Share News

ఇంజనీరింగ్‌లో 71 శాతం సీట్లు భర్తీ

ABN , Publish Date - Aug 10 , 2026 | 03:13 AM

ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌లో రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో 70.87 శాతం కన్వీనర్‌ కోటా సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తంగా అన్ని కాలేజీల్లో కలిపి కన్వీనర్‌ కోటాలో..

ఇంజనీరింగ్‌లో 71 శాతం సీట్లు భర్తీ

  • నేటి నుంచే ఫస్టియర్‌ తరగతులు ప్రారంభం

  • క్రీడా కోటా విద్యార్థులకు తర్వాతి దశల్లో కేటాయింపు

అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌లో రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో 70.87 శాతం కన్వీనర్‌ కోటా సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తంగా అన్ని కాలేజీల్లో కలిపి కన్వీనర్‌ కోటాలో 1,51,312 సీట్లు అందుబాటులో ఉండగా.. 1,07,239 సీట్లు భర్తీ అయ్యాయి. 44,073 సీట్లు మిగిలాయి. ఈ మేరకు ఇంజనీరింగ్‌ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ చేపట్టిన ఉన్నత విద్యాశాఖ ఆదివారం విద్యార్థులకు సీట్లు కేటాయించింది. 26 యూనివర్సిటీ కాలేజీల్లో 9347 సీట్లు ఉంటే.. 8133 సీట్లు భర్తీ కాగా, 1214 మిగిలాయి. 200 ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 1,27,398 సీట్లు అందుబాటులో ఉండగా 85,704 సీట్లు భర్తీ అయ్యాయి. 41,694 సీట్లు మిగిలిపోయాయి. 13 ప్రైవేటు యూనివర్సిటీల్లో 14,567 సీట్లు ఉంటే 13,402 సీట్లు నిండాయి. 1165 సీట్లు మిగిలాయి. కాగా, ఈ ఏడాది ఈఏపీసెట్‌లో 1,74,802 మంది అర్హత సాధించారు. 1,13,488 మంది ఇంజనీరింగ్‌ మొదటి దశ కౌన్సెలింగ్‌కు రిజిస్టర్‌ చేసుకున్నారు. 1,12,285 మంది ఆప్షన్లు ఎంపిక చేసుకోగా.. వారిలో 1,07,239 మందికి అడ్మిషన్లు లభించాయి. అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఈ నెల 13లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలి. అలాగే ఆన్‌లైన్‌లో కూడా అడ్మిషన్‌ను ధ్రువీకరించాలి. సోమవారం నుంచే ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. 666 మంది క్రీడా కోటా విద్యార్థులకు శాప్‌ నుంచి వివరాలు రాకపోవడంతో సీట్లు కేటాయించలేదు. వారికి తర్వాతి దశల్లో సీట్లు కేటాయిస్తారు.

Updated Date - Aug 10 , 2026 | 03:15 AM