ప్రస్తుతం ఉన్న సీట్లతోనే సరి!
ABN , Publish Date - Jun 30 , 2026 | 05:05 AM
ఉన్నత విద్య కోర్సుల సీట్ల పెంపు విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజనీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్ కోర్సుల సీట్ల పెంపునకు అనుమతి ఇవ్వకూడదని..
ఉన్నత విద్యా కోర్సుల్లో పెంపు లేదు
పాలిటెక్నిక్‌లో 4300, బీటెక్‌లో 6 వేల
సీట్ల పెంపునకు ఏఐసీటీఈ అనుమతి
కానీ, ఈస్థాయిలో పెంపునకు సర్కారు నో
ఇంజనీరింగ్‌లోనూ అదే విధానం అమలు
డిగ్రీలోనూ ఇంతే.. స్పష్టంచేసిన విద్యా శాఖ
లక్షల్లో సీట్లు మిగిలిపోతుండడమే కారణం
అమరావతి, జూన్ 29(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్య కోర్సుల సీట్ల పెంపు విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజనీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్ కోర్సుల సీట్ల పెంపునకు అనుమతి ఇవ్వకూడదని, ప్రస్తుతం ఉన్న సీట్లతోనే విద్యాసంవత్సరాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఏఐసీటీఈ నుంచి అనుమతులు వచ్చిన కోర్సులనూ కౌన్సెలింగ్‌లో చేర్చలేదు. 2025-26 విద్యా సంవత్సరంలో ఉన్న సీట్లను యథాతధంగా కొనసాగించనుంది. కాలేజీలు కోరుకుంటే మొత్తం సంఖ్య పెరగకుండా కోర్సులు సర్దుబాటు చేసుకోవచ్చని సూచించింది. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 7 వేల సీట్లు పెరిగాయి. వాటిలో 9 కొత్త కాలేజీలు ఉన్నాయి. అవి కాకుండా సుమారు 4,300 సీట్లకు ప్రస్తుత కాలేజీలే ఏఐసీటీఈ నుంచి అనుమతులు తెచ్చుకున్నాయి. ఆ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇటీవల పాలిటెక్నిక్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రారంభమైంది. అదనంగా అనుమతులు తెచ్చుకున్న సీట్లను కౌన్సెలింగ్‌లో చేర్చలేదు. మరోవైపు ఇంజనీరింగ్ అదనపు సీట్లకు కూడా అనుమతి లేదని విద్యాశాఖ వర్గాలు ఇప్పటికే కాలేజీలకు సమాచారం ఇచ్చాయి. ఈ విద్యా సంవత్సరానికి 6,210 సీట్లను పెంచుకునేందుకు ఏఐసీటీఈ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతిచ్చింది. వాటికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీచేయాల్సి ఉంది. అయితే, కొత్తగా వచ్చిన సీట్లకు అనుమతులు మంజూరయ్యే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు డిగ్రీ కోర్సుల్లోనూ సీట్ల పెంపునకు అనుమతి లేదని ఉన్నత విద్యాశాఖ ప్రైవేటు కాలేజీలకు ఇప్పటికే స్పష్టంచేసింది. కొత్త కోర్సులు ప్రవేశ పెట్టుకునేందుకు కూడా డిగ్రీ కాలేజీలకు అనుమతి లేదని తెలిసింది. దీంతో ప్రస్తుతం ఉన్న సీట్లతోనే కాలేజీలు అడ్మిషన్లు చేపట్టాల్సి ఉంటుంది.
ముందు చెప్పలేదు: యాజమాన్యాలు
అదనపు సీట్లకు అనుమతి లేదన్న విషయాన్ని ముందుగా తమకు చెప్పలేదని కాలేజీ యాజమాన్యాలు అంటున్నాయి. తమకు చెప్పకపోవడంతో ఏఐసీటీఈ నుంచి అనుమతులు తెచ్చుకున్నామని, దానివల్ల ఆర్థిక భారం పెరిగిందని యాజమాన్యాల ప్రతినిధులు తెలిపారు. అదనపు సీట్ల కోసం ఏఐసీటీఈకి రూ.లక్షల్లో ఫీజులు చెల్లించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని చెప్పారు. కనీసం పెరిగిన సీట్లను మేనేజ్‌మెంట్ కోటాలో అయినా చూపాలని కోరుతున్నట్టు తెలిపారు.
సర్కారుపై రూ.25 కోట్ల భారం
కొత్తగా పెరిగిన సీట్లతో సుమారు రూ.25 కోట్ల మేరకు అదనపు భారం పడుతుందని అంచనా. ప్రైవేటు కాలేజీల్లో 70 శాతం కన్వీనర్ కోటా, 30 శాతం మేనేజ్‌మెంట్ కోటా ఉంటుంది. పెరిగిన సీట్లలోనూ అదే నిష్పత్తిలో పంపిణీ జరుగుతుంది. కన్వీనర్ కోటా కింద అడ్మిషన్లు పొందే సీట్లకు ప్రభుత్వం పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తుంది. ఈ క్రమంలో పెరిగిన సీట్లకు సుమారు రూ.25 కోట్లు అదనపు భారం పడుతుందని భావిస్తున్నారు. కాగా, మరోవైపు కాలేజీల్లో ఏటా భారీగా సీట్లు మిగిలిపోతుండడం కూడా పెంపునకు అనుమతి ఇవ్వకపోవడానికి కారణమని తెలుస్తోంది. డిగ్రీలో ఏటా లక్షల్లో, ఇంజనీరింగ్‌లో వేల సంఖ్యలో సీట్లు మిగులుతున్నాయి. పాలిటెక్నిక్‌లోనూ అదే పరిస్థితి ఉంది. కాగా, కాలేజీల వాదన దీనికి భిన్నంగా ఉంది. కొత్త కోర్సులు ప్రవేశపెడుతూనే ఉన్న కోర్సులను కొనసాగిస్తే ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆయా కోర్సుల్లో చేరతారని అంటున్నాయి.