Share News

వైఎస్‌ హయాంలోనే డీఎస్సీలో అక్రమాలు

ABN , Publish Date - Aug 10 , 2026 | 04:28 AM

కూటమి ప్రభుత్వం నియమ, నిబద్ధతలతో నిర్వహించిన డీఎస్సీ నియామకాలను తప్పు పడుతున్న మాజీ సీఎంజగన్‌ ఆ అంశంపై అసెంబ్లీలో చర్చకు రావాలని..

వైఎస్‌ హయాంలోనే డీఎస్సీలో అక్రమాలు

  • అవినాశ్‌రెడ్డి సమీప బంధువుకు స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం

  • జగన్‌ అసెంబ్లీలో చర్చకు రావాలి: ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి

పులివెందుల, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం నియమ, నిబద్ధతలతో నిర్వహించిన డీఎస్సీ నియామకాలను తప్పు పడుతున్న మాజీ సీఎంజగన్‌ ఆ అంశంపై అసెంబ్లీలో చర్చకు రావాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి సవాల్‌ విసిరారు. కడప జిల్లా పులివెందులలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగ యువత ఎంతో కష్టపడి డీఎస్సీలో మెరిట్‌ సాధించి ఉద్యోగాలు సంపాదిస్తే వారిని వైసీపీ నాయకులు తప్పు పడుతున్నారన్నారు. జిల్లాలో ఎంపీ అవినాశ్‌రెడ్డి సమీప బంధువైన ఓ మహిళ డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం పొందారని తెలిపారు. మహిళ కాబట్టి తాను పేరు చెప్పడం లేదని, పేరు చెప్పమంటే చెప్పడానికి కూడా సిద్ధమని చెప్పారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో సచివాలయ ఉద్యోగుల నియామకాల్లో 2300 మంది స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు పొందారని, వారిలో చాలా పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లతో కూడా ఉద్యోగాలు పొందారని తెలిపారు. 2006లో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉన్న సమయంలో కడప జిల్లాలో డీఎస్సీ పరీక్ష విధానం ఎలా సాగిందో అందరికీ తెలుసని, పరీక్ష పత్రాలను(ఓఎంఆర్‌) హైదరాబాద్‌ తరలించే సమయంలో కర్నూలు వద్ద ఆపేసి ఓఎంఆర్‌ షీట్లను మార్చేశారని, ఆ వ్యవహారం సాగించింది వైఎస్‌ రక్తసంబంధీకులేనని చెప్పారు. జగన్‌ సీఎంగా ఉన్న సమయంలో గ్రూప్‌-1 నియామకాల తీరుపై కోర్టు చీవాట్లు పెట్టిన విషయం అందరికీ తెలుసన్నారు. పరీక్ష పత్రాలను ఒక హోటల్‌కు తరలించి తాడేపల్లె ప్యాలె్‌సలో ఉన్న వారితో ఇష్టమొచ్చినట్లుగా నాడు మార్కులు ఇచ్చారని ఆరోపించారు. ఈ రెండు కారణాలతో జగన్‌, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఇద్దరూ రాజీనామా చేసి ఉండాలని స్పష్టం చేశారు.

Updated Date - Aug 10 , 2026 | 04:29 AM