హారిజాంటల్ అమలు ఇలా!
ABN , Publish Date - Jun 07 , 2026 | 05:50 AM
హారిజాంటల్ రిజర్వేషన్... మెగా డీఎస్సీపై ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశమైంది. అసలు హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏమిటి? వర్టికల్‌కు, హారిజాంటల్‌కు మధ్య వ్యత్యాసమేంటి?
గతంలో మహిళా, దివ్యాంగులు, క్రీడాకారులు, మాజీ సైనికోద్యోగులకు ఫిక్స్‌డ్ రోస్టర్
కొత్త విధానంలో ఫిక్స్‌డ్ తొలగించి వర్తింపు
ఈ నాలుగు విభాగాల వారు మెరిట్‌లో ఉంటే...
వీరికి ప్రత్యేకంగా రిజర్వేషన్ వర్తించదు
లేకపోతే వారికి చివర్లో వర్తించేలా అమలు
ఏ సామాజిక కేటగిరీ అభ్యర్థి వస్తే... మెరిట్‌లో అదే కేటగిరీ అభ్యర్థితో సర్దుబాటు
అత్యంత సంక్లిష్టంగా హారిజాంటల్ విధానం
ఇది అర్థంకాకే డీఎస్సీ అభ్యర్థుల్లో అపోహలు
హారిజాంటల్ జీవో తీసుకొచ్చింది జగన్ సర్కారే
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
హారిజాంటల్ రిజర్వేషన్... మెగా డీఎస్సీపై ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశమైంది. అసలు హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏమిటి? వర్టికల్‌కు, హారిజాంటల్‌కు మధ్య వ్యత్యాసమేంటి? గతంలో రిజర్వేషన్లు ఎలా అమలు చేశారు? ఇప్పుడు ఎలా చేస్తున్నారు? అంటూ పలు ప్రశ్నలు అభ్యర్థులను తొలిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హారిజాంటల్ రిజర్వేషన్ గురించి ఒకసారి పరిశీలిద్దాం. వాస్తవానికి రోస్టర్ అంటేనే సంక్లింష్టమైన అంశం. రోస్టర్ పాయింట్లలో గందరగోళం చేశారంటూ తరచూ ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అమల్లోకి వచ్చిన హారిజాంటల్ రిజర్వేషన్ విధానం దీనికంటే అత్యంత సంక్లిష్టంగా తయారైంది. గతంలో వేరుగా చూపించి, ఇప్పుడు హారిజాంటల్‌లోకి మార్చడం మహిళా, దివ్యాంగులు(పీహెచ్), క్రీడాకారులు, మాజీ సైనికోద్యోగులకు రిజర్వేషన్ల అమలులో సంక్లిష్టతను పెంచింది. వాస్తవానికి ఈ హారిజాంటల్ రిజర్వేషన్లను అమల్లోకి తీసుకొచ్చింది గత వైసీపీ ప్రభుత్వమే. 2023 ఆగస్టు 2న దీనిపై జీవో 77ను నాటి జగన్ సర్కారు జారీ చేసింది. అప్పటినుంచీ విడుదల చేసిన అన్ని నోటిఫికేషన్లకు ఇదే విధానాన్ని అమలు చేశారు.
సమాంతరంగా హారిజాంటల్ అమలు
హారిజాంటల్ విధానం వచ్చిన తర్వాత వర్టికల్, హారిజాంటల్ రెండూ సమాంతరంగా అమలవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎ్‌సకు వర్టికల్ విధానం ఉంటే... వాటిలోనే అంతర్భాంగా అమలుచేయాల్సిన మహిళా, క్రీడా, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్లను హారిజాంటల్ విధానంలో అమలు చేస్తున్నారు. ఈ విధానంలో పై నాలుగు కేటగిరీలకు ఫిక్స్‌డ్ రోస్టర్‌ను తొలగించారు. ఎందుకంటే మొత్తం పోస్టుల్లో అటు మెరిట్‌లో గానీ, ఇటు రిజర్వ్‌డ్‌లో గానీ ఎక్కడైనా వారికి ఉద్యోగాలు దక్కితే సరిపోతుందనేది సుప్రీంకోర్టు తీర్పు ఉద్దేశం. ఈ కేటగిరీల అభ్యర్థులకు మెరిట్‌లో ఉద్యోగాలు లభిస్తే ప్రత్యేకంగా రిజర్వేషన్ అమలు చేయరు. లేకపోతే చివర్లో మెరిట్ అభ్యర్థుల స్థానంలో వీరిని సర్దుబాటు చేస్తారు.
అభ్యర్థులు ఎలా నష్టపోతారు?
