Share News

నా బిడ్డల మీద ఒట్టు

ABN , Publish Date - Aug 22 , 2026 | 04:22 AM

‘‘నా ఇద్దరు పిల్లల సాక్షిగా చెబుతున్నా. మెరిట్‌లోనే ఉద్యోగం తెచ్చుకున్నాను. డీఎస్సీలో అక్రమాలు జరగలేదు’’ అని శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన డీఎస్సీ విజేత జ్యోతి తెలిపారు.

నా బిడ్డల మీద ఒట్టు

  • మెరిట్‌లోనే ఉద్యోగం సాధించా

  • డీఎస్సీలో అక్రమాలు జరగలేదు

  • ఉపాధ్యాయిని జ్యోతి భావోద్వేగం

  • మంత్రి సవిత సమక్షంలో పిల్లలపై ప్రమాణం

  • డీఎస్సీ విజేతలను కలిసిన మంత్రి

పెనుకొండ టౌన్‌, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి) : ‘‘నా ఇద్దరు పిల్లల సాక్షిగా చెబుతున్నా. మెరిట్‌లోనే ఉద్యోగం తెచ్చుకున్నాను. డీఎస్సీలో అక్రమాలు జరగలేదు’’ అని శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన డీఎస్సీ విజేత జ్యోతి తెలిపారు. మంత్రి సవిత సమక్షంలో ఆమె తన బిడ్డలపై ప్రమాణం చేశారు. డీఎస్సీ 2025లో ఉద్యోగాలు సాధించిన పెనుకొండ వాసుల ఇళ్లకు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి సవిత శుక్రవారం వెళ్లారు. తన క్యాంపు కార్యాలయం నుంచి ద్విచక్రవాహనంలో వెళ్లిన మంత్రి.. కొత్త ఉపాధ్యాయులు జ్యోతి, గంగాధర్‌ను వారి ఇళ్లలో కలిశారు. డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణల ప్రస్తావన ఈ సందర్భంగా రాగా, జ్యోతి ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రితో అన్నారు. ‘‘2025 డీఎస్సీలో సోషల్‌ స్డడీస్‌ విభాగంలో నాకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మూడో ర్యాంకు, శ్రీసత్యసాయి జిల్లాలో మొదటి ర్యాంకు వచ్చింది. టీజీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌.. రెండు ఉద్యోగాలనూ సాధించాను. ప్రస్తుతం పెనుకొండ ఉన్నత పాఠశాలలో సోషల్‌ ఉపాధ్యాయినిగా పని చేస్తున్నాను.’’ అని తెలిపారు. తన సోదరుడు కూడా డీఎస్సీ రాశాడని, వారికి ఉద్యోగం రాలేదన్నారు. ‘‘వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతీస్తోంది. వివాహం జరిగిన 15 ఏళ్ల తరువాత అనంతపురంలో శిక్షణ పొంది ఉద్యోగం సాధించాను. నిరుద్యోగ అభ్యర్థుల మనసులు గెలుచుకోవాలంటే వైసీపీ ఉద్యోగావకాశాలు కల్పించాలి. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం మంచిదికాదు.’’ అని అన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, వైసీపీ ప్రవర్తన దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు ఉందని అన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 04:23 AM