Share News

దేశంలోనే నంబర్‌ వన్‌గా రాష్ట్ర విద్యావ్యవస్థ

ABN , Publish Date - Aug 23 , 2026 | 04:38 AM

రాష్ట్ర విద్యావ్యవస్థను దేశంలోనే నెంబరు-1 గా తీర్చిదిద్దటమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని మంత్రి లోకేశ్‌ అన్నారు. ఇందుకు ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులంతా సహకరించాలని కోరారు.

దేశంలోనే నంబర్‌ వన్‌గా రాష్ట్ర విద్యావ్యవస్థ

  • ఈ ఏడాది మరో 3 వేల టీచర్‌ పోస్టుల భర్తీ: మంత్రి లోకేశ్‌

విజయనగరం ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యావ్యవస్థను దేశంలోనే నెంబరు-1 గా తీర్చిదిద్దటమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని మంత్రి లోకేశ్‌ అన్నారు. ఇందుకు ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులంతా సహకరించాలని కోరారు. శనివారం మధ్యాహ్నం విజయనగరం దాసన్నపేట జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల క్లస్ట్టర్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. విద్యావ్యవస్థలో ప్రజాప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు పూర్తయ్యాయని, ఇక పూర్తిగా అభ్యసన ఫలితాలపైనే ఉపాధ్యాయులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఇకపై నెలకోసారి క్లస్టర్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశంలో పాల్గొని ఉపాధ్యాయుల క్షేత్రస్థాయి సమస్యలు తెలుకుంటానని హామీ ఇచ్చారు. సంస్కరణల కారణంగా గతేడాది మంచి ఫలితాలు వచ్చాయని, ఇది తొలిమెట్టు మాత్రమేనని, వంద శాతం ఫలితాల సాధనపై దృష్టి సారించాలని సూచించారు. ఇన్నోవేటివ్‌ కార్యక్రమాల ద్వారా విద్యార్ధుల కు ఒత్తిడి లేని, మెలుకువలతో కూడిన బోధన అందించాలని నిర్దేశించారు. ఇటీవల విశాఖలో ఓ ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌ చేయి చేసుకోవడంతో చిన్నారి మృతిచెందిన ఘటన తనను కలచివేసిందని, పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సూచించారు. చిన్నారుల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మహిళలను గౌరవించటంపై విద్యార్థులకు బోధించాలని, విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించాలని సూచించారు.


ఏడాదిలో మరో 3 వేల టీచర్‌ పోస్టుల భర్తీ

‘విద్యాశాఖ మంత్రిగా నేను భాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలోని పది వేల స్కూళ్లలో వన్‌ క్లాస్‌-వన్‌ టీచర్‌ విధానాన్ని తెచ్చాం. ఈ ఏడాది మరో 3 వేల టీచర్‌ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తాం. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయలను సింగపూర్‌, ఫిన్‌లాండ్‌ దేశాలకు పంపి అక్కడి బోధనా పద్ధతులను ఇక్కడ అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని మంత్రి అన్నారు. సమావేశంలో సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్కూల్‌ క్లస్టర్‌ కాంప్లెక్స్‌ సమావేశానికి హాజరైన లోకేశ్‌.. ఉపన్యాసాలకు భిన్నంగా విద్యార్థులకు కే మైక్‌ ఇచ్చి, వారి ఆలోచనలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. విద్యార్థులు వేసిన సరదా ప్రశ్నలకు మంత్రి అంతే కుషీగా సమాధానం ఇచ్చారు. అక్కడ జరుగుతున్న కెమిస్ట్రీ రివ్యూను శ్రద్ధగా విన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. తన దృష్టికి వచ్చిన సమస్యలపై ఉన్నాతాధికారులతో మాట్లాడారు.

Updated Date - Aug 23 , 2026 | 04:39 AM