ఉదాహరణకు... ఒక సబ్జెక్టులో 100 పోస్టులు ఉన్నాయి. అందులో పీహెచ్ అభ్యర్థులకు 4 పోస్టులు కేటాయించాలి. అన్ని రిజర్వేషన్లు అమలుచేశాక పరిశీలిస్తే ముగ్గురే పీహెచ్ అభ్యర్థులు ఎంపికైనట్లు గుర్తించారు. దీంతో మెరిట్ క్రమంలో వెనక ర్యాంకులు వచ్చిన వారిలో పీహెచ్ అభ్యర్థి కోసం చూడగా 400వ ర్యాంకులో బీసీ-బీ అభ్యర్థి ఉన్నారు. అప్పటికే రూపొందించిన జాబితాలో చివర్లో 99వ స్థానంలో ఉన్న బీసీ-బీ అభ్యర్థి స్థానంలో 400 ర్యాంకు అభ్యర్థిని తీసుకుంటారు. అలాగే 99 స్థానంలో ఉన్న బీసీ-బీ అభ్యర్థి స్థానంలో తీసుకున్న 400వ ర్యాంకు అభ్యర్థి పీహెచ్ సర్టిఫికెట్లు అనర్హమైనవిగా గుర్తించారు. దీంతో 450వ ర్యాంకులో ఉన్న మరో పీహెచ్ అభ్యర్థిని ముందుకు తీసుకొచ్చారు. అతను ఎస్సీ-3 కేటగిరీకి చెందిన వ్యక్తి. అతడిని బీసీ-బీ అభ్యర్థి స్థానంలో తీసుకోడం సాధ్యం కాదు. దీంతో మొదట తప్పించిన బీసీ-బీ అభ్యర్థిని తిరిగి తీసుకొచ్చారు. 97వ స్థానంలో ఉన్న ఎస్సీ-3 అభ్యర్థి స్థానంలో ఈ పీహెచ్ ఎస్సీ-3 అభ్యర్థిని తీసుకున్నారు. అప్పటికే 97వ ర్యాంకు అభ్యర్థి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. కానీ పీహెచ్ అభ్యర్థి తెరపైకి రావడంతో అతనికి ఉద్యోగం రాలేదు.
ఇవీ రిజర్వేషన్లు
ఓపెన్ కేటగిరీ- 40శాతం, బీసీ- 29శాతం, ఎస్సీ- 15శాతం, ఎస్టీ- 6శాతం, ఈడబ్ల్యూఎస్- 10శాతం చొప్పున రిజర్వేషన్లు ఉంటాయి. ఎస్సీల్లో కేటగిరీ-1కు 1ు, కేటగిరీ-2కు 6.5ు, కేటగిరీ-3కు 7.5 శాతం చొప్పున వర్తిసాయి. అలాగే బీసీ కోటాలోనూ బీసీ-ఏ 7శాతం, బీసీ-బీ 10శాతం, బీసీ-సీ 1శాతం, బీసీ-డీ 7శాతం, బీసీ-ఈకి 4శాతం చొప్పున కేటాయిస్తారు. మహిళల కోటా- 33.3 శాతం, క్రీడాకారుల కోటా- 3శాతం, మాజీ సైనికోద్యోగులు- 2 శాతం, దివ్యాంగులకు 4శాతం చొప్పున రిజర్వేషన్లు ఉంటాయి.
సర్దుబాటు ఎలా చేస్తారంటే..
ఉదాహరణకు బీసీ-ఏ కేటగిరీలో 10 పోస్టులున్నాయి. అందులో 3 మహిళలకు దక్కాలి. అంటే ఎంపికైన అభ్యర్థుల్లో ముగ్గురు మహిళలు తప్పనిసరిగా ఉండాలి. తొలుత 1 నుంచి 10 వరకు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వీరిలో ముగ్గురు మహిళలు లేకపోతే 8, 9, 10 స్థానాల్లో ఉన్న పురుష అభ్యర్థులను తప్పించి, వీరిని సర్దుబాటు చేస్తారు. అదే ఇద్దరు మహిళలు ఎంపికై ఉంటే, 10వ అభ్యర్థి స్థానంలో మాత్రమే మూడో మహిళను తీసుకుంటారు. గత విధానంలో మహిళలకు ముందే రోస్టర్ ఫిక్స్ చేసి ఉన్నందున చివరి వరకు వేచి చూడాల్సిన అవసరం ఉండేది కాదు.
డీఎస్సీలో ఎలా భర్తీ చేశారు?
మెగా డీఎస్సీలో క్రీడాకారుల కోటా అభ్యర్థులను ప్రాథమిక ఎంపిక జాబితాలో చూపించారు. ఆ తర్వాత ఓసీ కోటా, మిగిలిన సామాజిక కోటాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. అనంతరం హారిజాంటల్ విధానంలోని మహిళలు, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ విభాగాలను తీసుకున్నారు. ఒక్కో కేటగిరీ వారి కోటాలో వచ్చిన సంఖ్యకు సరిపడా అభ్యర్థులు ఉన్నారా? లేదా? అనేది చూశారు. ఒకవేళ ముందుగానే భర్తీ అయి ఉంటే చివర్లో ప్రత్యేకంగా ఆ కేటగిరీల అభ్యర్థుల కోసం వేచి చూడలేదు. లేకుంటే చివరి మెరిట్ అభ్యర్థుల స్థానంలో ఆ మూడు విభాగాల అభ్యర్థులను సర్దుబాటు చేశారు.
