రేపు ‘ఈఏపీసెట్’ ఫలితాలు
ABN , Publish Date - Jul 01 , 2026 | 04:44 AM
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ(ఈఏపీసెట్) ప్రవేశ ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. వాస్తవానికి ఈ ఫలితాలను మంగళవారం విడుదల చేయాల్సి ఉంది.
విడుదల చేయనున్న లోకేశ్
సీబీఎస్ఈ రీవాల్యుయేషన్, ఇంటర్ సప్లిమెంటరీ మార్కులతో ఫలితాలు
సీబీఎస్ఈ విద్యార్థులకు న్యాయం
అమరావతి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ(ఈఏపీసెట్) ప్రవేశ ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. వాస్తవానికి ఈ ఫలితాలను మంగళవారం విడుదల చేయాల్సి ఉంది. అయితే, సీబీఎ్‌సఈ రీవాల్యుయేషన్ ఫలితాలు వచ్చిన విద్యార్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో విద్యాశాఖ గురువారానికి వాయిదా వేసింది. సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ రెండో విడత ఫలితాలను, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాల విద్యార్థుల ర్యాంకులను కూడా కలిపి ఈఏపీసెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఈఏపీసెట్ ఫలితాలను 2వ తేదీ(గురువారం)న మంత్రి లోకేశ్ విడుదల చేస్తారని ఉన్నత విద్యామండలి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈలోగా సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ రెండో విడత ఫలితాల్లో మార్కులు మెరుగుపడిన విద్యార్థులను దీనిలో కలపనుంది. సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ రెండో విడత ఫలితాలు ఆదివారం విడుదల కావడంతో కొందరు విద్యార్థులు తమ మార్కులను ఈఏపీసెట్ వెయిటేజీకి కలపాలని ఉన్నత విద్యామండలిని కోరారు.
ముందస్తు ప్రకటనలు ఎందుకు?
ఈఏపీసెట్, టెన్త్, ఇంటర్మీడియట్ లాంటి కీలకమైన ఫలితాల వెల్లడి తేదీలను మంత్రి లోకేశ్ అధికారికంగా ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే, ఈ ఏడాది ఈఏపీసెట్‌కు కన్వీనర్‌గా వ్యవహరించిన జేఎన్‌టీయూ కాకినాడ అధికారులు అత్యుత్సాహంతో యూనివర్సిటీ స్థాయిలోనే ముందుగా తేదీలను ప్రకటించారు. దీంతో మంగళవారం ఫలితాలు వస్తాయని విద్యార్థులు ఎదురుచూశారు. కానీ, వాయిదాపడటంతో ఆవేదన వ్యక్తం చేశారు.