ఔషధాలకు ‘పరీక్ష’!
ABN , Publish Date - Apr 04 , 2026 | 04:17 AM
రాష్ట్రంలో ఔషధ పరీక్షలు నాసిరకంగా జరుగుతున్నాయి. ప్రజల ప్రాణాలు నిలిపే ఔషధాలు నకిలీవా.. ఒరిజినలా.. వాటిలోని రసాయనాల స్థాయి ఎంత? అని పరీక్షించే ప్రయోగశాలల్లో సిబ్బంది కొరత కారణంగా పరీక్షలు సరైన విధంగా సాగడం లేదు.
డ్రగ్ ల్యాబ్స్‌లో ఇష్టానుసారంగా మందులు, సిర్‌పల పరీక్షలు
అర్హత లేనివారూ టెస్ట్ చేస్తున్న వైనం
తీవ్రస్థాయిలో సిబ్బంది కొరతే కారణం
విశాఖలో ల్యాబ్‌కు తాళాలు వేసే పరిస్థితి
వెయ్యి శాంపిల్స్ టెస్ట్ చేసే సామర్థ్యం ఉన్నా నెలకు 400 శాంపిల్స్ మాత్రమే టెస్టింగ్
రూ.కోట్ల ఖర్చుతో ల్యాబ్స్ నిర్మించిన కేంద్రం
70 మంది ఉండాల్సి చోట.. 28 మందే విధులు
సిబ్బందిని నియమించకపోతే ఇబ్బందులే
రాష్ట్ర ఔషధ పరీక్షా ప్రయోగశాలలకు(డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్) ‘పరీక్షా కాలం’ నడుస్తోంది!. ప్రజలకు నాణ్యమైన మందులు అందాలంటే టెస్టింగ్ ల్యాబ్స్ పకడ్బందీగా పని చేయాలి. అప్పుడే నాసిరకం మందులకు చెక్ పడి.. రోగులకు నాణ్యమైన మందులు అందుతాయి. కానీ, రాష్ట్రంలో ఔషధాల నాణ్యతా పరీక్షలు సక్రమంగా జరిగే పరిస్థితి కనిపించడం లేదు. సిబ్బంది కొరతే దీనికి కారణంగా కనిపిస్తోంది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో ఔషధ పరీక్షలు నాసిరకంగా జరుగుతున్నాయి. ప్రజల ప్రాణాలు నిలిపే ఔషధాలు నకిలీవా.. ఒరిజినలా.. వాటిలోని రసాయనాల స్థాయి ఎంత? అని పరీక్షించే ప్రయోగశాలల్లో సిబ్బంది కొరత కారణంగా పరీక్షలు సరైన విధంగా సాగడం లేదు. విజయవాడలో రాష్ట్రస్థాయి ప్రయోగశాల, విశాఖ, కర్నూలులో ప్రాంతీయ ప్రయోగశాలలు ఉన్నాయి. అయితే, విజయవాడ మినహా మిగిలిన రెండు ల్యాబుల్లో ఆశించిన స్థాయిలో ఔషధ నాణ్యతా పరీక్షాలు జరగడం లేదు. విశాఖపట్నంలోని డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌కు దాదాపు తాళాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం రూ.కోట్ల నిధులు వెచ్చించి ల్యాబ్ భవనం నిర్మించడంతో పాటు టెస్టింగ్ పరికరాలు కూడా అందించింది. కేవలం సిబ్బంది కొరత కారణంగా ఇక్కడ టెస్టింగ్ సక్రమంగా జరగడం లేదు. విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు ల్యాబ్స్‌లో కలిపి వెయ్యి డ్రగ్ శాంపిల్స్ పరీక్షించాలి.
