‘ఎరువుల యాప్’కు భారీ స్పందన
ABN , Publish Date - Jun 13 , 2026 | 04:31 AM
యాప్‌లో ఎరువుల కొనుగోలుకు రైతుల నుంచి భారీ స్పందన వస్తోంది. ప్రారంభించిన ఐదు రోజుల్లోనే 1 లక్షా 35 వేల బస్తాల ఎరువులను రైతులు కొనుగోలు చేశారు.
కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న రైతులు
5 రోజుల్లోనే లక్షన్నర బస్తాల విక్రయం
అమరావతి, జూన్ 12(ఆంధ్రజ్యోతి): యాప్‌లో ఎరువుల కొనుగోలుకు రైతుల నుంచి భారీ స్పందన వస్తోంది. ప్రారంభించిన ఐదు రోజుల్లోనే 1 లక్షా 35 వేల బస్తాల ఎరువులను రైతులు కొనుగోలు చేశారు. వ్యవసాయ శాఖ ఈ నెల 8వ తేదీన ఏపీఎయిమ్స్-2.0 యాప్‌ను ప్రారంభించింది. కాకినాడ, కృష్ణా జిల్లాలు మినహా మిగతా 26 జిల్లాల్లో గత ఐదు రోజులుగా ఈ యాప్ ద్వారానే రైతులకు యూరియా, డీఏపీ విక్రయాలు జరుగుతున్నాయి. యాప్ ద్వారా ఎరువులు తీసుకునేందుకు రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. రైతు సేవా కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, అథీకృత రిటైల్ డీలర్ల వద్ద ఈ యాప్‌లో వివరాలు నమోదు చేసుకుని, తమకు దగ్గరలోని డీలర్ వద్ద రైతులు ఎరువులు తీసుకుంటున్నారు. ప్రస్తుతం యూరియా, డీఏపీ రకాలు రైతులకు సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే 95వేల బస్తాల యూరియా, 40వేల బస్తాల డీఏపీ అమ్ముడుపోయిందని అధికారులు తెలిపారు. యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకు ఎమ్మార్పీ రేట్లకే ఎరువులు లభ్యమౌతున్నాయి. యూరియా, డీఏపీ అమ్మకాలపై ఎలాంటి ఆంక్షలు లేవని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ ఇటీవల ప్రకటించారు. యాప్‌లో బుక్ చేసుకున్న రైతులకు వెంటనే ఎరువులు సరఫరా అవుతాయని చెప్పారు. దీంతో ఖరీఫ్ సాగు కోసం కొందరు రైతులు తమకు అవసరమైన మేరకు ముందుగానే తీసుకుంటున్నారు. కాగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు 18.09లక్షల టన్నుల ఎరువులను కేంద్రం రాష్ట్రానికి కేటాయించింది.