ఇంజనీరింగ్‌లో అబ్బాయిల హవా
ABN , Publish Date - Jul 02 , 2026 | 03:15 AM
ఇంజనీరింగ్‌లో మరోసారి అబ్బాయిలు తమ హవా చాటుకున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ(ఈఏపీసెట్) ప్రవేశ పరీక్షకు సంబంధించి..
టాప్-10లో 9 ర్యాంకులు సొంతం
గుంటూరు విద్యార్థి మణిదీప్ ఫస్ట్
శ్రీకాకుళం విద్యార్థినికి 2వ ర్యాంకు
అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో బాలురు, బాలికలకు ఫిఫ్టీ-ఫిఫ్టీ
ఇంజనీరింగ్ 70.55శాతం, అగ్రికల్చర్, ఫార్మాలో 89.59శాతం మంది ఉత్తీర్ణత
ఇంజనీరింగ్‌లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు నూరు శాతం పాస్
ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేసిన లోకేశ్
అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌లో మరోసారి అబ్బాయిలు తమ హవా చాటుకున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ(ఈఏపీసెట్) ప్రవేశ పరీక్షకు సంబంధించి.. ఇంజనీరింగ్ స్ర్టీమ్ ఫలితాల్లో టాప్-10లో 9 మంది అబ్బాయిలే. కాగా, రెండో ర్యాంకు అమ్మాయి కైవసం చేసుకుంది. ఇక, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో టాప్-10 ర్యాంకులు అబ్బాయిలు, అమ్మాయిలకు చెరిసగం వచ్చాయి. ఇంజనీరింగ్ విభాగంలో గుంటూరుకు చెందిన జొన్నల రోషన్ మణిదీ్‌పరెడ్డి టాపర్‌గా నిలిచాడు. శ్రీకాకుళం విద్యార్థిని కోరుకొండ శ్రావ్యకు రెండో ర్యాంకు దక్కింది. పల్నాడు జిల్లా విద్యార్థి వెన్న ప్రవీణ్‌కుమార్ రెడ్డి మూడో ర్యాంకు సాధించాడు. హైదరాబాద్‌కు చెందిన తెల్లూరి శ్రేయాస్ రెడ్డికి ఐదో ర్యాంకు లభించింది. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో విజయనగరం విద్యార్థి శంబంగి జశ్వంత్‌నాయుడు టాపర్‌గా నిలిచాడు. కూకట్‌పల్లి (తెలంగాణ) విద్యార్థి కుడుముల వెంకట మహంత్ అక్షజ్‌రెడ్డి రెండో ర్యాంకు, కృష్ణా జిల్లా విద్యార్థిని కొండ్రెడ్డి హారిక దేవిశ్రీ అనూహ్య మూడో ర్యాంకు సాధించారు. కాగా, ఈఏపీసెట్ ఫలితాలను గురువారం ప్రకటిస్తామని పేర్కొన్న విద్యాశాఖ ఒకరోజు ముందే వెల్లడించింది. ఈ ఫలితాలను మంత్రి లోకేశ్ బుధవారం విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగానికి 2,76,572 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 2,58,545 మంది పరీక్ష రాశారు. 1,82,317 (70.52శాతం) మంది అర్హత సాధించారు. అబ్బాయిలు 1,44,828 మంది పరీక్ష రాయగా 1,00,844 (69.63శాతం) అర్హత సాధించారు. అమ్మాయిలు 1,13,717 మంది పరీక్ష రాస్తే 81,473 (71.65శాతం) అర్హత సాధించారు. కాగా, ఇంజనీరింగ్‌లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు నూరు శాతం అర్హత సాధించడం విశేషం. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 70,929 పరీక్ష రాస్తే 63,546 (89.59శాతం) మంది అర్హత సాధించారు. ఈ విభాగంలో అబ్బాయిలు 70,929 మంది పరీక్షకు హాజరైతే 63,546 (89.59శాతం) అర్హత సాధించారు. అమ్మాయిలు 54,628 మంది పరీక్ష రాస్తే 48,839(89.4శాతం) అర్హత సాధించారు.

న్యూరాజిస్టునవుతా!
‘‘ఇటీవల నీట్ రాశాను. ఢిల్లీ ఎయిమ్స్‌లో మెడిసిన్ సీటు సాధించగలనన్న నమ్మకం ఉంది. న్యూరాలజిస్ట్‌గా సమాజానికి సేవలందించాలన్నది నా ఆకాంక్ష. ఆ లక్ష్యంతోనే కష్టపడి చదివాను. రోజుకు 18 గంటల పాటు శ్రమించాను. నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహం మరువలేనిది. నీట్ ర్యాంకు కోసం ఎదురుచూస్తున్నా. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈఏపీసెట్‌లో 144.53 మార్కులు వచ్చాయి.’’
- జశ్వంత్‌నాయుడు(అగ్రికల్చర్, ఫార్మసీ స్టేట్ ఫస్ట్, విజయనగరం)

సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడతా
‘‘ఈఏపీసెట్, ఇంజనీరింగ్ విభాగంలో 1వ ర్యాంకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నత స్థాయిలో స్థిరపడతా. జేఈఈ మెయిన్స్‌లో 15 ర్యాంక్ రావడంతో ఐఐటీ ఢిల్లీలో సీటు వచ్చింది. మా నాన్న సుబ్బారెడ్డి లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. మా ఇద్దరు అక్కలు ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. నేను కూడా అదేరంగాన్ని ఎంచుకున్నా.’’
- జొన్నల రోషన్ మణిదీప్ రెడ్డి(ఇంజనీరింగ్ 1వ ర్యాంకు, గుంటూరుజిల్లా, తాడేపల్లి)

కంప్యూటర్ సైన్స్ చేస్తా
‘‘ఈఏపీసెట్ ఫలితాల్లో ఇంజనీరింగ్ విభాగంలో స్టేట్ సెకండ్ ర్యాంకు దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. జేఈఈ మెయిన్స్‌లో కూడా జాతీయస్థాయిలో 108వ ర్యాంకు సాధించా. జేఈఈ అడ్వాన్స్‌లో 111వ ర్యాంకు, తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో స్టేట్ 17వ ర్యాంకు దక్కింది. మద్రాస్ ఐఐటీలో కంప్యూటర్ సైన్సులో సీటు వచ్చింది. సైన్స్‌లో ఆసక్తి పెరగడానికి బస్వా సురేశ్ మాస్టారే కారణం. సివిల్స్ రాసి ఐఏఎస్ కావాలనేది లక్ష్యం.’’
- కోరుకొండ శ్రావ్య (శ్రీకాకుళం జిల్లా పొందూరు)

సీఎస్ఈలో చేరతా!
‘‘ఈఏపీసెట్ ఫలితాల్లో ఇంజనీరింగ్ విభాగంలో 3వ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. మాది సాధారణ వ్యవసాయ కుటుంబం. జేఈఈ అడ్వాన్స్‌లో 34వ ర్యాంకు సాధించా. ఐఐటీ ముంబైలోని సీఎస్ఈలో చేరాలని నిర్ణయించుకున్నా.’’
- వెన్నా ప్రవీణ్‌కుమార్‌రెడ్డి (పల్నాడు జిల్లా అచ్చంపేట)