కానీ, కేవలం 400 శాంపిళ్లకు మాత్రమే టెస్టింగ్ జరుగుతోంది. విశాఖపట్నం ల్యాబ్‌లో మరీ దారుణంగా నెలకు 20 శాంపిళ్లు మాత్రమే టెస్ట్ చేస్తున్నారు. కర్నూలులో కొంత మెరుగ్గా శాంపిల్స్ టెస్టింగ్ జరుగుతున్నా, ల్యాబ్స్‌కు వచ్చే మొత్తం శాంపిల్స్‌ను టెస్ట్ చేయలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం డ్రగ్ టెస్టింగ్ ల్యాబుల్లో సిబ్బంది కొరతేనని తెలిసింది. విజయవాడలోని స్టేట్ ల్యాబ్‌లో ముగ్గురు సీనియర్ సైంటఫిక్ ఆఫీసర్లు, ఐదుగురు జూనియర్ సైంటఫిక్ ఆఫీసర్లు, 40 మంది అనలిస్టులు ఉండాలి. కానీ కేవలం సీనియర్ సైంటఫిక్ ఆఫీసర్లు ఇద్దరు, జూనియర్ సైంటఫిక్ ఆఫీసర్లు ముగ్గురు, 15 మంది అనలిస్టులు ఉన్నారు. అలానే.. నిబంధనల ప్రకారం రీజనల్ టెస్టింగ్ ల్యాబుల్లో ఒక సీనియర్ సైంటఫిక్ ఆఫీసర్, ముగ్గురు జూనియర్ సైంటఫిక్ ఆఫీసర్లు, 8 మంది అనలిస్టులు ఉండాలి. కానీ రెండు రీజనల్ టెస్టింగ్ ల్యాబ్స్‌లో సరిపడా సిబ్బంది అందుబాటులో లేరు. కర్నూలులో జూనియర్ సైంటఫిక్ ఆఫీసర్లు ఒకరు, ముగ్గురు అనలిస్టులు మాత్రమే ఉన్నారు. విశాఖపట్నం ల్యాబ్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఒక జూనియర్ సైంటఫిక్ ఆఫీసరు ఉన్నా ఆయన విజయవాడలోనే ఉంటున్నారు. అలాగే ముగ్గురు అనలిస్టులు ఉన్నప్పటికి ఒక్కరు కూడా పని చేయడం లేదని తెలిసింది. విశాఖపట్నం ల్యాబ్‌కు నెలకు 40 డ్రగ్ శాంపిల్స్ వస్తున్నాయి. విజయవాడలో ఉండే జూనియర్ సైంటఫిక్ ఆఫీసర్ అప్పుడప్పుడు వెళ్లి చిన్నా చితకా శాంపిల్స్‌ను టెస్ట్ చేస్తున్నారు. జిల్లాల నుంచి వచ్చే మిగిలిన శాంపిల్స్ మొత్తం మూలనపడుతున్నాయి. ఈ ల్యాబ్స్ పట్ల నిర్లక్ష్యం కారణంగా నాసిరకం మందులు గుర్తించడంలో ఆరోగ్యశాఖ విఫలమవుతోంది.
2022 నుంచే ఇలా..
ఈ మధ్య కాలంలో ఒక సైంటిఫిక్ ఆఫీసర్ ఒక ఇంజెక్షన్‌లో కంటికి కనిపించే ఘన పదార్థాలున్నా.. ఆ ఇంజెక్షన్ బాగుందని రిపోర్టు ఇచ్చారు. టెస్టింగ్ ల్యాబుల్లో ఈ వ్యవహారం 2022 నుంచి నడుస్తోంది. ఈ విషయాలు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో డ్రగ్స్ నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్‌పై ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక దృష్టిసారించడంతో పాటు సిబ్బందిని నియమించి బలోపేతం చేస్తే తప్ప ఈ అక్రమాలు ఆగేలా లేవని సిబ్బంది అంటున్నారు.
వెయ్యి శాంపిళ్ల సామర్థ్యం..
రాష్ట్రంలో మూడు ల్యాబ్స్‌లో కలిపి వెయ్యి శాంపిళ్లను టెస్ట్ చేసే సామర్థ్యం ఉంది. కానీ, మూడు ల్యాబ్స్‌లో కలిపి 400 శాంపిల్స్ మాత్రమే టెస్ట్ చేస్తున్నారు. అందులో విజయవాడలోని స్టేట్ ల్యాబ్ కాస్త ఎక్కువ మంది సిబ్బంది ఉండడంతో పాటు ఎక్కువ శాంపిల్స్ టెస్టింగ్ జరుగుతోంది. విజయవాడ ల్యాబ్‌కు నెలకు దాదాపు 600 శాంపిల్స్ వస్తున్నాయి. విశాఖపట్నం ల్యాబ్‌కు 80, కర్నూలు ల్యాబ్‌కు 120 శాంపిల్స్ వస్తున్నాయి. మరోవైపు సిబ్బంది కొరతతో కొంత మంది సైంటిఫిక్ ఆఫీసర్లు.. వారికి అర్హత లేని శాంపిల్స్ కూడా టెస్టింగ్ చేస్తూ రిపోర్టులు ఇస్తున్నారని సమాచారం. ల్యాబ్స్‌కు మూడు రకాల శాంపిల్స్‌ను డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు పంపిస్తారు. ట్యాబ్లెట్స్‌తో పాటు సిర్‌పలు, ఇంజెక్షన్లకు సంబంధించిన శాంపిళ్లను సేకరించి ల్యాబ్స్‌కు పంపుతారు. వీటిని సీనియర్ లేదా జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్లు వారి అర్హత ఆధారంగా టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంజెక్షన్లను పరీక్షించాలంటే డ్రగ్ యాక్ట్‌లోని షెడ్యూల్-సీ కింద గుర్తింపు ఉండాలి. సిబ్బంది కొరత కారణంగా కొంత మంది సైంటిఫిక్ ఆఫీసర్లు అర్హత లేకపోయినా ఇంజెక్షన్లను టెస్ట్ చేస్తున్నారు. దీంతో పాటు నాసిరకం ఇంజెక్షన్లను కూడా నాణ్యత కలిగిన మందుల జాబితాలో చేరుస్తున్నారు.