డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పెకలించేస్తాం
ABN , Publish Date - Apr 26 , 2026 | 06:03 AM
యువత భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తున్న డ్రగ్స్ నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో పెకలించడమే ‘ఈగల్’ ప్రధాన లక్ష్యమని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా అన్నారు.
7 వేల కేసుల పరిష్కారానికి 13 కోర్టులు: డీజీపీ
మంగళగిరిలో ’ఈగల్’ హెడ్‌క్వార్టర్స్ ప్రారంభం
అమరావతి, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): యువత భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తున్న డ్రగ్స్ నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో పెకలించడమే ‘ఈగల్’ ప్రధాన లక్ష్యమని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా అన్నారు. మెరుగైన పనితీరుతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈగల్ విభాగం.. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ తరహాలో ఎదిగిందని తెలిపారు. మంగళగిరిలో శనివారం ఈగల్ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని ఐజీ ఆకె రవికృష్ణతో కలిసి ఆయన ప్రారంభించి, మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 11వేల ఎకరాల్లో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడంతో పాటు 112మంది కరడుగట్టిన స్మగ్లర్లపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ కేంద్రాన్ని ప్రారంభించామని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పదివేల కిట్లతో పరీక్షలు చేయనున్నట్లు వెల్లడించారు. గంజాయి, డ్రగ్స్ గ్యాంగ్‌ల ఆర్థిక మూలాలను దెబ్బతీసి వారిని జైలుకు పంపుతున్నామన్నారు. ఏడువేలకు పైగా విచారణలో ఉన్న ఎన్‌డీపీఎస్ కేసుల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా 13 కోర్టుల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు డీజీపీ వివరించారు. మత్తు రహిత రాష్ట్రంగా ఏపీని మార్చేందుకు ఈగల్ కృషి చేస్తుందని డీజీపీ స్పష్టం చేశారు. యూనిఫాం సర్వీసుల్లో ఉన్నవారికి వ్యక్తిగత వీక్‌నెస్‌లు హద్దులు దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒకరిద్దరు చేసిన పొరపాట్లు, తప్పులకు పోలీసుశాఖకు సంబంధం ఉండదని, అది వారి వ్యక్తిగతమని పేర్కొన్నారు. హద్దులు దాటిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలోని 70 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే ఒక్కరు కూడా మత్తుబారిన పడకుండా రక్షించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ‘డ్రగ్స్ వద్దు బ్రో..’ అంటూ చైతన్యవంతం చేసే కార్యక్రమాలు మొదలుపెడతామని వివరించారు. కార్యక్రమంలో ఐజీలు ఆర్. జయలక్ష్మి, రాజకుమారి, ఈగల్ ఎస్పీ మహేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు.