39 పోస్టులు భర్తీ కాలేదు!
ABN , Publish Date - Jun 02 , 2026 | 05:31 AM
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా నిర్వహించినట్లు క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన ...
పారదర్శకతకు ఇదే నిదర్శనం
క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్
అమరావతి, జూన్ 1(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా నిర్వహించినట్లు క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో శాప్ ఎండీ భరిణితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వచ్చిన వార్తలు, సందేహాల నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను సృష్టంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో ప్రతి దశను సాంకేతిక ఆధారిత ఆన్‌లైన్ విధానంలో నిర్వహించామని, అభ్యర్థులు దరఖాస్తు సమర్పణ నుంచి ఎంపిక వరకు ఎటువంటి వ్యక్తిగత సంప్రదింపులూ లేకుండానే ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా, అందులో 3 శాతం స్పోర్ట్స్ కోటాగా 421 పోస్టులను కేటాయించినట్లు తెలిపారు. వీటికి 3600 మంది అభ్యర్థులు 5326 దరఖాస్తులు సమర్పించగా, 382 పోస్టులు భర్తీ అయ్యాయని, ఇంకా 39 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయని వెల్లడించారు. నోటిఫై చేసిన మొత్తం పోస్టులు భర్తీ కాకపోవడమే పారదర్శకతకు నిదర్శనమన్నారు.