రూ.1.50 ధరను పరిమితం చేశారు.