ఈ అభ్యర్థి ఇలా కోల్పోయాడు
హారిజాంటల్ విధానంలో ప్రకాశం జిల్లాకు చెందిన సీహెచ్ నరసింహారావు ఆండ్ర కేసు ఇంకా ప్రత్యేకమైంది. ఎస్సీ-3 కేటగిరీకి చెందిన ఈ అభ్యర్థి ఆర్థో డిజెబిలిటీ కోటాలో దరఖాస్తు చేసుకున్నారు. బయలాజికల్ సైన్స్ సబ్జెక్టులో ఆయనకు 76వ ర్యాంకు వచ్చింది. ఈ విభాగంలో మొత్తం 4 పోస్టులున్నాయి. 42, 51, 54 ర్యాంకుల అభ్యర్థులకు తొలుత ఉద్యోగాలొచ్చాయి. ఆ తర్వాత 76వ ర్యాంకులోపు మరో ముగ్గురున్నా వేర్వేరు కారణాలతో ఎంపిక కాలేదు. అయితే వర్టికల్ రిజర్వేషన్ ప్రకారం బీసీ-సీ కోటాలో మరో అభ్యర్థి అప్పటికే ఎంపికవడంతో నరసింహారావుకు అవకాశం దక్కలేదు.
వర్టికల్ రిజర్వేషన్‌లో ఇలా...
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు వర్తించే రిజర్వేషన్‌ను వర్టికల్ విధానంలో అమలుచేస్తారు. వీటికి ముందుగానే ఫిక్స్ చేసిన రోస్టర్ పాయింట్లు ఉంటాయి. 1 నుంచి 100 వరకు ఉండే రోస్టర్ సైకిల్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలు ఎవరు ఎక్కడ ఉండాలో స్థానాలు నిర్ణయించారు. గతంలో మొత్తం వర్టికల్ విధానమే ఉన్నప్పుడు ఈ సామాజిక వర్గాలతో పాటుగా మహిళా, క్రీడా, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలకు కూడా ఫిక్స్‌డ్ రోస్టర్ ఉండేది. ఆయా కేటగిరీల్లో ర్యాంకుల ఆధారంగా వరుస క్రమంలో ఆ రోస్టర్ పాయింట్‌లో వారిని ఎంపిక చేసేవారు. ఇందులో ఎలాంటి గందరగోళం ఉండేది కాదు.
మహిళలు... మిగిలిన కోటాలకు ఇదీ వ్యత్యాసం
హారిజాంటల్ విధానంలో ఉన్న నాలుగు విభాగాల్లో ప్రతిదానికీ మహిళల కోటా వర్తించాలి. అంటే ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాటిలో అంతర్ కేటగిరీల్లోనూ ప్రతిదానిలో 33.3 శాతం మహిళలకు కోటా ఉంటుంది. కానీ క్రీడా, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ కు ప్రతి విభాగంలో వారి కోటాలు వేర్వేరుగా వర్తింపజేయరు. మొత్తంగా 100 పాయింట్లను తీసుకుని అందులో వారు ఉన్నారా? లేదా? అనేది మాత్రమే చూస్తారు. దీనివల్ల ఈ మూడు కేటగిరీల అభ్యర్థులు ఏ సామాజిక కోటాలోకి వెళ్తారో నోటిఫికేషన్ సమయానికి తెలియదు.
సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచినా...
సర్టిఫికెట్ల పరిశీలనకు రెండు కారణాల వల్ల 1:1 నిష్పత్తిని మించి అభ్యర్థులను పిలవాల్సి వచ్చింది.ఎంపిక చేసిన పీహెచ్ అభ్యర్థుల సర్టిఫికెట్లు అనర్హమైనవి అని తేలితే వారి స్థానంలో పీహెచ్ కోటా అభ్యర్థిని మరొకరిని పిలిచారు. రెండోసారి ఎంపిక చేసిన పీహెచ్ అభ్యర్థి సామాజికవర్గం మారితే అదే సామాజివర్గంలో జనరల్ మెరిట్‌లో అప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థి ఉద్యోగాన్ని కోల్పోయారు.
ఒక అభ్యర్థి ఎస్జీటీ, ఎస్‌ఏ, పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేశాడు. ఫలితాల్లో అతను ఎస్‌ఏ, పీజీటీ పోస్టులకు మెరిట్ జాబితాలోకి వచ్చాడు. సర్టిఫికెట్ల పరిశీలనలో పీజీటీకి సరైన అర్హత లేకపోవడంతో అతడిని ఎస్‌ఏ పోస్టుకు ఎంపిక చేశారు. అతను పీజీటీ పోస్టు తీసుకుంటాడని భావించిన అధికారులు ఎస్‌ఏ పోస్టు కోసం మెరిట్ జాబితాలోని తర్వాత అభ్యర్థిని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. చివరకు ఆ రెండో అభ్యర్థిని పక్కన పెట్టాల్సి వచ్చింది.