10 తర్వాతే ఈఏపీసెట్ ఫలితాలు
ABN , Publish Date - May 27 , 2026 | 04:45 AM
ఈఏపీసెట్ ఫలితాలను జూన్ 10 తర్వాతే విడుదల చేయాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి షెడ్యూలు ప్రకారం జూన్ 1న ఫలితాలు విడుదల కావాలి.
అందరికీ ఒకేసారి ర్యాంకులకు నిర్ణయం
ఇంటర్ బెటర్‌మెంట్ వల్ల కొంత ఆలస్యం
వచ్చే ఏడాది నుంచి వెయిటేజీ తొలగింపు!
అమరావతి, మే 26 (ఆంధ్రజ్యోతి): ఈఏపీసెట్ ఫలితాలను జూన్ 10 తర్వాతే విడుదల చేయాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి షెడ్యూలు ప్రకారం జూన్ 1న ఫలితాలు విడుదల కావాలి. అయితే ఈ ఏడాది ఇంటర్మీడియట్‌లో సెకండియర్ విద్యార్థులకు కూడా బెటర్‌మెంట్ అవకాశం ఇవ్వడంతో ఫలితాల విడుదలపై కొంత సందిగ్ధత ఏర్పడింది. ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు 25శాతం వెయిటేజీ ఉంటుంది. ఈ నేపథ్యంలో మెరుగైన ర్యాంకు కోసం సీనియర్ ఇంటర్ విద్యార్థులు రెండేళ్లకు కలిపి దాదాపు 80వేల మంది బెటర్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. మరో లక్ష మంది సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నారు. ఈ పరీక్షలు జూన్ 5తో ముగుస్తాయి. తర్వాత సమాధాన పత్రాల మూల్యాంకనానికి కొంత సమయం పడుతుంది. ఇంటర్ తుది మార్కులు, ఈఏపీసెట్ మార్కులు కలిపి ఈఏపీసెట్ ర్యాంకులు ప్రకటిస్తారు. దీంతో బెటర్‌మెంట్ మార్కులు కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బెటర్‌మెంట్ రాసే విద్యార్థులను మినహాయించి, మిగిలిన విద్యార్థులకు ర్యాంకులు ప్రకటించాలా? లేదా వేచిచూడాలా? అని ఉన్నత విద్యామండలి ప్రభుత్వాన్ని అడిగింది. మొదట కొంత మందికి ర్యాంకులు ఇస్తే, తర్వాత పెరిగిన మార్కులతో ర్యాంకులు మారిపోయే పరిస్థితి ఉన్నందున అందరికీ కలిపి ఒకేసారి ఫలితాలు ఇవ్వాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. జూన్ 5న సప్లిమెంటరీ, బెటర్‌మెంట్ పరీక్షలు ముగిస్తే ఆ తర్వాత వీలైనంత త్వరగా మూల్యాంకనం చేయించి ఈఏపీసెట్ ఫలితాలు ఇచ్చేలా చూడనున్నారు. తొలుత బెటర్‌మెంట్ రాయని వారికి ర్యాంకులు ఇస్తే ఆ తర్వాత బెటర్‌మెంట్ మార్కుల ఆధారంగా ర్యాంకులు మారిపోతాయి. అందువ ల్ల అందరికీ ఒకేసారి ర్యాంకులు ఇవ్వాలని నిర్ణయించారు.
వెయిటేజీ తొలగింపు!
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీని తొలగించాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈఏపీసెట్ పరీక్షకు 75శాతం, ఇంటర్ మార్కులకు 25శాతం వెయిటేజీ ఉంది. ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థులకు ఉత్తీర్ణత తర్వాతే ర్యాంకులు కేటాయిస్తారు. ఈఏడాది నుంచి సెకండియర్ విద్యార్థులకూ బెటర్‌మెంట్ అవకాశం కల్పించినందున ఏటా ఈఏపీసెట్ ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇంటర్ వెయిటేజీని పూర్తిగా తొలగిస్తే సమస్యలు ఉండవని విద్యాశాఖ భావిస్తోంది.